టాలీవుడ్ వెంటే లీడ్ తీసుకుంటున్న కన్నడ ఇండస్ట్రీ
రక్షిత్ శెట్టి నటించిన పాన్-ఇండియా హిట్ '777 చార్లీ' ఉత్తమ కన్నడ చిత్రంగా నిలిచింది.
By: Tupaki Desk | 25 Aug 2023 2:12 PM GMTఆస్కార్ అవార్డును భారతదేశానికి అందించిన ఘనత టాలీవుడ్ కే చెందుతుంది. ఆర్.ఆర్.ఆర్ నాటు నాటు పాటతో ఇది సాధ్యమైంది. అంతేకాదు ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్స్, హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డులను కూడా భారతదేశానికి అందించిన పరిశ్రమ టాలీవుడ్. నేడు దేశంలో 1000 కోట్ల క్లబ్ అందుకునే సత్తా ఉన్న పరిశ్రమ టాలీవుడ్. పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ కి భారతీయ సినిమాని తీసుకెళుతున్న ఘనత టాలీవుడ్ కే చెందుతుంది.
అందుకే సౌతిండియా నుంచి ఇతర పరిశ్రమలు టాలీవుడ్ ని స్ఫూర్తిగా తీసుకుంటున్నాయి. బాహుబలి - ఆర్.ఆర్.ఆర్ చిత్రాలతో రాజమౌళి అన్ని పరిశ్రమల దర్శకులకు గురువుగా కనిపిస్తున్నారు. అంతేకాదు రాజమౌళి ఇచ్చిన స్ఫూర్తితో పోటాపోటీగా భారీ సినిమాలను తెరకెక్కించాలని ఇరుగు పొరుగు భాషల వాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు. ముఖ్యంగా కన్నడ సినీపరిశ్రమ తెలుగు సినీపరిశ్రమను అనుసరించడంలో ఎప్పుడూ ముందుంటోంది.
ఇంతకుముందు బాహుబలి స్ఫూర్తితో కన్నడ పరిశ్రమలో భారీ కాన్వాస్ ఉన్న సినిమాలను నిర్మించే ప్రయత్నం జరిగింది. కేజీఎఫ్ - కేజీఎఫ్ 2 లాంటి భారీ డార్క్ యాక్షన్ సినిమాలను తెరకెక్కించడానికి తెలుగు సినిమా స్ఫూర్తినిచ్చిందనడంలో సందేహం లేదు.ఇటీవల కన్నడ ఇండస్ట్రీ నుంచే కాంతార లాంటి బ్లాక్ బస్టర్ సినిమా విడుదలైంది. ఇది పాన్ ఇండియా స్థాయిలో విజయం అందుకుంది.
ఇప్పుడు అవార్డుల్లోను టాలీవుడ్ నే అనుసరిస్తోంది శాండల్వుడ్. టాలీవుడ్ కి 10 జాతీయ అవార్డులు దక్కగా.. శాండల్వుడ్ కి 4 జాతీయ అవార్డులు దక్కాయి. దీంతో అవార్డుల్లోనూ కన్నడ ఇండస్ట్రీ షైన్ అయిందని అర్థమవుతోంది. శాండల్వుడ్ కంటెంట్ లోను ప్రయోగాలు చేస్తోంది. టాలీవుడ్ వెంటే లీడ్ తీసుకుంటూ కన్నడ ఇండస్ట్రీ ఇతర పరిశ్రమల కంటే అడ్వాన్స్ డ్ గా మారుతోంది. ఇక తెలుగు చిత్రసీమ పాన్ వరల్డ్ మార్కెట్ ని ఢీకొట్టే పనిలో ఉంది. అక్కడ కూడా శాండల్వుడ్ మనతో పోటీపడుతుందేమో చూడాలి.
గురువారం ప్రకటించిన 69వ జాతీయ చలనచిత్ర అవార్డులలో కన్నడ సినీ పరిశ్రమ నాలుగు అవార్డులను కైవసం చేసుకోగా, రక్షిత్ శెట్టి నటించిన పాన్-ఇండియా హిట్ '777 చార్లీ' ఉత్తమ కన్నడ చిత్రంగా నిలిచింది. అనిరుధ్ జట్కార్ దర్శకత్వం వహించిన డాక్యుమెంటరీ 'భలే బంగార', నాన్-ఫీచర్ విభాగంలో జ్యూరీ సభ్యుల ప్రత్యేక ప్రశంసలతో సత్కారం అందుకుంది. జాకబ్ వర్గీస్ దర్శకత్వంలో జాకబ్ వర్గీస్, దినేష్ రాజ్ కుమార్, నవీన్ ఫ్రాన్సిస్ నిర్మించిన 'ఆయుష్మాన్' నాన్ ఫీచర్ విభాగంలో బెస్ట్ ఎక్స్‌ప్లోరేషన్ సినిమా అవార్డును అందుకుంది.
సీనియర్ కన్నడ ఫిల్మ్ జర్నలిస్ట్ సుబ్రమణ్య బండూర్‌కు ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్ (ప్రత్యేక ప్రస్తావన) అవార్డు లభించింది. సుబ్రహ్మణ్య బందూర్ 43 ఏళ్లుగా ఫిల్మ్ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. వ్యాసాలు, కాలమ్‌లు రాస్తూనే ఉన్నారు.
777 చార్లీ రక్షిత్ శెట్టి నటించిన సూపర్ హిట్ చిత్రం .. దేశంలోని అన్ని ప్రధాన భాషల్లోకి డబ్ అయి విడుదలైంది. ఈ సినిమా అన్ని భాషల్లో మంచి రివ్యూలు అందుకుంది. ఈ చిత్రం నిజానికి కుక్కల ప్రేమికుల హృదయాలను గెలుచుకుంది. దీనికి కిరణ్ రాజ్ దర్శకత్వం వహించారు. రక్షిత్ శెట్టి నిర్మించారు.