Begin typing your search above and press return to search.

1000 పేజీల ఛార్జ్ షీట్‌తో ద‌ర్శ‌న్ మెడ‌కు ఉచ్చు?

అభిమాని హత్యకేసులో ప్ర‌త్య‌క్ష ప్ర‌మేయం ఉంద‌నే ఆరోపణలతో అరెస్టయిన క‌న్న‌డ స్టార్ హీరో దర్శన్ ప్రస్తుతం ఆరు వారాల మధ్యంతర బెయిల్‌పై బయట ఉన్నారు

By:  Tupaki Desk   |   23 Nov 2024 1:30 AM GMT
1000 పేజీల ఛార్జ్ షీట్‌తో ద‌ర్శ‌న్ మెడ‌కు ఉచ్చు?
X

అభిమాని హత్యకేసులో ప్ర‌త్య‌క్ష ప్ర‌మేయం ఉంద‌నే ఆరోపణలతో అరెస్టయిన క‌న్న‌డ స్టార్ హీరో దర్శన్ ప్రస్తుతం ఆరు వారాల మధ్యంతర బెయిల్‌పై బయట ఉన్నారు. అతడి తాత్కాలిక విడుదలకు కారణం అత్య‌వ‌స‌ర వైద్య ప‌రిస్థితి. శస్త్రచికిత్స చేయాల్సిన ప‌రిస్థితులు త‌లెత్త‌గా దానికోసం అత‌డికి బెయిల్ ల‌భించింది. అయితే ద‌ర్శ‌న్ శ‌స్త్ర చికిత్స మరో ఇబ్బందిక‌ర‌మైన‌ ఆరోగ్య సమస్య కారణంగా వాయిదా ప‌డింది.

ప్ర‌స్తుతం దర్శన్ తూగుదీప బెంగళూరులోని బీజీఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజా స‌మాచారం మేర‌కు ద‌ర్శ‌న్ ఇటీవ‌ల‌ హైపర్‌టెన్షన్, అధిక రక్తపోటుతో బాధపడుతున్నాడు. ఇది ఆపరేషన్ ఆలస్యం కావడానికి ఒక కారణమని తెలుస్తోంది. అతడు మానసికంగా శ‌స్త్ర చికిత్స‌కు సిద్ధంగా లేడని, అధిక రక్తపోటు వాయిదాకు పెద్ద కారణమని వైద్యులు చెబుతుస్తున్న‌ట్టు క‌థ‌నాలొస్తున్నాయి. శస్త్రచికిత్సకు ముందు రోగి రక్తపోటు నియంత్రణలో ఉండాలి. ఇది దర్శన్ అయినా ఇంకెవ‌రైనా.. కానీ ద‌ర్శ‌న్ ప‌రిస్థితి అలా లేదు. ఈ గురువారం బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయవాది ఎస్పీపీ ప్రసన్న కుమార్ దర్శన్‌కు శస్త్రచికిత్సపై ప్రశ్నను లేవనెత్తారు. కానీ వైద్య నివేదికల‌ ప్రకారం... ఆపరేషన్ కోసం ఇంకా తేదీని పేర్కొనలేదు. ద‌ర్శ‌న్ ఇంకా చికిత్స కోసం సిద్ధమవుతున్నాడు.

దర్శన్ బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ విచారించగా, అదనపు చార్జిషీట్ కూడా దాఖలు చేసింది. అయితే దర్శన్ మెడికల్ రిపోర్టు తమకు ఇవ్వలేదని ఎస్పీపీ వాదించింది. ద‌ర్శ‌న్ తరపు న్యాయవాది నగేష్ మెడికల్ రిపోర్టును కోర్టుకు సమర్పించారు. దీనిని విశ్వజిత్ శెట్టి తనిఖీ చేశారు. ఆ తర్వాత అదే కాపీని ఎస్పీపీ ప్రసన్నకుమార్‌కు ఇవ్వాలని న్యాయమూర్తులు ఆదేశించారు. అన్ని వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను నవంబర్ 26వ తేదీకి వాయిదా వేశారు. గ‌త జూన్‌లో అభిమాని రేణుకా స్వామి హత్యలో ప్రమేయం ఉంద‌న్న ఆరోప‌ణ‌ల్లో దర్శన్‌తో పాటు మరో 15 మంది నిందితులను అరెస్టు చేశారు. వారిలో బెంగళూరు జైలులో ఉన్న తన భాగస్వామి పవిత్ర గౌడ కూడా ఉన్నారు. మృతుడైన రేణుకాస్వామి ప‌విత్ర‌కు అశ్లీల సందేశాలు పంపించ‌డం హత్యకు దారితీసిందని పోలీసులు వెల్ల‌డించారు.

ద‌ర్శ‌న్ కేసులో అస‌లేం జ‌రుగుతోంది?

రేణుకాస్వామి హత్య కేసులో పోలీసులు రెండవ ఛార్జిషీట్‌ను సమర్పించడానికి సిద్ధమవుతున్న తరుణంలో దర్శన్ తూగుదీప చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. తాజా క‌థ‌నాల ప్రకారం 1000 పేజీలకు పైగా విస్తరించి ఉన్న అదనపు ఛార్జ్ షీట్ సిద్ధ‌మైంది. దీనిని కోర్టులో దాఖలు చేస్తార‌ని భావిస్తున్నారు. ఈ పరిణామం దర్శన్‌పై ఉన్న కేసును బలపరిచే కొత్త సాక్ష్యాల‌తో అత‌డికి చిక్కులు త‌ప్ప‌వ‌ని అర్థ‌మ‌వుతోంది.

రెండో ఛార్జ్ షీట్‌లో 20మందికి పైగా సాక్షుల వాంగ్మూలం, చాలా కోణాల్లో ఫోరెన్సిక్ నివేదికలు.. ఇతరత్రా కీలక సమాచారం ఉన్నాయి. సాక్ష్యాలలో పునీత్ అనే ప్రత్యక్ష సాక్షి మొబైల్ ఫోన్ నుండి రెండు ఫోటోలు లభించాయి. మొదట్లో భయంతో డిలీట్ చేసిన ఈ ఫోటోలను ఇప్పుడు పోలీసులు రికవరీ చేసి ఛార్జ్ షీట్ లో చేర్చారు. న్యూస్‌ఫస్ట్ వివ‌రాల ప్రకారం దర్శన్ నీలిరంగు టీ-షర్ట్, నలుపు జీన్స్ ధరించి స్పాట్ లో క‌నిపించారు. ఘ‌ట‌నాస్థ‌లి అయిన‌ షెడ్ వద్ద ఇతరులతో పాటు నిలబడి ఉన్నట్లు ఫోటోలు చెబుతున్నాయి. ఈ అదనపు ఛార్జ్ షీట్ తో దర్శన్‌ సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి సవాళ్లు పెరిగే ఛాన్సుంది. ద‌ర్శ‌న్ బెయిల్ విచార‌ణ‌లో ఇప్ప‌టికే హైకోర్టు మ‌రో వాయిదాను ప్ర‌క‌టించింది.