Begin typing your search above and press return to search.

రంగ‌స్థ‌లంపై చిరంజీవి తొలి నాట‌కం ఏదో తెలుసా?

చిరంజీవి న‌టించిన మొద‌టి చిత్రం పునాది రాళ్లు రిలీజై ఇప్ప‌టికే నాలుగు ద‌శాబ్ధాలు పూర్త‌యింది.

By:  Tupaki Desk   |   26 Oct 2024 5:39 AM GMT
రంగ‌స్థ‌లంపై చిరంజీవి తొలి నాట‌కం ఏదో తెలుసా?
X

మెగాస్టార్ చిరంజీవి త‌న కెరీర్ లో 157వ సినిమాలో న‌టిస్తున్నారు. మెగా 157 టైటిల్ `విశ్వంభ‌ర‌`. 69 వ‌య‌సులో యువ‌త‌రంతో పోటీప‌డుతూ ఆయ‌న ఛామింగ్ లుక్స్ ని మెయింటెయిన్ చేయ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. చిరంజీవి న‌టించిన మొద‌టి చిత్రం పునాది రాళ్లు రిలీజై ఇప్ప‌టికే నాలుగు ద‌శాబ్ధాలు పూర్త‌యింది. 1979లో ఈ సినిమా విడుద‌లైంది. 44 ఏళ్లుగా సినీరంగంలో ఆయ‌న ఇంతింతై ఎదిగారు. ఎదురే లేని స్టార్ గా త‌న‌ను తాను ఆవిష్క‌రించుకున్నారు.


ఆయ‌న మ‌ద్రాసులో న‌ట‌శిక్ష‌ణ‌కు వెళ్ల‌క మునుపు రంగ‌స్థ‌లంపైనా రాణించార‌నేది తెలిసిన విష‌య‌మే. న‌ర‌సాపూర్ లో Y N M కాలేజ్ లో చ‌దువుకునే స‌మ‌యంలో ఎంతో యాక్టివ్ గా ఉండేవారు. `రంగస్థలం` మీద తొలి నాటకం `రాజీనామా`. కోన గోవింద రావు రచన అందించారు. చిరుకి నటుడిగా తొలి గుర్తింపు ఇచ్చిన‌ది ఈ నాట‌క‌మే. తొలి ప్ర‌య‌త్న‌మే ఉత్త‌మ న‌టుడిగా రంగ‌స్థ‌లంపై వెలిగిపోయాడు. త‌న గురువుల ఎన‌లేని ప్రోత్సాహంతో ఆయ‌న న‌ట‌జీవితం మొద‌లైంది. 1974 -2024 మ‌ధ్య ఈ ప్ర‌యాణం సాగింది. అంటే రంగ‌స్థ‌లంపై న‌టుడిగా మొద‌లై 50 సంవత్సరాల నట ప్రస్థానం పూర్త‌యింది. ఇది త‌న‌కు ఎనలేని ఆనందం క‌లిగిస్తోంద‌ని చిరంజీవి ఎమోష‌న‌ల్ పోస్ట్ ని షేర్ చేసారు ఇన్ స్టాలో. ఈ సంద‌ర్భంగా తాను చ‌దువుకున్న‌ న‌ర్సాపూర్ #YNM కాలేజ్ ని ఆయ‌న స్మ‌రించుకున్నారు. రంగ‌స్థ‌లంపై మంచి పేరు తెచ్చుకుని అదే ఆత్మ‌విశ్వాసంతో మ‌ద్రాసుకు వెళ్లి చిరు న‌ట‌శిక్ష‌ణ తీసుకున్నారు. అటుపై న‌టుడిగా త‌న కెరీర్ ని మ‌లుచుకున్నారు.

ఒక మారు చిరంజీవి స్వ‌గతంలోకి వెళితే.. కొణిదెల వెంక‌ట్రావు- శ్రీ‌మ‌తి అంజ‌నా దేవి దంప‌తుల‌కు 1955 ఆగ‌స్టు 22న తొలి సంతానం గా జ‌న్మించారు. త‌ల్లిదండ్రులు పెట్టిన‌ పేరు శివ‌శంక‌ర్ ప్ర‌సాద్ ..1974లో క‌ళాశాల‌లో చ‌దువుతున్న‌ప్పుడు `రాజీనామా` అనే నాట‌కంలో ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌ను పోషించారు. ఆ పాత్ర పోష‌ణ‌కు ఉత్త‌మ న‌టుడు అవార్డును సొంతం చేసుకున్నారు. అంత‌క‌ముందు ప‌దో త‌ర‌గ‌తి చ‌దివేప్పుడు స్కూల్ వార్సికోత్సవం సంద‌ర్భంగా నాట‌కం వేస్తే అందులో ఉత్త‌మ న‌టుడిగా అవార్డ్ వ‌చ్చింది. అవి ఆయ‌న అభిన‌య సామ‌ర్థ్యానికి నిద‌ర్శ‌నం. ఇవి రెండూ చిరంజీవిని ఆలోచింప‌జేసాయి. డిగ్రీ చ‌దివేప్పుడు ఎన్.సి.సి త‌ర‌పున కార్య‌క్ర‌మాల్లో పాల్గొని డిల్లీ వెళ్లారు. నాటి భార‌త ప్ర‌ధాని శ్రీ‌మ‌తి ఇందిరా గాంధీ స‌మ‌క్షంలో పోతురాజు పోలేర‌మ్మ ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌డం ఆయ‌న విద్యార్థి జీవితంలో మ‌ర్చిపోలేనిది. 1977 లో డిగ్రీ ప‌ట్టా పొందిన త‌ర్వాత తండ్రి అనుమ‌తి మేర‌కు ఐసీడ‌బ్లూఏ కోర్సులో చేర‌తాన‌ని చెప్పి చెన్నై చేరిన కొణిదెల శివ‌శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ అడ‌యార్ వ‌ర్శిటీలో చేరారు.

1978 మేలో ఫిలింఇనిస్టిట్యూట్ లో న‌ట‌శిక్ష‌ణ పూర్త‌యింది. ఆనాడు సినిమాల్లో చేరాల‌న్న ఆలోచ‌న ఆయ‌న‌కు రాక‌పోయినా.. అందుకు ఆయ‌న తండ్రి కొణిదెల వెంక‌ట్రావుగారు అంగీక‌రించ‌క‌పోయినా తెలుగు సినిమా చ‌రిత్ర ఒక మేలిమి న‌టుడిని, అద్భుత‌మైన వీకీ పేజీని పోగొట్టుకునేది అనడంలో సందేహం లేదు.