సంక్రాంతికి సిద్ధమే అంటున్నారు.. కానీ!
తాజాగా ఈ విషయం మీద డైరెక్టర్ చందు మొండేటి స్పందించారు. మరో 10 రోజులు షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉందని, జనవరికి రెడీగా ఉంటామని ప్రకటించారు.
By: Tupaki Desk | 30 Oct 2024 4:57 AM GMTఇప్పటికైతే సంక్రాంతికి రెండు సినిమాలు ఫిక్స్ అయ్యాయి. రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' మూవీని జనవరి 10న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. డేట్ చెప్పలేదు కానీ బాలయ్య 109వ చిత్రాన్ని కూడా అదే టైంలో రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్మెంట్ వచ్చింది. ఇదే క్రమంలో మరికొన్ని సినిమాలు పండక్కి వస్తున్నామని చెబుతున్నారు. అందరూ సంక్రాంతికి సిద్ధమే అంటున్నారు కానీ, చివరకు ఏయే సినిమాలు బరిలో ఉంటాయనేది క్లారిటీ రావడం లేదు.
వెంకటేశ్ - అనిల్ రావిపూడి కాంబోలో రూపొందుతున్న సినిమాని పొంగల్ సీజన్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ప్రారంభం నుంచే చెబుతూ వస్తున్నారు. దానికి తగ్గట్టుగానే 'సంక్రాంతికి వస్తున్నాం' అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించి, పండక్కే తీసుకురావాలనే టార్గెట్ తోనే షూటింగ్ ప్లాన్ చేసుకున్నారు. కానీ దిల్ రాజు బ్యానర్ లోనే రూపొందుతున్న 'గేమ్ ఛేంజర్' మూవీ ఆల్రెడీ సంక్రాంతికి లైన్ లో ఉండటంతో, ఆయన నిర్మిస్తున్న వెంకీ సినిమా వస్తుందా లేదా? అనే చర్చలు గత కొన్ని రోజులుగా జరుగుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో సంక్రాంతికి కలుద్దాం అని వెంకీ మామ ట్వీట్ చేశారు. సినిమా 90శాతం షూటింగ్ పూర్తయిందనికి, డబ్బింగ్ కూడా మొదలైందని, త్వరలోనే టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తామని అన్నారు. దీన్ని అనిల్ రావిపూడి సైతం రీట్వీట్ చేశారు. రీసెంట్ గా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఒకడుగు ముందుకేసి, 'సంక్రాంతికి వస్తున్నాం' అనే టైటిల్ ను కూడా ప్రకటించేసింది. పొంగల్ కే వస్తున్నామని చెప్పింది.
ఇంత జరుగుతున్నా దిల్ రాజు బ్యానర్ మాత్రం SVC58 సినిమా సంక్రాంతికి వస్తుందని చెప్పడం లేదు. బిగ్ స్క్రీన్స్ మీద మీ అందరినీ అలరించేందుకు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటోందని మాత్రమే పేర్కొన్నారు. పండక్కి కలుద్దామనే మాట చెప్పలేదు.. వెంకటేశ్ ట్వీట్ ని రీట్వీట్ చేయలేదు. త్వరలోనే టైటిల్, ఫస్ట్ లుక్ వస్తాయని మాత్రం చెప్పారు. అందుకే వెంకీ పోస్ట్ పెట్టినప్పటికీ, సినిమా చెప్పిన సమయానికి వస్తుందా రాదా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
మరోవైపు నాగచైతన్య నటిస్తున్న 'తండేల్' సినిమాని కూడా సంక్రాంతికి తీసుకొస్తారానికి చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయం మీద డైరెక్టర్ చందు మొండేటి స్పందించారు. మరో 10 రోజులు షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉందని, జనవరికి రెడీగా ఉంటామని ప్రకటించారు. కానీ రామ్ చరణ్ సినిమా నిర్మాత అల్లు అరవింద్, వెంకీమామ సినిమా వస్తోందని చైతూ ఆలోచిస్తే మాత్రం.. సంక్రాంతికి రాకపోవచ్చని అన్నారు. క్రిస్మస్ కు సినిమా రెడీ అవ్వదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.
'క' ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన హీరో నాగచైతన్య సైతం తండేల్ విడుదల విషయంలో క్లారిటీ ఇవ్వలేకపోయారు. ఎప్పుడొచ్చినా దుల్లకొట్టేస్తాం అంటున్నారు కానీ, ఎప్పుడు రిలీజ్ అనేది మాత్రం చెప్పలేదు. ఏదైనా అప్డేట్ అల్లు అరవింద్ చెప్తేనే బాగుంటుందని అన్నారు. గీతా ఆర్ట్స్ లో వర్క్ చేస్తే మంచి రిలీజ్ ఇస్తారనే ధైర్యం ఉంటుందని, అల్లు అరవింద్ మీద తనకు పూర్తి నమ్మకం ఉందని, బెస్ట్ డెసిషన్ తీసుకుంటారని చైతన్య చెప్పారు.
అల్లు అరవింద్ తన మేనల్లుడి సినిమా గురించి ఆలోచిస్తే మాత్రం 'తండేల్' మూవీ సంక్రాంతికి రాదనే విషయం స్పష్టమవుతోంది. ఒకవేళ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాని విడుదల చేయకపోతే మాత్రం, నాగచైతన్య చిత్రానికి అవకాశం ఉంటుంది. పొంగల్ డేట్ ను త్యాగం చెయ్యొద్దని అక్కినేని ఫ్యాన్స్ అంటున్నారు. దిల్ రాజు బ్యానర్ నుంచే రెండు సినిమాలు రిలీజ్ చెయ్యకుండా, ఒక సినిమాని తర్వాత విడుదల చేసుకోవచ్చు కదా? అని ప్రశ్నిస్తున్నారు. రిపబ్లిక్ డే ఆదివారం వస్తోంది కాబట్టి, ఇలాంటి మంచి సీజన్ మిస్ చేసుకుంటే సమ్మర్ కు వెళ్ళిపోవలసి వస్తుందని అభిప్రాయ పడుతున్నారు.
ఇదిలా ఉంటే సందీప్ కిషన్ 'మజాకా' మూవీని సైతం సంక్రాంతికి సిద్ధం చేస్తున్నారు. థియేటర్ల సమస్య ఉంటుంది కాబట్టి.. బాలకృష్ణ సినిమా డేట్ లాక్ చేసి, నాగచైతన్య & వెంకటేశ్ సినిమాల రిలీజ్ లపై క్లారిటీ వచ్చిన తర్వాతే మజాకా విడుదలను ప్లాన్ చేసుకునే ఛాన్స్ వుంది. మధ్యలో మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అనే డబ్బింగ్ చిత్రాన్ని కూడా ఫెస్టివల్ సీజన్ లో తీసుకొస్తున్నట్లు చెబుతున్నారు. ఇలా చాలా సినిమాలు పెద్ద పండక్కి రెడీ అంటున్నాయి కానీ, చెప్పిన టైంకి వస్తాయా లేదా? అనేది తెలియడం లేదు. మరి త్వరలోనే వీటన్నింటిపై స్పష్టత ఇస్తారేమో చూడాలి.