Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: ముఖ్య‌మంత్రుల వార‌సులు హీరోలుగా

అయితే ఒక రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి హోదాలో ప‌ని చేసిన నాయ‌కుల వార‌సులు సినీరంగంలో హీరోలుగా కొన‌సాగారా? అంటే దానికి స‌మాధాన‌మిది.

By:  Tupaki Desk   |   24 May 2024 2:45 AM GMT
టాప్ స్టోరి: ముఖ్య‌మంత్రుల వార‌సులు హీరోలుగా
X

సినీరంగంలోకి న‌టుల కుమారులు న‌టులుగా రావ‌డం స‌హ‌జం. రాజ‌కీయ నాయ‌కులు, పారిశ్రామిక వేత్త‌లు, వ్యాపార వేత్త‌లు, క్రీడాకారుల పిల్ల‌లు కూడా సినీరంగంలో అదృష్టం ప‌రీక్షించుకుంటున్నారు. అయితే ఒక రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి హోదాలో ప‌ని చేసిన నాయ‌కుల వార‌సులు సినీరంగంలో హీరోలుగా కొన‌సాగారా? అంటే దానికి స‌మాధాన‌మిది.


న‌వ‌ర‌స‌న‌ట‌సార్వ‌భౌముడు, అన్న‌గారు ఎన్టీఆర్ అవిభాజిత‌ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నం. ముఖ్య‌మంత్రిగా ద‌శాబ్ధాల పాల‌న‌లో తెలుగు ప్ర‌జ‌ల జీవితాల‌ను మార్చిన మ‌హ‌నీయుడు. లెజెండ‌రీ న‌టుడిగా టాలీవుడ్ ని ఏలిన తార‌క రామారావు రాజ‌కీయాల్లోను అజేయుడిగా ఎదిగారు. ఆయ‌న వార‌సుడు బాల‌కృష్ణ సినీరంగంలోకి ప్ర‌వేశించి అగ్ర హీరోగా ఎదిగారు. ఇప్ప‌టికీ స్టార్ హీరోగా త‌న హోదాను కాపాడుకుని ముందుకు సాగుతున్నారు. మ‌రోవైపు తెలుగు దేశం పార్టీలో ముఖ్య నేత‌గాను ప్ర‌జ‌ల్లో ఉన్నారు.


మ‌హారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి విలాస్ రావ్ దేశ్ ముఖ్‌ కొడుకు రితేష్ దేశ్ ముఖ్ సినీ హీరోగా న‌టించాడు. హీరోయిన్ జెనీలియాను ప్రేమించి పెళ్లాడాడు. రితేష్ దేశ్‌ముఖ్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరియు కేంద్ర భారీ పరిశ్రమలు & పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ ఇండియా మంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ - వైశాలి దేశ్‌ముఖ్‌లకు జన్మించారు. అతడి అన్నయ్య అమిత్ దేశ్‌ముఖ్ మహారాష్ట్ర శాసనసభలో లాతూర్ సిటీ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే. అతడి తమ్ముడు ధీరజ్ దేశ్‌ముఖ్ లాతూర్ రూరల్ నుండి ఎమ్మెల్యే. అతడి మేన‌కోడ‌లు అదితి దేశ్‌ముఖ్ నటి. చిన్న మేన‌ కోడలు దీప్‌శిఖ‌ దేశ్‌ముఖ్ సినీ నిర్మాత. ముంబైలోని కమ్లా రహేజా కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుండి ఆర్కిటెక్చరల్ డిగ్రీని పొందిన రితేష్ భారతదేశానికి చెందిన ఆర్కిటెక్చరల్ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ సంస్థ అయిన ఎవల్యూషన్స్‌లో దేశ్‌ముఖ్ యాజమాన్యాన్ని నిర్వహిస్తున్నారు. మ‌రోవైపు బాలీవుడ్ స‌హా మ‌రాఠా చిత్రాల్లో న‌టిస్తూ నిర్మాత‌గాను రాణిస్తున్నారు.


ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌మ్ముడు రామ్మూర్తి నాయుడు కుమారుడు నారా రోహిత్ హీరోగా టాలీవుడ్ లో కొన‌సాగుతున్నారు. చెన్నైలో బిటెక్ చ‌దివి, న్యూయార్క్ ఫిలిం అకాడెమీలో సినిమా విద్య‌ను అభ్య‌సించిన నారా రోహిత్ 'బాణం' చిత్రంతో టాలీవుడ్ లో ప్ర‌వేశించి అటుపై డ‌జ‌ను పైగానే చిత్రాల్లో న‌టించాడు. నారా రోహిత్ రాజకీయాల్లోకి వెళ్లేందుకు ఆస్కారం ఉన్నా కానీ, క‌ళారంగం వైపు రావ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.


