'ఛాంగురే బంగారు రాజా' మూవీ రివ్యూ
బంగార్రాజు (కార్తీక్ రత్నం) ఆంధ్రా ప్రాంతంలోని ఒక ఊరిలో మెకానిక్ గ్యారేజీ నడుపుకునే కుర్రాడు. తన తండ్రి పోగొట్టిన 30 ఎకరాల పొలాన్ని తిరిగి తెచ్చుకోవాలనే లక్ష్యంతో అతను డబ్బులు కూడబెట్టే పనిలో ఉంటాడు.
By: Tupaki Desk | 15 Sep 2023 3:29 PM GMT'ఛాంగురే బంగారు రాజా' మూవీ రివ్యూ
నటీనటులు: కార్తీక్ రత్నం-గోల్డీ నిస్సీ-సత్య-నిత్యశ్రీ-రవిబాబు-అజయ్-ఎస్తేర్ తదితరులు
సంగీతం: కృష్ణ సౌరభ్
ఛాయాగ్రహణం: సుందర్
మాటలు: జనార్దన్ పసుమర్తి
నిర్మాత: రవితేజ
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సతీష్ వర్మ
టాలీవుడ్ సీనియర్ హీరో రవితేజ ఈ మధ్య ప్రొడక్షన్లో కూడా అడుగు పెట్టాడు. ఆయన నిర్మాణంలో తెరకెక్కిన చిన్న సినిమా 'ఛాంగురే బంగారు రాజా' ఆసక్తికర ట్రైలర్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. కొత్త దర్శకుడు సతీష్ వర్మ రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ: బంగార్రాజు (కార్తీక్ రత్నం) ఆంధ్రా ప్రాంతంలోని ఒక ఊరిలో మెకానిక్ గ్యారేజీ నడుపుకునే కుర్రాడు. తన తండ్రి పోగొట్టిన 30 ఎకరాల పొలాన్ని తిరిగి తెచ్చుకోవాలనే లక్ష్యంతో అతను డబ్బులు కూడబెట్టే పనిలో ఉంటాడు. అందుకోసం ఊర్లో అందరితోనూ చాలా కఠినంగా ఉంటాడు. కానీ బంగార్రాజు దురుసుతనం వల్ల అతడికి ఊర్లో శత్రువులు ఎక్కువైపోతారు. అలాంటి సమయంలోనే బంగార్రాజుతో అప్పటికే కొన్నిసార్లు గొడవ పడ్డ వ్యక్తి హత్యకు గురవుతాడు. పోలీసులు.. బంగార్రాజునే అనుమానించి అరెస్ట్ చేస్తారు. బెయిల్ మీద బయటికి వచ్చిన బంగార్రాజు అసలు హంతకుడు ఎవరో తెలుసుకోవాలని సొంతంగా పరిశోధన మొదలుపెడతాడు. ఈ క్రమంలోనే తన హత్యకు ఎవరో కుట్ర చేసినట్లు అతడికి తెలుస్తుంది. ఇంతకీ బంగార్రాజును టార్గెట్ చేసింది ఎవరు.. అసలు హంతకుడు ఎవరు.. ఈ విషయాలన్నీ తెర మీదే చూసి తెలుసుకోవాలి.
కథనం-విశ్లేషణ: తరాలు మారుతున్నా ప్రేక్షకులను ఎంటైర్టైన్ చేస్తున్న జానర్లలో క్రైమ్ కామెడీ ఒకటి. అందరూ వెళ్లే దారిలో కాకుండా కొంచెం కొత్త రూట్లో వెళ్లాలనుకునే దర్శకులు ఈ జానర్ తోనే ప్రయాణం మొదలుపెడుతుంటారు. 'ఛాంగురే బంగారు రాజా'తో యువ దర్శకుడు సతీష్ వర్మ కూడా అదే ప్రయత్నం చేశాడు. రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో ఫేమస్ అయిన రంగురాళ్ల చుట్టూ కొత్త సెటప్ లో ఓ కథను అల్లుకున్నాడు. రంగురాళ్ల నేపథ్యంలో ఒక మర్డర్.. ఆ మిస్టరీని ఛేదించే క్రమంలో కొంచెం వినోదం.. కొంచెం థ్రిల్ ఇస్తూ సినిమాను నడిపించే ప్రయత్నం చేశాడు. ఐతే రెండు గంటలకు పైగా ప్రేక్షకులను కుదురుగా కూర్చోబెట్టే స్థాయిలో ఈ సినిమా వినోదాన్ని పంచలేకపోయింది.. థ్రిల్ చేయలేకపోయింది. కానీ ఇది తీసిపడేయదగ్గ సినిమా కాదు. కొత్త కాన్సెప్ట్.. అక్కడక్కడా కొంచెం కామెడీ.. కొన్ని ట్విస్టులతో కొంతమేర 'ఛాంగురే బంగారు రాజా' ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది.
ఒక హత్య జరిగితే.. దానికి ముందు.. తర్వాత జరిగిన పరిణామాలను.. దాన్ని వేర్వేరు వ్యక్తుల దృక్కోణం నుంచి చూపించే ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో 'ఛాంగురే బంగారు రాజా'ను మలచడానికి దర్శకుడు ప్రయత్నించాడు. మూడు కోణాలకు సంబంధించి మూడు ఎపిసోడ్లు చూపించి.. చివరగా అసలు వాస్తవం ఏంటి అన్నది మరో ఎపిసోడ్లో చర్చించి సినిమాను ముగించాడు. కథను ఇలా చెప్పాలనుకోవడం కొత్తగా అనిపిస్తుంది. కాకపోతే.. మర్డర్ మిస్టరీ విషయంలో ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసేలా సన్నివేశాలను తీర్చిదిద్దుకోలేకపోయాడు. చాలా సీన్లు లైట్ అన్నట్లు సాగిపోతాయే తప్ప బిగి కనిపించదు. మర్డర్ కేసుకు సంబంధించి వారం రోజుల్లో హీరోను ఇరికించాలని ఎస్ఐ అనుకుంటే.. ఆరు రోజుల్లోనే హంతకుడిని పట్టుకుంటానంటూ సవాల్ చేసిన హీరో.. తనకు తానుగా ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. ఐతే అసలు హంతకుడి కోసం అతను వేట సాగించే వైనం సాధారణంగా అనిపిస్తుంది. హత్య జరిగిన ప్రదేశం నుంచి వెళ్లిన బైక్.. తన స్నేహితుడి దగ్గర దొరికిందని.. అతనే హంతకుడు అంటూ హీరో తన మీద పడిపోవడం సిల్లీగా అనిపిస్తుంది.
