ఆ కటౌట్‌లో చరణ్- అకీరా వ్వాటే లుక్
ప్రస్తుతానికి అతడు హీరో కాలేదు కానీ అంతకుమించిన ఫాలోయింగ్ ని ఆస్వాధిస్తున్నాడు.
By: Tupaki Desk | 1 Jan 2025 4:05 PM GMTఆరున్నర అడుగుల బుల్లెట్టు అకీరా నందన్. టాలీవుడ్‌లో ప్రభాస్, రానాలను మించిన ఒడ్డు పొడుగు ఛరిష్మా ఉన్న 20 ఏళ్ల ఛరిష్మాటిక్ యువకుడు. ప్రస్తుతానికి అతడు హీరో కాలేదు కానీ అంతకుమించిన ఫాలోయింగ్ ని ఆస్వాధిస్తున్నాడు. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కుమారుడిగా, భవిష్యత్ తరంలో దూసుకొచ్చే స్టార్ గా అతడు ప్రత్యేక ఇమేజ్ ని కలిగి ఉన్నాడు. పవన్ కల్యాణ్ నటిస్తున్న 'హరిహర వీరమల్లు' చిత్రంలో అకీరా నందన్ పాత్ర సడెన్ సర్‌ప్రైజ్ గా ఉంటుందని గుసగుస వినిపించినా దీని గురించిన సరైన అప్‌డేట్ ఏదీ ఇటీవల రాలేదు.
ఇదిలా ఉంటే, పిఠాపురంలో ఉపముఖ్యమంత్రి కార్యాలయం వెలుపల పవన్ కల్యాణ్ భారీ కటౌట్ లో అకీరా నందన్ ఫోటోగ్రాఫ్ ప్రత్యక్షమై ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతేకాదు... జనసేనాని పవన్ కల్యాణ్ కి ఓవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మరోవైపు అకీరా నందన్ ఉన్నారు. డాడీ, అన్నయ్య చెంత అకీరా నందన్ ఫోటో కనిపించగానే అది అభిమానుల్లో మరింత ఉత్సాహం పెంచింది. ప్రస్తుతం జనసేన పార్టీ కార్యకర్తలు, ప్రతినిధులు ఈ స్పెషల్ ఫ్లెక్సీ ని చూసి దాంతో సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకే పోస్టర్ లో ముగ్గురు హీరోలను క్యాప్చుర్ చేయాలనే వారి ఆలోచనాత్మక నిర్ణయం ప్రశంసనీయమైనది.
డిప్యూటీ సీఎం, గ్లోబల్ స్టార్, భవిష్యత్ గేమ్ ఛేంజర్ అకీరాలతో ఫోటోగ్రాఫ్ దిగడం అంటే ఆషామాషీనా? అభిమానులకు ఇది ప్రత్యేక అవకాశం. తనకు అత్యంత ఇష్టమైన రామ్ చరణ్, రక్త సంబంధం అయిన అకీరా నందన్ ఇలా పోస్టర్ లో కనిపించడం బహుశా పవన్ కి కూడా ఎంతో ఆనందం కలిగించి ఉండొచ్చు. చరణ్ - అకీరా స్పెషల్ ఫ్లెక్స్ సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. భవిష్యత్ లో చరణ్- అకీరా కలిసి పని చేయాలని, పవన్ కల్యాణ్ బ్యానర్ లో ఆ ఇద్దరూ కలిసి నటించే సినిమా ఏదైనా రావాలని కూడా కొందరు అభిమానులు కోరుకుంటున్నారు.