ఆ రోజులు గుర్తొస్తే ఇప్పటికీ బాధేస్తుంది: చిరంజీవి
ఎంతో సరదాగా సాగిన ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టింది మెగా ఫ్యామిలీ.
By: Tupaki Desk | 8 March 2025 2:00 PM ISTమహిళా దినోత్సవ సందర్భంగా మెగా ఫ్యామిలీ నుంచి మెగా ఉమెన్స్ పేరుతో ఓ స్పెషల్ ఇంటర్వ్యూ రిలీజైంది. ఈ ఇంటర్య్వూలో తల్లి అంజనాదేవి, సోదరీమణులు, తమ్ముడు నాగబాబుతో కలిసి పాల్గొన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఎంతో సరదాగా సాగిన ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టింది మెగా ఫ్యామిలీ.
తన ఫ్యామిలీలో అందరికంటే తానే ఎక్కువ చలాకీగా ఉండేవాడినని చెప్పిన చిరూ, తనకు మూడేళ్ల వయసున్నప్పుడు ఆడుకోవడానికి రోడ్డు మీదకు వెళ్లిపోయి, తిరిగి ఎటు రావాలో అర్థం కాక రోడ్డు మీద ఏడ్చుకుంటూ కూర్చున్నానని, అక్కడున్న ఒకతను తనను చూసి కొలిమిలోకి తీసుకెళ్లి తన ఇంటికి కబురు పంపారని, తన తల్లి వచ్చేసరికి మొత్తం ఒళ్లంతా మసి పూసుకుని ఉండటంతో ఆమె గుర్తు పట్టలేకపోయి, వీడు మా అబ్బాయి కాదని వెళ్లిపోబోతూ డౌట్ తో వెనక్కి తిరిగి చూసి తనను గుర్తుపట్టి ఇంటికి తీసుకెళ్లి తనను తాళ్లతో కట్టేసిందని ఆ రోజుల్ని గుర్తు చేసుకున్నారు చిరూ.
ఇప్పుడైతే తాము ఐదుగురుమే కానీ తన తల్లికి మరో ముగ్గురు బిడ్డలు ఉండేవారని, చిన్న వయసులోనే వాళ్లు చనిపోయారని, తమ తండ్రి ఉద్యోగంలో బిజీగా ఉంటే ఇంట్లో అన్ని పనులు తన తల్లే చక్కబెట్టుకునేదని, అప్పటినుంచే తల్లికి అన్ని పనుల్లో హెల్ప్ చేస్తూ ఉండేవాడినని చిరూ తెలిపారు. తాను ఆరో తరగతిలో ఉన్నప్పుడు తన సోదరి రమ అనారోగ్యానికి గురైందని, తల్లి, తాను కలిసి హాస్పిటల్ కు తీసుకెళ్తే రెండ్రోజులకు తను చనిపోయిందని, చేతుల్లో తనను ఇంటికి తీసుకెళ్లి, ఇరుగుపొరుగు సాయంతో అన్ని కార్యక్రమాలు పూర్తిచేశామని, తమ తండ్రి వచ్చేసరికి అంతా అయిపోయిందని, జీవితంలో ఆ క్షణాల్ని మర్చిపోలేనని, ఇప్పటికీ ఆ సంఘటన గుర్తొస్తే బాధేస్తుందని చిరూ అన్నారు.
తన తండ్రి గురించి కూడా ఈ ఇంటర్వ్యూలో చిరూ గుర్తు చేసుకున్నారు. చిన్నప్పటి నుంచి తండ్రి తమకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారని, సినిమాల్లోకి వెళ్తా అని చెప్పినప్పుడు ఆయన భయపడ్డారు తప్పించి ఎప్పుడూ వద్దనలేదని, షూటింగ్స్ లో అలసిపోయి ఇంటికొచ్చినప్పుడు అమ్మలా తనను చేరదీస్తూ తనకు సపోర్ట్ గా ఉండేవారని చిరూ వెల్లడించారు.
అయితే ఓసారి గూండా సినిమా షూటింగ్ కోసం ట్రైన్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు ఎందుకిలాంటివి చేస్తుంటావ్ అని తనపై కోప్పడ్డారని, ఏం కాదని తాను నచ్చజెప్పినప్పటికీ రేపు నీకొక కొడుకు పుట్టి, వాడు ఇలానే చేస్తే నా భయం నీకు అర్థమవుతుంది అనే వారని, మగధీర షూటింగ్ టైమ్ లో ఓ స్టంట్ చేస్తూ చరణ్ కిందపడినప్పుడు తన తండ్రి పడిన భయం అర్థమైందని చిరూ చెప్పారు.
ఇదే ఇంటర్వ్యూలో చిరంజీవి తల్లి కుటుంబమంటే అందరూ కలిసి మెలసి ఉండటమేనని, అందరూ ఒకరికొకరు తోడుగా ఉంటే చూడ్డానికి ఎంతో బావుంటుందని, ఈ రోజుల్లో మనుషుల మధ్య ప్రేమలు తక్కువయ్యాయి అనిపిస్తుందని అన్నారు. తమ ఇంట్లో పిల్లలతోనే కాకుండా కోడళ్లతో కూడా తనకు మంచి అనుబంధముందని, చిరంజీవి భార్య సురేఖ తనకు కోడలు కాదు కూతురని అంజనాదేవి అన్నారు.