Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ నువ్వు మాత్ర‌మే చేస్తావ‌ని ప్ర‌జలు న‌మ్మారు: చిరంజీవి

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ రోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   2 Sep 2024 6:26 AM GMT
ప‌వ‌న్ నువ్వు మాత్ర‌మే చేస్తావ‌ని ప్ర‌జలు న‌మ్మారు: చిరంజీవి
X

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ రోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ప్ర‌తిసారీ పుట్టిన‌రోజు వేరు.. ఈసారి పుట్టిన‌రోజు వేరు. అందుకే ఆయ‌న‌కు ప్ర‌త్యేకించి స్పెష‌ల్ విషెస్ అందుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, రాజ‌కీయ స‌హ‌చ‌రులు స‌హా అభిమానులు ప‌వ‌న్ కి తమ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

అయితే అన్న‌య్య చిరంజీవి ఆశీస్సులు శుభాకాంక్ష‌లు ఎప్ప‌టిలాగే ప్ర‌త్యేకం. చిరంజీవి త‌న ఇన్ స్టాలో ప‌వ‌న్ ని ఇలా విష్ చేసారు. ``ప్రతి సంవత్సరం నీకు పుట్టినరోజు వస్తుంటుంది. కానీ, ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం. ఆంధ్ర ప్రజానీకానికి కావలసిన సమయంలో, కావాల్సిన నాయకుడు వాళ్ల జీవితంలో పెను మార్పులు తీసుకురావడానికి వాళ్ల ఇంటి పెద్ద బిడ్డగా వచ్చాడు. రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిలకడ, నిబద్ధత కలిగిన ఒక నాయకుడిగా నిన్ను వాళ్ల జీవితాల్లోకి ఆహ్వానించారు. గుండెల్లో స్థానం ఇచ్చారు. అది సుస్థిరం. ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి, రావాలి. అద్భుతాలు జరగాలి. అది నువ్వు మాత్రమే చేయగలవు.. చేస్తావనే నమ్మకం నాతో పాటు ఆంధ్ర ప్రజలందరికీ ఉంది. పుట్టిన రోజు శుభాకాంక్షలు.. దీర్ఘాయుష్మాన్ భవ!`` అని రాసారు.

చిరంజీవి తాను యువకుడైన పవన్ కళ్యాణ్‌తో క‌లిసి ఉన్న‌ నోస్టాల్జిక్ ఫోటోను షేర్ చేస్తూ పై వ్యాఖ్యానాన్ని జోడించారు. అలాగే బాబాయ్ పవన్ కళ్యాణ్ గొప్ప నాయకుడిగా ఎదగాలని ఆకాంక్షిస్తూ రామ్ చరణ్ శుభాకాంక్షలు తెలియజేశాడు. ``మా పవర్ స్టార్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు..మీ బలం, అంకితభావం, అవసరంలో ఉన్నవారి పట్ల కనికరం ఎల్లప్పుడూ నాకు, ఇంకా చాలా మందికి స్ఫూర్తినిచ్చాయి. మీ నిస్వార్థ చర్యలు, మీ నాయకత్వం, సామాజిక న్యాయం కోసం వాదించే త‌త్వం, ప్రజల అవసరాలను తీర్చడంలో అంకితభావంతో దృష్టి సారించడం , ఆంధ్రప్రదేశ్‌లోని అణగారిన వర్గాల జీవితాలపై సానుకూల ప్రభావం చూపడానికి కృషి చేయడం అద్భుతమైన స్ఫూర్తిదాయకం!! భగవంతుడు మీకు మార్గనిర్దేశం చేస్తూ, ఆశీర్వదిస్తూ, మరింత బలాన్ని ఇస్తూ ఉంటాడు`` అని చ‌ర‌ణ్ త‌న ఎక్స్ ఖాతాలో రాసారు.

చిరంజీవి - రామ్ చరణ్ ఇద్దరూ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సహాయం చేయడానికి, వారిని గర్వించేలా చేయడానికి ప్రాధాన్యతనిస్తున్నార‌ని హైలైట్ చేశారు. అత‌డి నిస్వార్థ సేవ‌లను కొనియాడారు. ప్ర‌స్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వరదలు ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేసిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, పవన్ కళ్యాణ్ అభ్యర్థన మేరకు OG మరియు హరి హర వీర మల్లు నిర్మాతలు ప్లాన్ చేసిన పుట్టినరోజు వేడుకలు రద్దయ్యాయి. ఈ రెండు ప్ర‌తిష్ఠాత్మ‌క సినిమాల అప్ డేట్స్ త‌ర్వాత విడుద‌ల‌వుతాయి.