ఛావా తెలుగు వెర్షన్ రిలీజ్ ఎప్పుడంటే
మార్చి 7న ఛావా తెలుగు వెర్షన్ థియేటర్లలోకి రానుంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్స్ ద్వారా ఛావాను తెలుగులో రిలీజ్ చేయనున్నారు.
By: Tupaki Desk | 26 Feb 2025 11:39 AM GMTఛత్రపతి శివాజీ కొడుకు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ఛావా. ఔరంగజేబు ఎన్ని హింసలు పెట్టినా ధైర్యంగా నిలబడి భారతీయ స్వరాజ్య కాంక్షను చాటిన ధీరుడు శంభాజీ మహారాజ్. ఫిబ్రవరి 14న హిందీ భాషలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగు డబ్బింగ్ ఇప్పుడు రిలీజ్‌కు రెడీ అయింది.

మార్చి 7న ఛావా తెలుగు వెర్షన్ థియేటర్లలోకి రానుంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్స్ ద్వారా ఛావాను తెలుగులో రిలీజ్ చేయనున్నారు. 300కి పైగా బ్లాక్ బస్టర్ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన గీతా ఆర్ట్స్ ఇప్పుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఛావాను తెలుగులో రిలీజ్ చేస్తోంది.
లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను దినేష్ విజన్ మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ఈ సినిమాలో విక్కీ కౌశల్ శంభాజీ పాత్రలో నటించగా, ఆయన భార్య యేసుభాయ్ భోన్సాలే పాత్రలో రష్మిక మందన్నా నటించింది. ఔరంగజేబు పాత్రలో అక్షయ్ ఖన్నా మెప్పించాడు. సినిమాలో వీరందరి పాత్రలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి. ఛావా ఒరిజినల్ వెర్షన్ 11 రోజుల్లోనే రూ.417.20 గ్రాస్ కలెక్షన్లను సాధించి రికార్డులు సృష్టించింది.
ఛావాలోని గ్రిప్పింగ్ స్టోరీ, ఆకట్టుకునే పెర్ఫార్మెన్సులు, శంభాజీ మహారాజ్ లెగసీ, ఏఆర్ రెహమాన్ సంగీతం ప్రేక్షకుల గుండెల్ని కొల్లగొడుతున్నాయి. ఛావా తెలుగులో కూడా అదే స్థాయి రెస్పాన్స్ అందుకుంటుందని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు. బాలీవుడ్ లో ఇప్పటికే సెన్సేషన్ సృష్టిస్తున్న ఛావా తెలుగులో ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటుందో చూడాలి మరి.