Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : చంద్రముఖి-2

By:  Tupaki Desk   |   28 Sep 2023 10:33 AM GMT
మూవీ రివ్యూ : చంద్రముఖి-2
X

'చంద్రముఖి-2' మూవీ రివ్యూ

నటీనటులు: రాఘవ లారెన్స్-కంగనా రనౌత్-లక్ష్మీ మీనన్-మహిమ నంబియార్-రాధికా శరత్ కుమార్-వడివేలు-మనోబాల తదితరులు

సంగీతం: కీరవాణి

ఛాయాగ్రహణం: ఆర్.డి.రాజశేఖర్

మాటలు: రాజేష్ మూర్తి

నిర్మాత: సుభాస్కరన్

రచన-దర్శకత్వం: పి.వాసు

రెండు దశాబ్దాల కిందట తమిళ-తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సినిమా 'చంద్రముఖి'. దానికి కొనసాగింపుగా ఇన్నేళ్ల తర్వాత చంద్రముఖి-2 తీశాడు పి.వాసు. రజినీ స్థానంలోకి రాఘవ లారెన్స్ రాగా.. చంద్రముఖి పాత్రను కంగనా రనౌత్ చేసింది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

గాయత్రి దేవి (రాధికా శరత్ కుమార్) కుటుంబంలో కొన్ని అనూహ్య ఘటనలు జరిగి.. వ్యాపారంలోనూ నష్టాలు రావడంతో ఒక సిద్ధాంతి సూచన మేరకు వారి పూర్వీకుల ఊరికి చెందిన గుడికి వెళ్లి ప్రత్యేక పూజ చేయడానికి సిద్ధమవుతుంది. ఆ గుడికి దగ్గర్లో ఉన్న ఒక పెద్ద భవంతిని లీజుకు తీసుకుని ఆ కుటుంబ సభ్యులందరూ.. పూజ పూర్తయ్యే వరకు అక్కడే ఉండాలని నిర్ణయించుకుంటారు. కానీ ఆ అక్కడికి వెళ్లిన దగ్గర్నుంచి రకరకాల సమస్యలు మొదలవుతాయి. ఆ ఇంట్లో ఉన్న చంద్రముఖి ఆత్మ ఆ కుటుంబంలో ఒకరిని ఆవహిస్తుంది. మరి చంద్రముఖి ఆత్మ ఎవరిని ఆవహించింది.. ఈ సమస్య ఎలా పరిష్కారం అయింది అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

దక్షిణాదిన అత్యంత భారీ విజయం సాధించిన చిత్రాల్లో ఒకటైన 'చంద్రముఖి' ఒరిజినల్ సినిమా కాదు. మలయాళంలో 90వ దశకం ఆరంభంలో వచ్చిన 'మణిచిత్రతాళు'ను రీమేక్ చేశాడు పి.వాసు. ఒరిజినల్ చూస్తే కొత్తగా పి.వాసు చేసిందేమీ లేదని అర్థమవుతుంది. బేసిగ్గా కథలోని బలానికి.. సూపర్ స్టార్ రజినీకాంత్ చరిష్మా.. జ్యోతిక అద్భుత నటన తోడై ఆ సినిమా అసాధారణ విజయాన్నందుకుంది. హార్రర్ కామెడీ అనే కొత్త జానర్ ఈ చిత్రంతోనే పాపులర్ అయి.. ఆ తర్వాత ఈ కోవలో పదుల సంఖ్యలో సినిమాలు వచ్చాయి. కానీ ఈ జానర్ సినిమాలన్నీ ఒక మూసలో సాగిపోవడంతో కొన్నేళ్లకు జనాలకు మొహం మొత్తేసింది. హార్రర్ కామెడీ అంటేనే బెంబేలెత్తిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు చంద్రముఖి-2 తీసిన పి.వాసు ఆల్రెడీ 'చంద్రముఖి'కి కొనసాగింపుగా తెలుగులో 'నాగవల్లి' అనే 'కళాఖండం' తీసి మన ప్రేక్షకుల తలలు బొప్పి కట్టేలా చేశాడు. ఇక లారెన్స్ నటుడిగా-దర్శకుడిగా హార్రర్ కామెడీ జానర్ ను ఎంతగా అరగదీశాడో తెలిసిందే. ఇలాంటి కలయికలో ఇన్నేళ్ల తర్వాత మళ్లీ 'చంద్రముఖి-2' వచ్చింది. ఆల్రెడీ ఒకసారి 'నాగవల్లి'తో చంద్రముఖిని చెడగొట్టింది చాలదని.. ఇప్పుడు 'చంద్రముఖి' పేరే పెట్టుకుని ఆ బ్లాక్ బస్టర్ మూవీకి ఇంకో 'నకిలీ'ని తయారు చేశాడు పి.వాసు. కథ పరంగా.. నటన పరంగా చూస్తే ఇది చంద్రముఖి సీక్వెలా లేక చంద్రముఖి స్పూఫా అన్న సందేహం కలగక మానదు.

