Begin typing your search above and press return to search.

ఈ స్పందన, విజయం ఊహించలేదు!

సౌత్‌ సినీ ఇండస్ట్రీ నుంచి వరుసగా వందల కోట్ల సినిమాలు వస్తున్నా... బాలీవుడ్‌లో మాత్రం ఒక్క సక్సెస్ కోసం నెలల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి.

By:  Tupaki Desk   |   18 Feb 2025 5:53 AM GMT
ఈ స్పందన, విజయం ఊహించలేదు!
X

సౌత్‌ సినీ ఇండస్ట్రీ నుంచి వరుసగా వందల కోట్ల సినిమాలు వస్తున్నా... బాలీవుడ్‌లో మాత్రం ఒక్క సక్సెస్ కోసం నెలల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి. కొత్త సంవత్సరం ప్రారంభం అయ్యి రెండు నెలలు కావస్తున్నా బాలీవుడ్‌లో హిట్ పడలేదు. ఎట్టకేలకు బాలీవుడ్‌కి ఓ సూపర్ హిట్ దక్కింది. విక్కీ కౌశల్‌ హీరోగా లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకత్వంలో రూపొందిన చావా సినిమా గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్‌ పరిస్థితి అసలే బాగాలేదు, పైగా విక్కీ కౌశల్‌తో వంద కోట్ల బడ్జెట్‌ సినిమా అంటే రిస్క్‌ చాలా ఎక్కువ. అయినా కంటెంట్‌పై నమ్మకంతో చావా సినిమాను రూ.130 కోట్లతో నిర్మించారు.

చత్రపతి శివాజీ మహారాజ్‌ వారసుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ సినిమాపై ఆసక్తి పెరిగే విధంగా ప్రమోషన్‌ కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పటి వరకు శంభాజీ వీరత్వం గురించి వినడమే తప్ప పెద్దగా జనాలకు తెలియదు. ఆయన గురించిన చరిత్రను చూడాలనే ఆసక్తి బాలీవుడ్‌ ప్రేక్షకుల్లో రేకెత్తించారు. అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన హిందీ సినిమాలు నిరాశపరచడంతో ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో అనే అనుమానాలను కొందరు వ్యక్తం చేశారు. కానీ ప్రతి ఒక్కరూ షాక్‌ అయ్యే విధంగా విక్కీ కౌశల్‌ నటనతో మెప్పించారు, అంతే కాకుండా దర్శకుడు కథను చక్కగా వెండి తెరపై ఆవిష్కరించారు.

శంభాజీ మహారాజ్ పాత్రకు ప్రాణం పోసినట్టుగా విక్కీ కౌశల్ నటించాడు అంటూ రివ్యూలు వచ్చాయి. నేషనల్ మీడియాతో పాటు అన్ని చోట్ల విక్కీ కౌశల్‌ నటనకు ప్రశంసలు దక్కాయి. థియేటర్‌లో విక్కీ కౌశల్‌కి దక్కుతున్న గౌరవం సైతం సోషల్‌ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం. కెరీర్ బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ ఇచ్చిన విక్కీ కౌశల్‌ నటనలో పది మెట్లు ఎక్కారు అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. ఇప్పటికే సినిమా దాదాపు రూ.175 కోట్ల వసూళ్లు రాబట్టింది. లాంగ్‌ రన్‌లో ఈ సినిమా కచ్చితంగా రికార్డ్‌ బ్రేకింగ్ కలెక్షన్స్ రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సినిమాకు వస్తున్న స్పందన, వస్తున్న వసూళ్లు ఊహించలేదు అంటూ మేకర్స్‌తో పాటు అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విక్కీ కౌశల్‌ సినిమాకు రూ.130 కోట్ల బడ్జెట్‌ అవసరమా అంటూ విమర్శించిన వారు ఈ సినిమాకు వస్తున్న వసూళ్లు చూసి షాక్ అవుతున్నారు. కంటెంట్‌ బలంగా ఉంటే ఎంత భారీ బడ్జెట్‌ అయినా రికవరీ సాధ్యమే అనే అభిప్రాయం దీంతో మరోసారి వెళ్లడి అయింది. చావా సినిమాను హిందీలోనే కాకుండా ముందు ముందు ఇతర భాషల్లోనూ డబ్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు వసూళ్లు మరింతగా నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.