టాప్ స్టోరి: నాటి బాల నటులే నేటి సూపర్‌స్టార్లు
వారి ప్రతిభ, అంకితభావం, కృషి వారి విజయాలకు బాటలు వేసాయి. 10 సంవత్సరాల లోపు వయసులో బాలనటులుగా ప్రవేశించి గొప్ప స్థాయికి ఎదిగిన వారి గురించిన స్టోరి ఇది.
By: Tupaki Desk | 7 March 2024 3:45 AM GMTప్రేక్షకులపై శాశ్వత ప్రభావాన్ని చూపిన ప్రతిభావంతులైన బాల నటులు భారతదేశంలో ఉన్నారు. తమ ప్రతిభ ఆకర్షణతో హృదయాలను దోచుకుంటూ అసాధారణ నట ప్రదర్శనలను అందించారు. వారి ప్రతిభ, అంకితభావం, కృషి వారి విజయాలకు బాటలు వేసాయి. 10 సంవత్సరాల లోపు వయసులో బాలనటులుగా ప్రవేశించి గొప్ప స్థాయికి ఎదిగిన వారి గురించిన స్టోరి ఇది.
పరిశ్రమలో గొప్ప స్టార్ డమ్ ని కొనసాగించిన శశికపూర్, కమల్ హాసన్, ఆలియా భట్ లాంటి తారలు 6 సంవత్సరాల వయసులో నటనలో ప్రవేశించారు. అమీర్ ఖాన్ 8 ఏళ్ల వయసులో 'యాదోంకి భారత్' చిత్రంతో బాలనటుడిగా అడుగులు వేసారు. శ్రీదేవి 4 ..తనూజ 4 ఏళ్ల వయసుకే నటీమణులు అయ్యారు. తమ సంపాదనతో కుటుంబాన్ని పోషించారు.
హృతిక్ రోషన్
హృతిక్ రోషన్ ఇప్పుడు బాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో ఒకరు. గ్రీక్ గాడ్ గా యువతరం హృదయాల్లో నిలిచి ఉన్నాడు. ఖాన్ లకు ధీటుగా బాక్సాఫీస్ విజయాలను సాధించే సత్తా ఉన్న హీరో అతడు. హృతిక్ కేవలం 6 సంవత్సరాల వయస్సులో నటనలోకి అడుగుపెట్టాడు. 1980లో 'ఆషా' చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా అరంగేట్రం చేశాడు. అతడు తన చిన్నతనంలో భగవాన్ దాదా- ఆప్ కే దీవానే వంటి చిత్రాలలో కూడా కనిపించాడు.
షాహిద్ కపూర్
షాహిద్ కపూర్ నటించిన 'ఐ యామ్ ఎ కంప్లాన్ బాయ్' ప్రకటన చాలా మందికి గుర్తుండిపోయే చిరస్మరణీయమైన ఐకానిక్ ప్రచార చిత్రం (వాణిజ్య ప్రకటన). చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన నట జీవితాన్ని ప్రారంభించిన అతడు ఆ తర్వాత స్టార్ హీరోగా ఎదిగాడు. కాంప్లాన్ ప్రకటనలో బాలనటుని నుండి ప్రముఖ బాలీవుడ్ నటుడిగా అతని ప్రయాణం నిజంగా చెప్పుకోదగినది.
అమీర్ ఖాన్
1973లో తన మామ నాసిర్ హుస్సేన్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం 'యాదోన్ కి బారాత్'తో బాలీవుడ్‌లో అమీర్ ఖాన్ ప్రయాణం ప్రారంభమైంది. 1988 చిత్రం 'ఖయామత్ సే ఖయామత్ తక్'లో తన అద్భుతమైన పాత్రతో విస్తృతమైన గుర్తింపు మరియు ప్రశంసలు పొందాడు. చేసే పనిలో అతడి అంకితభావం, సామాజిక కారణాలలో అతడి ప్రమేయం .. అర్థవంతమైన సినిమాని రూపొందించడంలో అతడి సామర్థ్యం బాలీవుడ్ లో అత్యంత గౌరవనీయమైన ప్రభావవంతమైన నటులలో ఒకరిగా స్థాయిని పటిష్టం చేశాయి.
సంజయ్ దత్
సంజయ్ దత్ నటనా జీవితం అనేక దశాబ్దాలుగా విస్తరించి ఉంది. అతడు తన ఫిల్మోగ్రఫీలో విభిన్నమైన పాత్రలను పోషించాడు. తన యాక్షన్-ప్యాక్డ్ పెర్ఫామెన్స్.. హాస్య పాత్రలకు విస్తృతంగా పాపులరయ్యాడు. చిత్ర పరిశ్రమలో అతని ప్రయాణం 1981 చిత్రం 'రాకీ'తో మొదలైంది. వాస్తవానికి తన తండ్రి సునీల్ దత్ దర్శకత్వం వహించిన 1971 చిత్రం 'రేష్మా ఔర్ షేరా'లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీరంగ ప్రవేశం చేశాడు.
నీల్ నితిన్ ముఖేష్
నీల్ నితిన్ ముఖేష్ మేటి ప్రతిభావంతుడైన నటుడు. విజయ్ (1988), జైసీ కర్ణి వైసీ భర్ణి (1989) వంటి చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన నటనా ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఈ ప్రారంభ నటప్రదర్శనలు పరిశ్రమలో అతడి కెరీర్‌కు పునాది వేసాయి. కామర్స్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత నీల్ నితిన్ ముఖేష్ 2007లో వచ్చిన 'జానీ గద్దర్' చిత్రంలో యువ నటుడిగా అరంగేట్రం చేశాడు.
టాలీవుడ్ నుంచి 10 ఏళ్ల లోపు..
టాలీవుడ్ నుంచి 10 ఏళ్ల లోపు వయసులో నటులు అయిన వారు ఎందరు ఉన్నారు? ఈ ప్రశ్నకు సమాధానం ఆసక్తికరం. మహేష్, అఖిల్ సహా పలువురు 10ఏళ్ల లోపే నటులు అయ్యారు. మహేష్ ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద స్టార్. అఖిల్ కెరీర్ పరుగులో బిగ్ విన్ కోసం ప్రయత్నాల్లో ఉన్నాడు.
తెలుగు సినీ పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్టులుగా కెరీర్ ప్రారంభించి పెద్ద స్టార్లు ఎదిగిన వారున్నారు.
దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన కృష్ణ చిత్రం 'నీడ' (1979)లో నటించినప్పుడు మహేష్ బాబుకు కేవలం ఆరేళ్లు. ఫ్యామిలీ డ్రామాల్లో చురుకైన పిల్లవాడిగా నటించాడు. నటుడిగా అరంగేట్రం చేసి ఆ తర్వాత పోరాటం,శంఖారావం, బజార్ రౌడీ, ముగ్గురు కొడుకులు, గూఢచారి 117, కొడుకులు దిద్దిన కాపురం, అన్న తమ్ముడు వంటి పలు హిట్ చిత్రాలలో నటించారు. 1999లో కె రాఘవేంద్ర దర్శకత్వం వహించిన 'రాజ కుమారుడు' సినిమాతో హీరోగా అరంగేట్రం చేశారు. ఇప్పుడు మహేష్ తెలుగు సినిమా A-జాబితా స్టార్లలో ఒకడు. రాజమౌళి దర్శకత్వంలో సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదగనున్నాడు.
1990లో మణిరత్నం దర్శకత్వం వహించిన 'అంజలి'లో అర్జున్ పాత్రలో తన నటనకు జాతీయ అవార్డుకు ఎంపికైన అతి పిన్న వయస్కుడైన నటుడు తరుణ్. ఈ సినిమాలో తన పాత్రకు, అలాగే 'మనసు మమత'లో నటనకు ఉత్తమ బాలనటుడిగా నంది అవార్డు కూడా అందుకున్నాడు. బుజ్జిగాడి బాబాయి, సూర్య ఐపీఎస్, పిల్లలు దిద్దిన కాపురం, ఆదిత్య 369, తేజ, వజ్రం చిత్రాలతో హిట్ కొట్టాడు. కె విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ప్రధాన తొలి చిత్రం 'నువ్వే కావాలి'తో అతడికి పెద్ద బ్రేక్ వచ్చింది. 13 అక్టోబర్ 2000న విడుదలైంది. ఈ రొమాంటిక్ కామెడీ ఒక సంవత్సరం (365 రోజులు) పాటు ప్రదర్శితమైంది. ఆ తర్వాత తరుణ్ కెరీర్ జర్నీ, వివాదాల గురించి తెలిసిందే. ప్రస్తుతం నటనకు అతడు దూరంగా ఉన్నాడు.
అఖిల్ అక్కినేని ఒక సంవత్సరం వయస్సులో సినిమాల్లో తన నటనను ప్రారంభించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కారు. హాలీవుడ్ చిత్రం 'బేబీస్ డే అవుట్' ఆధారంగా శివ నాగేశ్వరరావు దర్శకత్వం వహించిన 'సిసింద్రీ'లో అతడు చిన్నారి బాలకుడిగా బోలెడంత మ్యాజిక్ చేసాడు. విక్రమ్ కె కుమార్ మల్టీ స్టారర్ 'మనం'లో తన తండ్రి అక్కినేని నాగార్జున, అతని సోదరుడు అక్కినేని నాగ చైతన్య సపోర్టింగ్ రోల్‌లో నటించిన తర్వాత అతను ఓవర్‌నైట్ సెన్సేషన్ అయ్యాడు. అఖిల్ -హలో వంటి అనేక స్వతంత్ర చిత్రాలలో కనిపించడం ద్వారా క్రమంగా నటుడిగా పరివర్తన చెందాడు.
తనీష్ చాలా చిన్న వయస్సు నుండి అసాధారణమైన ప్రతిభ ఉన్నవాడు. చాలా సినిమాలలో విభిన్న పాత్రలలో కనిపించాడు. కానీ 2000లో కోడి రామకృష్ణ 'దేవుళ్లు'లో యువ ఆరాధకుడిగా 10 ఏళ్ల వయస్సులో అతడి నటనకు ప్రశంసలు కురిసాయి. అయితే 2008లో రవిబాబు దర్శకత్వంలో వచ్చిన నచ్చావులే చిత్రంతో తనీష్‌కు పెద్ద బ్రేక్ వచ్చింది. కానీ హీరోగా సుదీర్ఘ కాలం అవకాశాల్ని అందుకోలేకపోయాడు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వారసులు ఇద్దరూ బాలనటులు అయ్యారు. బేబి అల్లు అర్హ చిచ్చర పిడుగు. సమంతతో కలిసి శాకుంతలం చిత్రంలో నటించేసింది. 10ఏళ్ల లోపే అర్హ నటి అయింది. అలాగే అల్లు అయాన్ కూడా అల్లరోడు అని ప్రూవ్ చేస్తూ ఇటీవల ఓ వీడియో బయటికి వచ్చింది. అల్లు అయాన్ తదుపరి 'పుష్ప 2' చిత్రంలో బాలనటుడిగా పరిచయం కానున్నాడని ప్రచారం సాగుతోంది. కానీ దీనికి సరైన ఆధారం లేదు.