టిక్కెట్ దక్కని సీనియర్లకు చంద్రబాబు మార్కు హామీ!
అవును... టీడీపీ రెండో విడత జాబితా విడుదల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి
By: Tupaki Desk | 15 March 2024 1:01 PM GMTబీజేపీ - జనసేనతో పొత్తులో భాగంగా టీడీపీకి 144 స్థానాల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలివిడతలో భాగంగా 94 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించినప్పటితో పోలిస్తే... తాజాగా 34 మందితో రెండో జాబితా ప్రకటించినప్పుడు ఎఫెక్ట్ గట్టిగా పడింది. అది కాస్తా కూటమిలో పార్టీలకు కూడా పాకింది. ఇందులో భాగంగా ఓడిపోయే సీట్లు తమకు అంటగట్టారని బీజేపీ నేతలు చెబితే... పవన్ కు పిఠాపురంలో బ్యాడ్ వెల్ కం చెప్పారు టీడీపీ నేతలు. ఈ సమయంలో చంద్రబాబు రంగంలోకి దిగారు.
అవును... టీడీపీ రెండో విడత జాబితా విడుదల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా... మాజీమంత్రి గంటా శ్రీనివాస రావు, బండారు సత్యనారాయణ మూర్తి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కేఎస్ జవహార్, ఆలపాటి రాజా, కొమ్మాలపాటి శ్రీధర్, పీతల సుజాత, బోడె ప్రసాద్, ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ మొదలైన నేతల నియోజకవర్గాల్లో వారి వారి అనుచరులు సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు.
ఈ నేపథ్యంలో టిక్కెట్ దక్కని సీనియర్లను తన నివాసానికి పిలిపించుకుని చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఈ సమయంలో పలువురు నేతలకు తనదైన హామీలు ఇస్తున్నారని అంటున్నారు. అయితే... ఎమ్మెల్సీ, రాజ్యసభ వంటి హామీలు ఈ పూటకు బుజ్జగించడానికే తప్ప ఎన్నికలయ్యాక అలాంటివేమీ గుర్తుండవని బోడె ప్రసాద్ లాంటి వారు వ్యాఖ్యానిస్తుండగా.. మరికొంతమంది మాత్రం బాబు మాటలు నమ్మి, కూల్ అవుతున్నారని తెలుస్తుంది.
ఇందులో భాగంగా... పెదకూరపాడు టికెట్ భాష్యం ప్రవీణ్ కు ప్రకటించారు చంద్రబాబు. దీంతో... స్థానిక మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సమయంలో శ్రీధర్ ను జీవీ ఆంజనేయులు వెంటపెట్టుకుని బాబు నివాసానికి తీసుకొచ్చారు. ఈ సమయంలో శ్రీధర్ రాజకీయ భవిష్యత్తుకు చంద్రబాబు హామీ ఇచ్చారని తెలుస్తుంది. పార్టీ అధికారంలోకి రాగానే తగిన ప్రాధాన్యత ఇస్తామని చెప్పినట్లు సమాచారం.
ఇదే సమయంలో... టీడీపీ ఏపీ మాజీ ఇన్ ఛార్జ్, ఎచ్చెర్ల ఇన్ ఛార్జిగా ఉన్న కళా వెంకట్రావు పేరు కూడా రెండో జాబితాలో లేని సంగతి తెలిసిందే. దీంతో ఇంతటి సీనియర్లను సైతం పక్కనపెట్టడం ఏమిటంటూ ఆయన వర్గీయుల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో ఆయన కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇదే క్రమంలో.. పెనమలూరు ఇన్ ఛార్జ్ బోడె ప్రసాద్, కాకినాడ మాజీ ఎమ్మెల్యే కొండబాబుని సైతం చంద్రబాబు బుజ్జగించే ప్రయత్నం చేశారని తెలుస్తుంది.
ఈ సమయంలో టిక్కెట్లు దక్కని సీనియర్లను కొంతమందిని ఇంటికి పిలిపించుకుని.. మరికొంతమందిని ఫోన్ లో లైన్ లోకి తీసుకుని మాట్లాడుతున్న బాబు... భారీ హామీలు ఇస్తూ బుజ్జగిస్తున్నారని, కలిసి పనిచేయాలని కోరుతున్నారని తెలుస్తుంది. మరి వీరిలో ఎంతమంది చల్లబడతారు.. మరెంతమంది మరింత వేడెక్కుతారు అనేది వేచి చూడాలి!