ఐతే ఆ స్నేహితుడి పాత్రలో నటించిన సత్య మాత్రం తన దృక్కోణంలో కథ సాగే ఎపిసోడ్లో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నించాడు. ఆపై సుపారీ కిల్లర్ గా రవిబాబు పాత్ర ఎంట్రీ ఇస్తుంది. అక్కడ్నుంచి కథ అతడి దృక్కోణంలో నడుస్తుంది. ఊరికే గందరగోళానికి గురయ్యే కిల్లర్ గా రవిబాబు కొంత మేర కామెడీ పండించాడు. కానీ అక్కడక్కడా కామెడీ ఓకే అనిపిస్తుందే తప్ప.. ఈ కథను ప్రేక్షకులు ఏ దశలోనూ సీరియస్ గా తీసుకోలేని.. ఉత్కంఠ రేకెత్తించని విధంగా సినిమా నడవడం మైనస్ అయింది. కథను మొదలుపెట్టిన 'రంగురాళ్ల' పాయింట్ దగ్గరే ముగించడం మంచి ఎత్తుగడే. కానీ ప్రేక్షకులను చివర్లో సర్ప్రైజ్ చేయాలనో ఏమో.. మధ్యలో ఆ విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేశాడు దర్శకుడు. రంగురాళ్ల కాన్సెప్ట్ జనాలకు పెద్దగా తెలియకపోవడం.. తెర మీద దాన్ని పైపైన చూపించడం వల్ల దాని తాలూకు ఇంటెన్సిటీని ప్రేక్షకులు ఫీల్ కాని పరిస్థితి తలెత్తుతుంది. విలన్ పాత్ర.. దాన్ని పోషించిన నటుడు కూడా సాధారణంగా అనిపించడం వల్ల కూడా సినిమా వెయిట్ తగ్గింది. 'ఛాంగురే బంగారు రాజా'కు ఇంట్రెస్టింగ్ సెటప్ కుదిరింది. కామెడీ కొంతమేర వర్కవుట్ అయింది. కానీ ఇంటెన్సిటీ.. పరుగులు పెట్టించే కథనం లేకపోవడం మైనస్ అయ్యాయి. క్రైమ్ కామెడీ సినిమాలను ఇష్టపడేవాళ్లు మరీ అంచనాలు పెట్టుకోకుండా చూస్తే 'ఛాంగురే బంగారు రాజా' ఓకే అనిపించొచ్చు.
నటీనటులు: 'కేరాఫ్ కంచరపాలెం' ఫేమ్ కార్తీక్ రత్నం బంగార్రాజు పాత్రలో బాగానే చేశాడు. అతడి నటన సహజంగా సాగింది. కాకపోతే ఇలా ఓ సినిమాను తన భుజాల మీద మోసే స్టామినా అతడికి కొరవడింది. హీరోయిన్ గోల్డీ నిస్సీ చూడ్డానికి చాలా సాధారణంగా అనిపిస్తుంది. తన పాత్ర.. నటన ఏమంత విశేషంగా అనిపించవు. ఎలాంటి పాత్రలో అయినా తన ముద్ర వేసే సత్య.. తాతారావు పాత్రలో ఆకట్టుకున్నాడు. సినిమాలో అతడి కామెడీనే రిలీఫ్. రవిబాబు కూడా బాగానే చేశాడు. విలన్ పాత్రలో నటించిన ఆర్టిస్ట్ మాత్రం నిరాశ పరిచాడు. ఆ పాత్రే అంత బలహీనంగా ఉంది. అజయ్.. మిగతా నటీనటులు ఓకే.
సాంకేతిక వర్గం: టెక్నికల్ గా 'ఛాంగురే బంగారు రాజా' అంత ప్రత్యేకంగా ఏమీ అనిపించదు. కృష్ణ సౌరభ్ పాటల్లో గుర్తుంచుకోదగ్గవి లేవు. ఏదో అలా అలా సాగిపోయాయి. నేపథ్య సంగీతం పర్వాలేదు. సుందర్ ఛాయాగ్రహణం ఓకే. నిర్మాణ విలువలు కథకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. రవితేజ నిర్మాత అయినప్పటికీ.. సినిమా స్థాయికి తగ్గట్లే ఖర్చు పెట్టారు. రైటర్ కమ్ డైరెక్టర్ సతీష్ వర్మలో విషయం ఉంది. అతను భిన్నమైన కథనే ఎంచుకున్నాడు. తన పెన్నులో 'ఫన్' కూడా ఉంది. కాకపోతే క్రైమ్ ఎలిమెంట్ ను ఇంకా బాగా డీల్ చేయాల్సింది. స్క్రిప్టు మీద ఇంకొంచెం కసరత్తు చేసి ఉంటే 'ఛాంగురే బంగారు రాజా' ఔట్ పుట్ ఇంకా మెరుగ్గా బాగుండేది.
చివరగా: ఛాంగురే బంగారు రాజా.. సోసో క్రైమ్ కామెడీ
రేటింగ్-2.25/5