రజినీకాంత్ ను అందరూ ఒక స్టార్ గా చూస్తారే తప్ప.. మంచి నటుడిగా గుర్తించరు. ఆయనకున్న స్టార్ ఇమేజ్.. తన స్టైల్.. చరిష్మా.. తనలోని నటుడు బ్యాక్ సీట్ తీసుకునేలా చేస్తుంటాయి. ఐతే రజినీ ఎంత గొప్ప నటుడు అన్నది 'చంద్రముఖి'లో రాజు పాత్రలో కనిపించే కొన్ని సన్నివేశాలు చూస్తే అర్థమవుతుంది. మంచి నటుడిగా పేరున్న విక్టరీ వెంకటేష్ సైతం 'నాగవల్లి'లో రజినీని మరిపించలేక.. ఆయన ముందు తేలిపోయాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అలాంటిది రజినీ స్థానంలో రాఘవ లారెన్స్ అంటే ఆ ఊహే భయపెడుతుంది. ఇక సినిమాలో లారెన్స్ రజినీ స్థానంలో చూడటం ఒక రకంగా ప్రేక్షకులకు శిక్ష అనే చెప్పాలి. రజినీ ఎంతో సటిల్ గా.. మెస్మరైజ్ చేసేలా నటించిన పాత్రలో లారెన్స్ చేసిన అతి అంతా ఇంతా కాదు. అతడి నటన.. హావభావాలు ప్రేక్షకులను మామూలుగా ఇరిటేట్ చేయవు. తన అతికి.. పి.వాసు ఔట్ డేటెడ్ నరేషన్ తోడై.. 'చంద్రముఖి-2' వెటకారంగా తయారైంది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే కొన్ని సీన్లను మినహాయిస్తే 'చంద్రముఖి-2' చూడటం ప్రేక్షకులకు ఒక పరీక్షే.

నటీనటులు వేరు అన్న మాటే తప్ప.. చాలా వరకు 'చంద్రముఖి'కి.. 'చంద్రముఖి-2'కు పెద్దగా తేడా కనిపించదు. కథ దాదాపుగా ఒకే రకంగా నడుస్తుంది. ఒక పెద్ద కుటుంబంలో సమస్య రావడం.. వాళ్లు పరిహారం కోసం ఒక పూజ చేయడానికి సిద్ధపడటం.. అందులో భాగంగా చంద్రముఖి ఆత్మ ఉన్న ఇంటికి రావడం.. అక్కడ అనుకోని సంఘటనలు జరగడం.. ఇలా మొత్తం 'చంద్రముఖి' చూస్తున్న ఫీలింగే కలుగుతుంది. కానీ 'చంద్రముఖి' చూస్తున్నపుడు కలిగే ఉత్కంఠ.. భయం.. మధ్య మధ్యలో వినోదం.. ఇవేవీ ఇందులో కనిపించవు. 'చంద్రముఖి'ని అనుకరిస్తున్నట్లు సాగే కథాకథనాలు ఏమాత్రం ఆసక్తి రేకెత్తించవు. చంద్రముఖి ఆత్మ ఎవరిని ఆవహించింది అనే విషయంలో ప్రేక్షకులకు తప్పుడు అంచనాలు కలిగేలా కొన్ని సీన్లు పెట్టి.. ఇంటర్వెల్ దగ్గర ట్విస్ట్ ఇవ్వాలని చూశారు కానీ.. చంద్రముఖి.. నాగవల్లి సినిమాలు చూసిన వాళ్లకు ఈ ప్యాటర్న్ అర్థం కావడం ఎంతమాత్రం కష్టం కాదు. పిల్లల్ని అడిగినా ఆత్మ ఎవరిని ఆవహించిందో చెప్పేస్తారు. స్వామీజీగా రావు రమేష్ పాత్రను డిజైన్ చేసిన తీరు.. ఆయనకు వేసిన మేకప్ చూస్తేనే ఈ సినిమాను జనాలు సీరియస్ గా తీసుకోవడం కష్టమని అర్థమవుతంది.

