Begin typing your search above and press return to search.

కంగారూ దేశంలో రామ్‌చ‌ర‌ణ్‌కి అరుదైన గౌర‌వం

ఐఎఫ్ఎఫ్ అనేది విక్టోరియన్ రాష్ట్ర ప్రభుత్వం యేటేటా నిర్వహించే అధికారిక చలనచిత్రోత్సవం.

By:  Tupaki Desk   |   19 July 2024 6:12 AM GMT
కంగారూ దేశంలో రామ్‌చ‌ర‌ణ్‌కి అరుదైన గౌర‌వం
X

ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ (IFFM) తన 15వ ఎడిషన్‌కు రామ్ చరణ్‌ని గౌరవ అతిథిగా ప్రకటించింది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సముచిత స్థానాన్ని ఏర్పరచుకున్న రామ్ చరణ్ ఆసిస్‌-మెల్‌బోర్న్‌లో భారతీయ సినిమా వార్షిక వేడుకలో పాల్గొననున్నారు. ఐఎఫ్ఎఫ్ అనేది విక్టోరియన్ రాష్ట్ర ప్రభుత్వం యేటేటా నిర్వహించే అధికారిక చలనచిత్రోత్సవం. ఈ సంవత్సరం 15-25 ఆగస్టు 2024 వరకు జరుగుతుంది.

ఆస్కార్ విన్నింగ్ RRR న‌టుడిగా రామ్ చ‌ర‌ణ్ హెడ్ ట‌ర్న‌ర్‌గా మారాడు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇండియ‌న్ డ‌యాస్పోరాలో అత‌డికి ఇప్పుడు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆర్.ఆర్.ఆర్ 'నాటు నాటు' ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేట‌గిరీలో ఆస్కార్‌ను గెలుచుకోవడంలో చ‌ర‌ణ్ డ్యాన్సింగ్ ట్యాలెంట్ విస్మ‌రించ‌లేనిది. అకాడెమీ, గోల్డెన్ గ్లోబ్స్, హాలీవుడ్ క్రిటిక్స్ ఛాయిస్ పుర‌స్కారాల్లో ఆర్.ఆర్.ఆర్ విజ‌యం భారతదేశానికి అపారమైన గౌర‌వం తెచ్చిపెట్టింది. ఆస్కార్ విజయం త‌ర్వాత భారతీయ సినీప‌రిశ్ర‌మ‌లో గణనీయమైన ప్రభావాన్ని చూపే హీరోగా చ‌ర‌ణ్ కి గుర్తింపు పెరిగింది. అత‌డి ప్రపంచవ్యాప్త‌ గుర్తింపును హైలైట్ అవుతోంది.

లెజెండరీ న‌టుడు చిరంజీవి వార‌సుడిగా చ‌ర‌ణ్‌కి ఉన్న ఫాలోయింగ్ వేరు. పాన్ ఇండియన్ స్టార్ గా అత‌డికి ఉన్న గుర్తింపు వేరు. అన్నివిధాలా అత‌డు స్థాయిని పెంచుకున్నాడు. అందుకే ఇప్పుడు మెల్ బోర్న్ ఉత్స‌వాల క‌మిటీ ఏక‌గ్రీవంగా చ‌ర‌ణ్ కి ప‌ట్టం క‌డుతోంది. IFFMలో చ‌ర‌ణ్ ప్ర‌వేశం.. ఉనికి అతడి అద్భుతమైన కీర్తిని, సినిమాకి చేసిన అపారమైన సహకారాన్ని హైలైట్ చేస్తోంది.

మెల్ బోర్న్ ఫెస్టివ‌ల్స్ కి గౌరవ అతిథిగా ఉండటమే కాకుండా, భారతీయ సినిమాకి చ‌ర‌ణ్‌ చేసిన అద్భుతమైన సేవలకు గాను ఉత్స‌వాల్లో భారతీయ కళ, సంస్కృతికి అంబాసిడర్ అవార్డును కూడా అందజేయనున్నారు. ఈ పండుగలో చ‌ర‌ణ్‌కి గౌర‌వార్థ‌కంగా అత‌డు న‌టించిన సినిమాల‌ను కూడా ప్ర‌ద‌ర్శిస్తారు. సినీరంగంలో చ‌ర‌ణ్ ప్ర‌యాణాన్ని మెల్ బోర్న్ వేదిక‌గా అభిమానులు, ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేస్తారు.

ఈ వేడుకకు హాజరుకావడంపై రామ్ చరణ్ తన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ ఇలా మాట్లాడారు. ''భారతీయ సినిమా వైవిధ్యం, గొప్పతనాన్ని అంతర్జాతీయ వేదికపై సెల‌బ్రేట్ చేసుకునే 'ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్‌-2024'లో భాగమైనందుకు చాలా గౌరవంగా భావిస్తున్నాను. మన చిత్ర పరిశ్రమకు ప్రాతినిధ్యం వహించడం అదృష్టం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, సినీ ప్రముఖులతో కనెక్ట్ అవ్వండి. RRR విజయం విశ్వ‌వ్యాప్త‌మైంది. ఈ క్షణాన్ని మెల్‌బోర్న్‌లోని ప్రేక్షకులతో షేర్ చేసుకోవడానికి నేను థ్రిల్లింగ్‌గా వేచి చూస్తున్నాను'' అని అన్నారు.

IFFM ఫెస్టివల్ డైరెక్టర్ మితు భౌమిక్ లాంగే చ‌ర‌ణ్ గురించి ఇలా వ్యాఖ్యానించారు. ''ఐఎఫ్ఎఫ్ఎమ్ 15వ ఎడిషన్ వేడుక‌ల‌కు రామ్ చరణ్ హాజరు కావడం వల్ల అదనపు ఉత్సాహం, ప్రతిష్ట పెరుగుతాయి. RRRలో అత‌డి న‌ట‌న‌ కొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేయడమే కాకుండా త‌న‌ స్థానాన్ని మ‌రింత‌గా పదిలపరిచింది. ఈ రోజు భారతీయ సినీప‌రిశ్ర‌మ‌లోని ప్రభావవంతమైన నటుడిగా అత‌డిని మెల్‌బోర్న్‌కు స్వాగతిస్తున్నందుకు సంతోషిస్తున్నాము. వేడుకల‌లో ప్రేక్షకులతో అత‌డి విజయాలను సెల‌బ్రేట్ చేసుకోవడానికి ఎదురుచూస్తున్నాము'' అని తెలిపారు.

ఆస్ట్రేలియాలో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ 15వ ఎడిషన్ ఒక మరపురాని అనుభూతిగా నిలిచిపోతుందని దీనిని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. రామ్ చరణ్ హాజరు ఉత్సాహాన్ని, వేడుక‌ల గొప్ప‌త‌నాన్ని పెంచుతుంది. ఈ ఉత్సవం భారతదేశం, భారత ఉపఖండంలోని చిత్రాలతో చాలా వైభవంగా మైలురాయి 15వ సంవత్సరాన్ని జరుపుకోనుంది. IFFM అనేది ప‌లు విభాగాల్లో అవార్డులు అందించే చలనచిత్రోత్సవం. ఇది దక్షిణ అర్ధగోళంలో భారతీయ సినిమాకు సంబంధించిన‌ అతిపెద్ద వేడుక.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... రామ్ చరణ్ త‌దుప‌రి శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలోని 'గేమ్ ఛేంజర్' విడుద‌ల కోసం ఆస‌క్తిగా వేచి చూస్తున్నాడు. మ‌రోవైపు బుచ్చిబాబు RC16లో న‌టించ‌నున్నాడు. ఇందులో జాన్వీక‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది.