'ఛావా' రాంగ్ టైమింగ్.. మరో షాక్!
విక్కీ కౌశల్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన 'ఛావా' సినిమా గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
By: Tupaki Desk | 15 March 2025 10:56 AM ISTవిక్కీ కౌశల్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన 'ఛావా' సినిమా గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరాఠ మహారాజ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన 'ఛావా' సినిమా హిందీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే అక్కడ రూ.600 కోట్ల వసూళ్లు రాబట్టింది. నాలుగు వారాలు పూర్తి అయిన తర్వాత కూడా హిందీ వర్షన్ ఛావా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ షేర్‌ను రాబడుతోంది. హిందీలో ఛావా సినిమాకు వచ్చిన స్పందనతో తెలుగులో డబ్ చేసి గీతా ఆర్ట్స్ బ్యానర్ వారు విడుదల చేసిన విషయం తెల్సిందే. ఛావా సినిమా తెలుగు బాక్సాఫీస్ వద్ద ఊహలను అందుకోలేకపోయింది.
నార్త్ ఇండియాలో రాబట్టిన వసూళ్లతో పోల్చితే ఛావా తెలుగు వర్షన్ వసూళ్లు చాలా తక్కువగా ఉన్నాయి. అందుకు ప్రధాన కారణం హిందీలో విడుదల అయిన మూడు వారాల తర్వాత తెలుగులో విడుదల అయింది. అప్పటికే సినిమా బజ్ తగ్గుతూ వచ్చింది. అక్కడ విడుదలైన రెండు వారాల లోపులో విడుదల చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది అనేది ఇండస్ట్రీ వర్గాల వారి మాట. ఇక ఛావా సినిమా విడుదల సమయంలోనే ఇతర సినిమాలు తెలుగు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తూ వచ్చాయి. ముఖ్యంగా మహేష్ బాబు, వెంకటేష్ కలిసి నటించిన సూపర్ హిట్ బిగ్ మల్టీ స్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీ రిలీజ్ అయింది.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా రీ రిలీజ్ కి మంచి స్పందన వచ్చింది. ఆ సమయంలో ఛావా సినిమా కంటే సీతమ్మకే ఎక్కువ మంది ప్రేక్షకులు మొగ్గు చూపారు. దాంతో ఛావా సినిమాకు మొదటి వీకెండ్ డ్యామేజ్ అయింది. వీక్ డేస్‌లో కాస్త పర్వాలేదు అనిపించే విధంగా వసూళ్లు రాబట్టింది. ఇక ఈ వీకెండ్‌లో అయినా సినిమాకు మంచి స్పందన వస్తుందని భావించారు. కానీ ఛావాకు ఈ వీకెండ్‌లోనూ నిరాశే మిగిలేలా ఉంది. తాజాగా విడుదలైన 'కోర్ట్' సినిమాకు హిట్ టాక్ వచ్చింది. మొదటి రోజు ఆ సినిమా ఏకంగా రూ.8 కోట్ల వసూళ్లను రాబట్టింది అంటూ యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటన చేసి షాక్ ఇచ్చారు. వీకెండ్‌లోనూ కోర్ట్ సినిమా ఆధిపత్యం కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
ఈ వీకెండ్‌కి బుక్ మై షో ద్వారా దాదాగా రెండు లక్షలకు పైగా టికెట్లు బుక్ అయ్యాయని సమాచారం అందుతోంది. ఈ స్థాయిలో బుక్ మై షో ద్వారా టికెట్లు బుక్ కావడంతో పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఛావా సినిమాను చూడాలని అనుకున్న వారు కూడా కోర్ట్ వైపు మొగ్గు చూపించే విధంగా పరిస్థితి ఉందని సినీ విశ్లేషకులు, బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంత రాంగ్ టైమ్‌లో వచ్చినా కూడా ఛావా సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.20 కోట్ల వసూళ్లు నమోదు అయినట్లు సమాచారం అందుతోంది. ఛావా సినిమా స్థాయికి తెలుగు బాక్సాఫీస్ వద్ద సరైన సమయంలో పడి ఉంటే, పోటీ లేకుండా ఉంటే కచ్చితంగా రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్ల వసూళ్లు నమోదు అయ్యేవి అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.