Begin typing your search above and press return to search.

కశ్మీర్‌... సబర్మతి.. ఇప్పుడు ఛావా

నార్త్‌ ఇండియాలో ఛావా సినిమా ఎన్నో రికార్డ్‌లను బ్రేక్ చేసింది. బాలీవుడ్‌ సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ లేని విధంగా భారీ వసూళ్లు రాబట్టిందని సమాచారం.

By:  Tupaki Desk   |   25 March 2025 12:43 PM IST
Chhaava Special Screening
X

విక్కీ కౌశల్‌ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా రూపొందిన 'ఛావా' సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమా విడుదల అయ్యి ఆరు వారాలు దాటినా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తూనే ఉంది. అంతే కాకుండా సోషల్ మీడియాలోనూ ఛావా సినిమా గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఛత్రపతి శంభాజీ మహారాజ్‌ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఛావా సినిమా నార్త్‌ ఇండియాలో సెన్షేషన్‌ క్రియేట్‌ చేసింది. తెలుగులోనూ ఛావా సినిమా డబ్‌ అయి మంచి వసూళ్లు రాబట్టింది. హిందీ వర్షన్‌ విడుదలైన మూడు వారాలకు తెలుగులో విడుదలైనప్పటికీ మంచి ఓపెనింగ్స్‌ రాబట్టినట్లు చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.

నార్త్‌ ఇండియాలో ఛావా సినిమా ఎన్నో రికార్డ్‌లను బ్రేక్ చేసింది. బాలీవుడ్‌ సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ లేని విధంగా భారీ వసూళ్లు రాబట్టిందని సమాచారం. ఇప్పటికే పలు రికార్డ్‌లను తన సొంతం చేసుకున్న ఛావా సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. సినిమా విడుదల సమయంలో ఎక్కడ చూసినా ఛావా గురించి చర్చ జరుగుతుంది అంటూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. తక్కువ సమయంలోనే అత్యధిక వసూళ్లు రాబట్టడంతో పాటు, హిందువుల గొప్పతనం చాటే విధంగా ఉందంటూ ప్రశంసలు దక్కించుకుంది. ఒక వైపు సినిమాకు ప్రశంసలు దక్కడంతో పాటు మరో వైపు సినిమాను విమర్శించే వారు ఉన్నారు.

ఒక మతానికి చెందిన వారు ఛావా సినిమాపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు కలిసి మెలిసి ఉన్న వారి మధ్య గొడవలు పెట్టే విధంగా ఛావా ఉంది అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా, ఏం జరిగినా ఛావా సినిమాకు దక్కాల్సిన గౌరవాలు దక్కుతున్నాయి. తాజాగా ఛావా సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఏకంగా భారత పార్లమెంట్‌ భవనంలో ఛావా సినిమాను ప్రదర్శించేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి. మార్చి 27న సినిమాను పార్లమెంట్‌ ఆవరణలో స్క్రీనింగ్‌ చేయబోతున్నారు. ఈ స్క్రీనింగ్‌కు భారత ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్‌ షాతో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, చిత్ర యూనిట్‌ సభ్యులు హాజరు కానున్నారు.

ఇటీవల కాలంలో భారత పార్లమెంట్ ఆవరణలో 2022లో విడుదలైన 'ది కశ్మీర్ ఫైల్స్‌' సినిమాను స్క్రీనింగ్ చేశారు. కశ్మీర్‌ పండిట్ల బహిష్కరణ నేపథ్యంలో ఆ సినిమా సాగుతుంది. పార్లమెంట్‌ సభ్యుల కోసం ఆ సమయంలో స్క్రీనింగ్‌ చేశారు. ఆ తర్వాత ది సబర్మతి రిపోర్ట్‌ సినిమాను సైతం పార్లమెంట్‌లో స్క్రీనింగ్‌ చేశారు. 2002 గుజరాత్‌ రైలు దహన ఘటన ఆధారంగా రూపొందిన ఆ సినిమా పెద్ద దుమారం రేపింది. ఇప్పుడు కొత్తగా దుమారం రేపుతున్న ఛావా సినిమాను పార్లమెంట్‌లో స్క్రీనింగ్‌ చేసేందుకు సిద్ధం కావడం చర్చనీయాంశం అయింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక శ్రద్ధ, ఆసక్తి కనబరుస్తున్న కారణంగా ఛావా సినిమా పార్లమెంట్‌లో స్క్రీనింగ్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది. మరో వైపు ఛావా సినిమా స్క్రీనింగ్‌ను కొందరు వ్యతిరేకిస్తున్నారు.