'చంద్రముఖి-2' అంతో ఇంతో ఆసక్తి రేకెత్తించేది ఫ్లాష్ బ్యాక్ మొదలయ్యాకే. కంగనా రనౌత్ రంగ ప్రవేశంతో కథ కొంచెమైనా సీరియస్ గా నడుస్తుంది. ఫ్లాష్ బ్యాక్ ను సైతం తన ఓవరాక్షన్ తో చెడగొట్టడానికి లారెన్స్ శత విధాలా ప్రయత్నించాడు కానీ.. బేసిగ్గా కథలో ఉన్న కొంచెం ఆసక్తి.. కంగనా రనౌత్ అందం-అభినయం ప్రేక్షకులను కొంతమేర ఎంగేజ్ చేస్తాయి. కానీ ఫ్లాష్ బ్యాక్ లో చంద్రముఖి కథ ఎలా ముగుస్తుందనే విషయంలోనూ పెద్ద ఉత్కంఠేమీ ఉండదు. 'నాగవల్లి'నే అటు ఇటు తిప్పి తీసేశాడు పి.వాసు. ఫ్లాష్ బ్యాక్ ఒక దశ వరకు పర్వాలేదనిపించినా.. అది మరీ సుదీర్ఘంగా సాగి ఎప్పుడు ముగుస్తుందా అని నిరీక్షించేలా చేస్తుంది. కథ తిరిగి వర్తమానంలోకి వచ్చాక చెప్పుకోవడానికి ఇంకేమీ లేదు. ముగింపు అంచనాలకు తగ్గట్లే ఉంటుంది. 'చంద్రముఖి' క్లైమాక్స్ ఎంతో ఉత్కంఠభరితంగా.. థ్రిల్లింగ్ గా అనిపిస్తే.. ఇక్కడ మాత్రం ఏదో కామెడీ సీన్ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. 'చంద్రముఖి' బాగా నచ్చిన వాళ్లు కావాలంటే మళ్లీ ఇంకోసారి ఆ షో వేయొచ్చు కానీ.. సీక్వెల్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటే మాత్రం కష్టమే.

నటీనటులు:

రాఘవ లారెన్స్ శైలి తెలిసిన వాళ్లు అతను చేసే అతికి ప్రిపేరై థియేటర్లో అడుగు పెట్టాలి. హార్రర్ కామెడీ సినిమాల్లో అతను ఎలా నటిస్తాడో చాలా సినిమాల్లో చూశాం. ఇందులో కొత్తదనం ఏమీ లేదు. రాజు పాత్రలో అతను చేసిన ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు. రజినీ కనిపించిన కాసేపు ఎంత కుదురుగా ఆ పాత్రను పోషించాడో చూశాం. కానీ ఇందులో లారెన్స్ తన మార్కు అతి నటనతో విలయ తాండవం చేశాడు. ఆ పాత్రనే కాక సినిమాను కూడా ఏమాత్రం సీరియస్ గా తీసుకోలేని పరిస్థితి కల్పించాడు. కంగనా రనౌత్ కొన్ని సీన్లలో బాగా కనిపించింది. నటన కూడా ఓకే. కానీ కొన్ని చోట్ల మాత్రం ఇంత మంచి నటి ఇలాంటి హావభావాలిస్తోందేంటి అని ఆశ్చర్యపోతాం. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఆమె నిరాశ పరస్తుంది. లక్ష్మీ మీనన్.. జ్యోతికను కనీసం మ్యాచ్ చేయలేకపోయింది. తన పాత్రను కూడా పేలవంగా తీర్చిదిద్దారు. మహిమా నంబియార్.. రాధికా శరత్ కుమార్.. వీళ్లంతా పాత్రల పరిధిలో నటించారు. వడివేలు కనీస స్థాయిలో కూడా నవ్వించలేకపోయాడు. అయ్యప్ప పి.శర్మ బాగా చేశాడు. రావు రమేష్ గెటప్ కామెడీగా తయారై ఆయన పాత్రను లైట్ తీసుకునేలా చేసింది.

సాంకేతిక వర్గం:

కీరవాణి సంగీతం సినిమాకు ప్లస్ కాలేదు. ఆయనేదో అన్యమనస్కంగా పాటలు.. నేపథ్య సంగీతం చేసినట్లు అనిపిస్తుంది. 'చంద్రముఖి'లోని ఐకానిక్ గా అనిపించే లీడ్ సాంగ్ ముందు ఇందులో కీరవాణి చేసింది తేలిపోయింది. మిగతా పాటలు కూడా అంతంతమాత్రమే. నేపథ్య సంగీతం కూడా ఏమంత గొప్పగా లేదు. రాజశేఖర్ ఛాయాగ్రహణంలో విశేషం ఏమీ లేదు. లైకా వాళ్లు సినిమా మీద బాగానే ఖర్చు చేశారు. భారీ సెట్టింగ్స్ వేసి గ్రాండ్ గానే సినిమా తీశారు. రైటర్ కమ్ డైరెక్టర్ పి.వాసు ఇంకా ఎన్నేళ్లు 'చంద్రముఖి'ని అరగదీస్తూ కూర్చుంటారో అర్థం కాదు. మలయాళం నుంచి కథను అరువు తెచ్చుకుని.. దాన్నే అటు ఇటు తిప్పి సినిమాలు తీస్తున్నారు. ఆయన నరేషన్ పూర్తిగా ఔట్ డేటెడ్ స్టయిల్లో సాగింది. రచయితగా కానీ.. దర్శకుడిగా కానీ.. ఆయన ఏమాత్రం మెప్పించలేకపోయాడు.

చివరగా: చంద్రముఖి-2.. డబుల్ ఫ్రస్టేషన్

రేటింగ్ - 1.75/5