ఛావా... భలే ఛాన్స్ మిస్ చేసుకున్నారు!
చత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్రపై కేవలం హిందీ, మరాఠ ప్రేక్షకుల్లోనే కాకుండా అన్ని ఇండియన్ భాషల ప్రేక్షకుల్లోనూ ఆసక్తి ఉంది.
By: Tupaki Desk | 20 Feb 2025 9:30 AM GMTవిక్కీ కౌశల్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో రూపొంది ఇటీవల విడుదలైన 'ఛావా' సినిమా సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. బాలీవుడ్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఇప్పటి వరకు దాదాపుగా రూ. 250 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. లాంగ్ రన్‌లో ఈ సినిమా వరల్డ్ బాక్సాఫీస్ వద్ద ఎంత వసూళ్లు చేస్తుంది అనేది ఆసక్తిగా మారింది. కేవలం హిందీ వర్షన్ మాత్రమే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శింపబడుతోంది. సినిమాకు వస్తున్న స్పందన నేపథ్యంలో ఇతర భాషల్లోనూ సినిమాను డబ్ చేయాలని ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నారు.
చత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్రపై కేవలం హిందీ, మరాఠ ప్రేక్షకుల్లోనే కాకుండా అన్ని ఇండియన్ భాషల ప్రేక్షకుల్లోనూ ఆసక్తి ఉంది. అందుకే శంభాజీ జీవిత చరిత్ర 'ఛావా' ను మా భాషలోనూ విడుదల చేయండి ప్లీజ్ అంటూ కొందరు హిందు సినీ ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఫిల్మ్ మేకర్స్ మాత్రం ఇతర భాషల్లో డబ్బింగ్ విషయమై ఆసక్తి చూపడం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒక నిర్మాత డబ్బింగ్ రైట్స్ కోసం సంప్రదిస్తే ఇచ్చే ఆలోచన లేదని అన్నారట. ఇలాంటి సినిమాలను పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది.
రష్మిక మందన్న నటించడంతో తెలుగు, తమిళ్ భాషల్లోనూ ఛావా సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయింది. ఆమెతో పాటు విక్కీ కౌశల్ ఒకటి రెండు సార్లు సౌత్ ఇండియాలో ప్రమోషన్ చేసి, హిందీలో విడుదల చేసిన సమయంలోనే తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో విడుదల చేసి ఉంటే కచ్చితంగా ఓపెనింగ్ వసూళ్లు రికార్డ్ స్థాయిలో నమోదు అయ్యేవి. కేవలం సౌత్ ఇండియాలోనే ఛావా సినిమా వంద కోట్లు, లేదా అంతకు మించి వసూళ్లు రాబట్టి ఉండేది. ఛావా తో సౌత్ లో భారీ వసూళ్లు దక్కించుకునే ఛాన్స్‌ను మేకర్స్ మిస్ చేసుకున్నారు. తెలుగు లో రూపొందుతున్న చిన్న చిన్న సినిమాలను పాన్ ఇండియా అంటూ విడుదల చేస్తున్నారు. అలాంటిది ఛావా సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయక పోవడం విడ్డూరంగా ఉంది.
ఛావా సినిమా కథ, నటీ నటులు.. ఇలా ఏ విషయాన్ని తీసుకున్నా పాన్ ఇండియా రేంజ్ మూవీ అనడంలో సందేహం లేదు. మంచి కంటెంట్‌తో వస్తే ఎలాంటి సినిమాలను అయినా తెలుగు ప్రేక్షకులు అలరిస్తారు. అలాంటిది శంభాజీ మహారాజ్ జీవిత చరిత్రతో రూపొందిన ఛావా సినిమాను ఇంకా ఎలా నెత్తిన పెట్టుకునే వారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఛావా సినిమాను ఇప్పటికి అయినా తెలుగు ఇతర సౌత్ భాషల్లో డబ్ చేయాలని మేకర్స్‌కి సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున విజ్ఞప్తులు అందుతున్నాయి. ఓటీటీ కోసం మాత్రమే డబ్బింగ్ చేస్తామని ఛావా మేకర్స్ చెప్పారని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఛావాను చూడాలంటే ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే వరకు తెలుగు ప్రేక్షకులు వెయిట్ చేయాల్సిందే అని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.