మెగాస్టార్ చిరంజీవికి ANR జాతీయ అవార్డ్
లెజెండ్ ఏఎన్నార్ అంతర్థానం అయినా కానీ ఆయన ఇంకా ప్రజల గుండెల్లో జీవించే ఉన్నారు.
By: Tupaki Desk | 20 Sep 2024 2:22 PM GMTలెజెండ్ ఏఎన్నార్ అంతర్థానం అయినా కానీ ఆయన ఇంకా ప్రజల గుండెల్లో జీవించే ఉన్నారు. ఈరోజు టాలీవుడ్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి. అక్కినేని కుటుంబం, అభిమానులు సినీ ప్రియులు ఈ ప్రత్యేక సందర్భంలో ANR ని సంస్మరించుకోవడమే గాక తమ ఆరాధ్య నటుడికి నివాళిగా కొన్ని టైమ్‌లెస్ క్లాసిక్‌లను తిరిగి సోషల్ మీడియాల్లో షేర్ చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. నాగార్జున అండ్ అక్కినేని కుటుంబం ఒక పెద్ద ప్రకటనను ఈ రోజు విడుదల చేసింది. వేదికపై అక్కినేని కుటుంబ సభ్యులంతా కొలువు దీరగా ఈ ప్రతిష్ఠాత్మక ప్రకటన చేసారు.
ఈ ఏడాది పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్‌ఆర్ జాతీయ అవార్డు ఇవ్వనున్నామని ఏఎన్ఆర్ శతజయంతి వేడుకల్లో నాగార్జున స్వయంగా వెల్లడించారు. అక్టోబర్ 28న ఓ ప్రత్యేక కార్యక్రమం జరుగుతుందని, చిరంజీవిగారికి బాలీవుడ్ షాహెన్‌షా అమితాబ్ బచ్చన్ స్వయంగా ఈ అవార్డును అందజేస్తారని నాగార్జున తెలిపారు. నాగార్జున మాట్లాడుతూ ``ప్రతి సంవత్సరం ఈ అవార్డును ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాం. మా నిర్ణయం గురించి చిరంజీవి గారికి తెలియజేసినప్పుడు ఆయన చాలా ఎమోషనల్ అయ్యి నన్ను కౌగిలించుకున్నారు. తన జీవితంలో ఇదే అతిపెద్ద అవార్డు అని చెప్పారు. ఈ వార్తను తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాము`` అని అన్నారు.
అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ టాలీవుడ్ ఐకాన్ ఏఎన్నార్ గౌరవార్థం ANR జాతీయ అవార్డును ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రతిభావంతులకు వారి జీవితకాల విజయాలు, కృషికి ప్రతి సంవత్సరం ఈ అవార్డును అందజేస్తున్నారు. ఈ మహత్తర సందర్భంలో, మెగాస్టార్ కి ప్రదానం చేయనున్న ప్రతిష్టాత్మక అవార్డు ప్రకటనతో పాటు, ఆయన గౌరవార్థం ఒక స్మారక స్టాంప్ ను విడుదల చేసారు.
ఏఎన్నార్ జాతీయ అవార్డును తొలిసారిగా 2006లో ప్రముఖ బాలీవుడ్ నటుడు దేవానంద్‌కు అందించారు. ఆ తర్వాత ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకున్న వారి జాబితా ఇలా ఉంది.
ANR అవార్డు విజేతలు
2024: చిరంజీవి
2019: రేఖ
2018: శ్రీదేవి
2017: SS రాజమౌళి
2014: అమితాబ్ బచ్చన్
2012: శ్యామ్ బెనగల్
2011: హేమ మాలిని
2010: కె. బాలచందర్
2009: లతా మంగేష్కర్
2008: వైజయంతిమాల
2007: అంజలీ దేవి & జయసుధ
2006: దేవానంద్, షబానా అజ్మీ