ఇక 'చంద్రముఖి' కథ ముగిసినట్లేనా?
దక్షిణాదిలో ఇక 'చంద్రముఖి' కథ ముగిసినట్లేనా? మళ్లీ 'చంద్రముఖి'ని టచ్ చేసే సాహసం ఎవరూ చేయకపోవచ్చా? అంటే అవుననే అనాలేమో
By: Tupaki Desk | 2 Oct 2023 6:57 AM GMTదక్షిణాదిలో ఇక 'చంద్రముఖి' కథ ముగిసినట్లేనా? మళ్లీ 'చంద్రముఖి'ని టచ్ చేసే సాహసం ఎవరూ చేయకపోవచ్చా? అంటే అవుననే అనాలేమో. రజనీకాంత్-జ్యోతిక ప్రధాన పాత్రల్లో పి. వాసు తెరకెక్కించిన హారర్ థ్రిల్లర్ 'చంద్రముఖి' మొదటి భాగం ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఇది ఓ కన్నడ సినిమాకి రీమేక్ అయినా తమిళ..తెలుగు భాషల్లో మంచి భారీ విజయాన్ని సాధించింది. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించిన చిత్రంగా నిలిచింది. దీంతో 'చంద్రముఖి' కి ఇంకా చాలా భాగాలున్నాయని ఆనాడే ప్రకటించడం అంతకంతకు ప్రాంచైజీ పై అంచనాలు పెంచేసింది.
ఈ నేపథ్యంలో అదే దర్శకుడు విక్టరీ వెంకటేష్ తో 'నాగవల్లి' అనే సినిమా తెరకెక్కించారు. 'చంద్రముఖి' ప్రాంచైజీ నుంచి వచ్చిన చిత్రమిది. కానీ అంచనాలు అందుకోవడంలో విఫలమైంది. పైపెచ్చు ఇలాంటి సినిమా తీసారేంటి? అని విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. భారీగా తారాగణం తప్ప సినిమాలో అసలు విషయం లేదని తొలి షోతోనే తేలిపోయింది. ఆ తర్వాత దశాబ్దం పాటు పి. వాసు చంద్రముఖి జోలికి వెళ్లలేదు. అయితే 2023 లో లారెన్స్..కంగన లాంటి నటులతో 'చంద్రముఖి -2'ని తెరకెక్కించి ఈ మధ్యనే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
అసలు 'చంద్రముఖి' ఎవరు? ఆమె గతం ఏంటి? అన్నది ఈ భాగంలో చర్చించే ప్రయత్నం చేసారు.
కానీ అది దారుణంగా బెడిసి కొట్టింది. ఈ సినిమాలో కొత్తగా చెప్పిందేం లేదని తేలిపోయింది. చంద్రము ఖినే మళ్లి తిప్పి తీసినట్లు ఉంది తప్ప కొత్తదనం లేదని విమర్శలు తెరపైకి వచ్చాయి. సామాన్య ప్రేక్షకుడు సైతం సినిమాకి కనెక్ట్ అయినట్లు కనిపించలేదు. అయితే ఈ సినిమా ప్రచారం సమయంలో లారెన్స్ చంద్రముఖి-3 కూడా ఉంటుందని ప్రకటించారు.
చంద్రముఖి -2 విజయం సాధిస్తుంది అన్న నమ్మకంలో ఆయన ఆ వ్యాఖ్యలు చేసారు. కానీ తాజా సన్నివేశం చూస్తుంటే చంద్రముఖి కథ ఇక్కడితో ముగిసినట్లేనని నెటి జనులు భావిస్తున్నారు. పాత కథనే మళ్లి తిప్పి తీయడం కంటే అలా వదిలేసినంత ఉత్తమం ఉండదంటున్నారు. చంద్రముఖి తర్వాత రిలీజ్ అయిన రెండు భాగాలు వైఫల్యం చెందడం తోనే ఈ రకమైన నెగిటివ్ ఫీడ్ బ్యాక్ తెరపైకి వస్తోంది.