చైతూ, శోభిత పెళ్ళికి వచ్చిన అతిథులు ఎవరంటే..!
నాగ చైతన్య, శోభితల వివాహం అన్నపూర్ణ స్టూడియోలో అత్యంత వైభవంగా జరిగింది.
By: Tupaki Desk | 5 Dec 2024 9:30 AM GMTనాగ చైతన్య, శోభితల వివాహం అన్నపూర్ణ స్టూడియోలో అత్యంత వైభవంగా జరిగింది. అన్నపూర్ణ స్టూడియోలో ఉన్న ఏయన్నార్ గారి విగ్రహం ముందు ప్రత్యేకంగా వేసిన పెళ్లి మండపంలో శోభిత మెడలో నాగ చైతన్య మూడుముళ్లు వేశారు. ఈ వివాహ వేడుకకి సినిమా ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు హాజరు అయ్యారు. అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన దాదాపు అంతా పెళ్లికి హాజరు అయ్యారు. ముఖ్యంగా వెంకటేష్, రానాలు పెళ్లి వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు అంటూ ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతూ ఉన్నారు.
పెళ్లికి మెగాస్టార్ చిరంజీవి సైతం హాజరు అయ్యారు. ఆయన కారులో వెళ్తున్న ఫోటోలు, వీడియోలు వచ్చాయి. అయితే పెళ్లి మండపంలో ఆయన వధు వరులను ఆశీర్వదించిన ఫోటోలు, వీడియోలు మాత్రం బయటకు రాలేదు. ఇక తమిళ స్టార్ కార్తీ సైతం ఈ పెళ్లి వేడుకలో పాల్గొని నూతన వధు వరులను ఆశీర్వదించడం జరిగింది. కోలీవుడ్ నుంచి వచ్చిన మరికొందరు సైతం కొత్త దంపతులకు బెస్ట్ విషెస్ చెప్పడం జరిగిందని తెలుస్తోంది. టాలీవుడ్ కి చెందిన మరికొందరు సైతం ఈ పెళ్లి వేడుకలో పాల్గొన్నారు.
ఈ పెళ్లికి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ కొనుగోలు చేసింది అనే వార్తలు వస్తున్నాయి. అందుకే ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు అంటున్నారు. చాలా తక్కువ ఫోటోలు మాత్రమే ఇప్పటి వరకు బయటకు వచ్చాయి. ముందు ముందు ఆ ఫోటోలు, వీడియోలను సైతం అక్కినేని ఫ్యామిలీ బయటకు వదులుతుందా అనేది చూడాలి. టాలీవుడ్ కి చెందిన అక్కినేని ఫ్యామిలీతో ఇండస్ట్రీలో ఎంతో మందికి సన్నిహిత సంబంధాలు ఉంటాయి. అయితే కొన్ని కారణాల వల్ల చాలా తక్కువ మందికి మాత్రమే ఆహ్వానం అందింది అనే వార్తలు వస్తున్నాయి.
మూడు సంవత్సరాల పాటు ప్రేమించుకున్న నాగ చైతన్య, శోభితలు పెళ్లి బంధంతో ఒక్కటి కావడంతో అక్కినేని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో లక్షలాది మంది నాగ చైతన్య, శోభితలకు పెళ్లి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆ సినిమా విడుదల కాబోతుంది. శోభిత సైతం వరుసగా సినిమాలు సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉంది. వచ్చే ఏడాది ఆమె తెలుగులోనూ ఒక సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి.