మెగాస్టార్ తో అనీల్ రావిపూడి మ్యాజిక్!
తాజాగా చిరంజీవి ప్రాజెక్ట్ విషయంలోనూ అనీల్ అదే తరహా లాజిక్ అప్లై చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఏప్రిల్ లేదా మేలో ప్రారంభమవుతుందని అంటున్నారు.
By: Tupaki Desk | 17 Dec 2024 6:35 AM GMTమెగాస్టార్ చిరంజీవి- అనీల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ సినిమా ఉంటుందని కొన్నాళ్లగా ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. అనీల్ వరుసగా సీనియర్ హీరోలను డైరెక్ట్ చేయడంతో? ఆ లిస్ట్ లో మెగాస్టార్ ఎప్పుడు చేరతారా? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. తాజాగా ఆ ప్రాజెక్ట్ దాదాపు లాక్ అయినట్లు తెలుస్తోంది. అనీల్ కి మెగాస్టార్ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వస్తుందని వినిపిస్తుంది.
ప్రస్తుతం చిరంజీవి 'విశ్వంభర' చిత్రం పూర్తిచేసే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన వెంటనే అనీల్ చిత్రాన్ని పట్టాలెక్కించేలా మెగాస్టార్ సిద్దమవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని సైన్ స్క్రీన్ పతాకంపై- సాహూ గారపాటి నిర్మిస్తారని తెలిసింది. అయితే ఇది అనీల్ మార్క్ సినిమాకు భిన్నంగా ఉండే కథ అని సమా చారం. ఇందులో చిరంజీవి క్యారెక్టరైజేషన్ చాలా కొత్తంగా ఉంటుందిట. 'భగవంత్ కేసరి'లో బాలయ్య ను కూడా కాస్త డిఫరెంట్ గా చూపించడంతో ఆ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అయింది.
రోటీన్ అంశాలున్నా బాలయ్య ఇమేజ్ తో మంచి విజయం సాధించింది. తాజాగా చిరంజీవి ప్రాజెక్ట్ విషయంలోనూ అనీల్ అదే తరహా లాజిక్ అప్లై చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఏప్రిల్ లేదా మేలో ప్రారంభమవుతుందని అంటున్నారు. అదే జరిగితే మెగాస్టార్ 157 ఈ సినిమా అవుతుంది. ఈ నెంబర్ విషయంలో ఎంతటి డైలమా కొనసాగుతుందో తెలిసిందే. తొలుత ఇదే నెంబర్ తో ఓ సినిమాని చిరంజీవి ప్రకటించి వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే.
ఆ తర్వాత రకరకాల దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. చివరిగా ఇటీవలే 'దసరా' ఫేం శ్రీకాంత్ ఓదెల తో ఓ ప్రాజెక్ట్ లాక్ చేసారు. దీంతో 'విశ్వంభర' తర్వాత పట్టాలెక్కే ప్రాజెక్ట్ అదే అనుకున్నారు. కానీ అంతకంటే ముందు నుంచే అనీల్ మెగాస్టార్ కి టచ్ లో ఉన్నారు. దీంతో అనీల్ కే మొదటి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే బోయపాటి శ్రీను తో కూడా మెగాస్టార్ ఓ ప్రాజెక్ట్ అగ్రిమెంట్ చేసుకున్నట్లు వినిపిస్తుంది.