గుర్తు పట్టలేనంతగా మారిపోయి షాకిచ్చిన హీరో
టాలీవుడ్ యువహీరోలు అఖిల్, నిఖిల్, రామ్, నితిన్, ప్రిన్స్, నాగశౌర్య లాంటి స్టార్లు తమ రూపాన్ని మార్చుకోవడం కోసం ఎంతగా శ్రమించారో చూసాం.
By: Tupaki Desk | 15 May 2024 2:20 PM GMTనేటితరం హీరోల పట్టుదల శ్రమను ప్రశంసించి తీరాల్సిందే. రోజూ 2 గం.లు పైగా శ్రమిస్తూ పిక్చర్ పర్ఫెక్ట్ ఫిట్ బాడీని తయారు చేయాలంటే దానికోసం అహోరాత్రులు శ్రమించాల్సి ఉంటుంది. 6 ప్యాక్ 8 ప్యాక్ అంటూ స్పెషల్ లుక్ కావాలంటే దానికోసం ఇంకా ఎక్కువగా శ్రమించాలి. జిమ్ కోచ్ కి లక్షల్లో చెల్లించాల్సి ఉంటుంది. కానీ యువహీరోలు కష్టానికి, పెట్టుబడికి వెనకాడటం లేదు. వారిలో పట్టుదల ఎంతో స్ఫూర్తిని నింపుతోంది. టాలీవుడ్ యువహీరోలు అఖిల్, నిఖిల్, రామ్, నితిన్, ప్రిన్స్, నాగశౌర్య లాంటి స్టార్లు తమ రూపాన్ని మార్చుకోవడం కోసం ఎంతగా శ్రమించారో చూసాం.
ఇప్పుడు బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ అలాంటి పరివర్తనతో ఆశ్చర్యపరిచాడు. చాక్లెట్ బోయ్ లా స్మార్ట్ గా కనిపించే కార్తీక్ ఇప్పుడు నిజమైన అథ్లెట్ లా మారాడు. అతడు తన రూపాన్ని పూర్తిగా మార్చేశాడు. ముఖకవళికలు మారాయి... బుగ్గలు లాగేశాయి.. కండరాలు మెలితిరిగాయి. ఛాతీ ..హ్యాండ్స్.. తొడ కండరాలు మెలితిరిగాయి.. పొట్ట భాగంలో సిక్స్ ప్యాక్ కనిపిస్తోంది. లంగోటి కట్టుకుని పరుగెడుతున్నాడు. అతడు అలా పరుగెత్తుతుంటే నిజమైన అథ్లెట్ నే తలపిస్తున్నాడు. ప్రస్తుతం తాను నటిస్తున్న 'చందు ఛాంపియన్' కోసం ఇంతగా శ్రమించానని కార్తీక్ తెలిపాడు. ఈ పాత్ర కోసం సిద్ధం కావడానికి తాను అనుసరించిన కఠినమైన వ్యాయామ దినచర్య గురించి కార్తీక్ గతంలో మాట్లాడాడు. ఇప్పుడు అభిమానులు చివరకు అతడి శ్రమ ఫలాలను చూస్తున్నారు. బుధవారం మేకర్స్ కార్తీక్ చిత్రం నుంచి మొదటి పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఇందులో కార్తీక్ లంగోటలో పరుగుపెడుతూ టోన్డ్ ఫిజిక్‌ను ప్రదర్శిస్తున్నారు.
తొలి పోస్టర్ షేర్ చేసిన కార్తీక్ ఆసక్తికర క్యాప్షన్ రాసాడు. ఛాంపియన్ ఆ రహా హై... నా కెరీర్‌లో అత్యంత ఛాలెంజింగ్ రోల్.. అలాగే ప్రత్యేకమైన చిత్రం చందు చాంపియన్. 14 జూన్ నుంచి థియేటర్లలో అందుబాటులో ఉంటుంది. మొదటి పోస్టర్‌ను షేర్ చేసినందుకు చాలా ఉత్సాహంగా, గర్వంగా ఉంది అని క్యాప్షన్ ఇచ్చాడు. కార్తీక్ లుక్‌పై పలువురు సెలబ్రిటీలు ప్రశంసాపూర్వకంగా వ్యాఖ్యానించారు. నిమ్రత్ కౌర్ అతడి రూపాన్ని 'పిచ్చి' అని వ్యాఖ్యానించింది. అయితే భూమి పెడ్నేకర్ 'వాహ్' అని తన ఉత్సాహాన్ని వ్యక్తం చేసింది. హుమా ఖురేషి, 'అర్రీయీ వాహ్' అని రాశారు.
అంతకుముందు కార్తీక్ 'చందు ఛాంపియన్' ర్యాప్-అప్ పార్టీ నుండి ఒక వీడియోను షేర్ చేసాడు. చందు ఛాంపియన్ తన కెరీర్‌లో కష్టతరమైన చిత్రాలలో ఒకటిగా ఎలా నిలిచిందో వెల్లడించాడు. ఈ చిత్రం కోసం తాను శారీరకంగా పరివర్తన చెందానని.. ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం పాటు సీరియస్ గా మేకోవర్ కోసం ప్రయత్నించానని వెల్లడించాడు. ఒక సంవత్సరం తర్వాత చివరకు స్వీట్ తిన్నానని, సంవత్సరం కంటే ఎక్కువ కాలం పాటు ప్రపంచవ్యాప్తంగా 8 నెలల పగలు-రాత్రి షూట్‌లలో పాల్గొన్నానని కూడా తెలిపాడు. కార్తీక్ ఆర్యన్ చందు ఛాంపియన్ కోసం 9000 అడుగుల ఎత్తులో థ్రిల్లింగ్ అనిపించే 8 నిమిషాల వార్ సీక్వెన్స్ షూట్లో పాల్గొన్నాడు. జీవితకాలం పాటు ఆదరించే జ్ఞాపకమిది అని అన్నాడు.
చందు ఛాంపియన్ కథ 1970 కామన్వెల్త్ గేమ్స్.. 1972 జర్మనీలో జరిగిన పారాలింపిక్స్‌లో దేశం గర్వించేలా చేసిన బంగారు పతక విజేత మురళీకాంత్ పేట్కర్ జీవితం ఆధారంగా రూపొందింది. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. సాజిద్ నదియాద్వాలా తెరకెక్కించిన ఈ చిత్రం 14 జూన్ 2024న విడుదల కానుంది.ఈ చిత్రంలో కొత్త నటి భాగ్యశ్రీ, ‘ఫర్జీ’ ఫేమ్ భువన్ అరోరా, రాజ్‌పాల్ యాదవ్, విజయ్ రాజ్ తదితరులు నటించారు.