వాష్ రూమ్స్ లేకపోవడంతో నీళ్లు తాగడం ఆపేశా..!
కొన్ని సినిమాల కథ రిత్యా అత్యంత కఠిన పరిస్థితుల నడుమ చిత్రీకరించాల్సి ఉంటుంది
By: Tupaki Desk | 5 March 2024 6:52 AM GMTకొన్ని సినిమాల కథ రిత్యా అత్యంత కఠిన పరిస్థితుల నడుమ చిత్రీకరించాల్సి ఉంటుంది. ప్రాణాపాయం ఉన్న లొకేషన్స్ లో కూడా చిత్రీకరణ జరిపిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటి ఒక సినిమా గామి. ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విశ్వక్ సేన్ గామి సినిమా ను హిమాలయాలు, కశ్మీర్, వారణాసి వంటి లొకేషన్స్ లో చిత్రీకరించారు.
ఇప్పటికే గామి సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ట్రైలర్ ను చూసిన ప్రేక్షకులు సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అన్నట్లుగా వెయిట్ చేస్తున్నారు. మార్చి 8న విడుదల అవ్వబోతున్న గామి సినిమాలో హీరోయిన్ గా తెలుగు అమ్మాయి చాందిని చౌదరి నటించిన విషయం తెల్సిందే.
తాజాగా చాందిని గామి సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చి షూటింగ్ సమయంలో తాము ఎదుర్కొన్న సవాళ్లను వివరించి అందరిని ఆశ్చర్యపరిచింది. కథ నేపథ్యం హిమాలయాలు, కశ్మీర్ మరియు వారణాసి కనుక మొత్తం షూట్ ను అక్కడే చేయాల్సి వచ్చింది.
హిమాలయాల్లో మైనస్ 30 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య చిత్రీకరణ చేస్తున్న సమయంలో చాలా సమస్యలు ఎదురు అయ్యాయి. హిమాలయాలకు చిత్ర యూనిట్ సభ్యులందరం కూడా ఎర్లీ మార్నింగ్ వెళ్లి సాయంత్రం సమయంకు తిరిగి వచ్చేవాళ్లం. టీం అందరిలో నేను ఒక్కదాన్నే అమ్మాయిని.
షూటింగ్ కోసం హిమాలయాలు వెళ్లిన సమయంలో అక్కడ వాష్ రూమ్స్ ఉండేవి కాదు. దాంతో ఉదయం నీళ్లు తాగి మళ్లీ రాత్రి వరకు ఏమీ తాగకుండా ఉండేదాన్ని. అలా దాదాపు నెల రోజుల పాటు కఠిన పరిస్థితుల నడుమ గామి చిత్రీకరణ జరిపినట్లుగా చాందిని చౌదరి తెలియజేసింది.
గామి కథ చెప్పినప్పుడే నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. ప్రతి విషయంలో కూడా దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమాను రూపొందించారు. విశ్వక్‌సేన్ తో పాటు అందరి పాత్రలు కూడా అద్భుతంగా ఉండి ప్రేక్షకులను కట్టిపడేస్తాయని చాందిని పేర్కొంది.