మ‌హారాష్ట్ర‌లో పేరున్న రాజ‌కీయ కుటుంబం థాక్రేల నుంచి ఇప్పుడు హీరో పుట్టుకొస్తున్నాడు. సంచ‌ల‌నాల‌ శివ‌సేన వ్య‌వ‌స్థాప‌కుడు బాల్ థాక్రే కుటుంబం నుంచి సీఎం ఉద్ద‌వ్ థాక్రే వార‌సుడు ఐశ్వ‌రీ థాక్రే హీరోగా ఆరంగేట్రం చేస్తున్నాడు. ఐశ్వరి వినోద రంగంలో తనకంటూ ఓ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ఐదేళ్లకు పైగా కష్టపడ్డాడు.అతడు 2015లో ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భ‌న్సాలీ 'బాజీరావ్ మస్తానీ'కి అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు.

అప్పటి నుండి అతడు తన నటనా నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాడు. ఐశ్వ‌రీ .. స్మితా ఠాక్రే - దివంగత జైదేవ్ ఠాక్రేల కుమారుడు. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే మనవడు. ఐశ్వరీ ఫిల్మ్ మేకింగ్‌లోని ప్రతి విభాగంలోనూ చాలా విష‌యాల‌ను నేర్చుకున్నాడు. సినిమాలపై విపరీతమైన మక్కువను కలిగి ఉన్నాడు. సినిమాల్లో స్థిరపడేందుకు 5 సంవత్సరాలు పాటు సెట్స్ లోనే ఉన్నాడు. సినిమాల గురించి సవివరమైన పనిని నేర్చుకుంటూ అసిస్టెంట్‌గా కొన‌సాగాడు. అతడికి కళ - సంగీతంపై అపారమైన ఆసక్తి ఉంది. సినిమాలు, సంగీతం, కళలు అతడి సొంత‌మ‌వుతాయ‌ని ఆశిస్తున్నాడు. సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే ఐశ్వరీ ఆరంగేట్రంపై ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంది.

2005లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన సూప‌ర్ హిట్ మూవీ 'సర్కార్' బాల్ థాక్రే జీవితం ఆధారంగా తెర‌కెక్కింది. ఉత్తర భారత రాజకీయాల నుండి ప్రేరణ పొంది రామూ క‌థ‌ను రాసుకున్నాడు. ఇందులో అమితాబ్ బచ్చన్ పాత్ర థాకరే నుండి ప్రేరణ పొందింది.


రాజ‌కీయ కుటుంబం నుంచి వ‌చ్చిన వాడు ఉద‌య‌నిధి స్టాలిన్. తమిళనాడు ముఖ్యమంత్రి M. K. స్టాలిన్ కుమారుడు అత‌డు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి M. కరుణానిధి మనవడు. అతడు డాన్ బాస్కో పాఠశాలలో చదివాడు. అటుపై చెన్నైలోని లయోలా కళాశాల నుండి వాణిజ్య శాస్త్రంలో పట్టా పొందాడు. అతడి బంధువులు చాలా మంది 1950ల నుండి రాజకీయాల్లో అలాగే తమిళ సినీరంగంలో చురుకుగా ఉన్నారు. అతడి బంధువులు అరుళ్నితి - దయానిధి అళగిరి సినీరంగంలోనే కొన‌సాగుతున్నారు. ఉద‌య‌నిధి కోలీవుడ్ లో హీరోగా, నిర్మాత‌గా రాణిస్తున్నారు.


మాజీ ప్ర‌ధాని దేవే గౌడ మ‌న‌వ‌డు, క‌ర్నాట‌క‌ మాజీ ముఖ్య‌మంత్రి హెచ్.డి.కుమార‌స్వామి కుమారుడు అయిన‌ నిఖిల్ గౌడ హీరోగా ప్ర‌య‌త్నించి చివ‌రికి రాజ‌కీయాల్లో సెటిలయ్యాడు. మునుముందు సినీరంగంలో నిర్మాతగాను కొన‌సాగే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ని తెలిసింది. రాజ‌కీయ కుటుంబ‌ నేప‌థ్యం నుంచి ఇంకా చాలామంది సినీరంగంలో ప్ర‌వేశించి ఇక్క‌డ అవ‌కాశాలు అందుకుని న‌టులుగా కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే.