Begin typing your search above and press return to search.

చిరంజీవి డ్యాన్స్ ను విమర్శించిన మేనేజర్!

అయితే డ్యాన్సుల్లో తన ప్రత్యేకతను చాటుకోవాలని బలంగా నిర్ణయించుకోడానికి కారణమైన ఓ విషయాన్ని గతంలో చిరంజీవి పంచుకున్నారు.

By:  Tupaki Desk   |   20 Oct 2024 2:30 AM GMT
చిరంజీవి డ్యాన్స్ ను విమర్శించిన మేనేజర్!
X

టాలీవుడ్ హీరోలలో బెస్ట్ డ్యాన్సర్ ఎవరంటే, ఎవరికైనా టక్కున గుర్తొచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి. కేవలం తన నటనతోనే కాదు, అదిరిపోయే డ్యాన్స్ లతోనూ అభిమానులను సొంతం చేసుకున్నారు. తెలుగు తెరకు బ్రేక్ డ్యాన్స్ ను పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఆరోజుల్లో ఆయన స్టెప్పులు చూడటం కోసమే జనాలు థియేటర్లకు తరలి వెళ్లేవారంటేనే అర్థం చేసుకోవచ్చు. ఆరు పదుల వయసులోనూ ఇప్పటికీ అదే గ్రేస్ ఫుల్ డ్యాన్స్ చేయడం చిరుకే చెల్లింది. 156 సినిమాలు.. 537 పాటలు.. 24,000 రకాల స్టెప్పులు.. ఇది ఎవరికీ సాధ్యమయ్యే విషయం కాదు. అందుకే ఆయన గిన్నిస్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు. అయితే డ్యాన్సుల్లో తన ప్రత్యేకతను చాటుకోవాలని బలంగా నిర్ణయించుకోడానికి కారణమైన ఓ విషయాన్ని గతంలో చిరంజీవి పంచుకున్నారు.

చిరంజీవి కెరీర్‌ ప్రారంభంలో ఓ సినిమాలో ఒక పాటకి డ్యాన్స్ చేస్తుంటే, అక్కడున్న వారంతా చప్పట్లు కొడుతూ అభినదించారట. అయితే ఆ సినిమా మేనేజర్ వెంకన్నబాబు మాత్రం అలానే చూస్తూ ఉన్నారట. దీంతో చిరు ఆయన దగ్గరకు వెళ్లి ‘డ్యాన్స్ ఎలా ఉంది?’ అని అడగ్గా.. ‘దాంట్లో ఏముంది? నీ వెనకున్న డ్యాన్సర్లు ఏం చేశారో, నువ్వూ అదే చేశావు. నీ ప్రత్యేకత లేకపోతే ఇంకెందుకు?’ అని అన్నారట. ఆ మాటే డ్యాన్సుల విషయంలో తన ఆలోచనా విధానాన్ని మార్చేసిందని చిరు ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నారు. డ్యాన్స్ మాస్టర్స్ చెప్పింది చేయడమే కాదు, దానికి అందనంగా ఇంకా ఏదో చెయ్యాలని ఆ క్షణమే అనిపించిందని.. అప్పటి నుంచీ సాంగ్ ను ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేయడం అలవాటు చేసుకున్నానని చిరంజీవి తెలిపారు.

చిరంజీవి తన డ్యాన్సులతోనే గిన్నిస్‌ బుక్‌ ఆఫ్ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు. 156 చిత్రాల్లో 537 పాటల్లో 24 వేల స్టెప్పులతో అలరించినందుకు గాను ఇటీవల ఆయనకు రికార్డు దక్కింది. గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధులు, బాలీవుడ్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ.. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ లో ఎక్కడం తాను అస్సలు ఊహించలేదని, తన సినీ ప్రస్థానంలో ఎదురుచూడకుండానే దక్కిన గొప్ప గౌరవమని అన్నారు. దీనికి కారణభూతులైన దర్శక నిర్మాతలు, అభిమానులకు ఎప్పటికీ రుణపడి ఉన్నానని తెలిపారు. నటన కంటే డ్యాన్స్ మీదనే తాను ఓనమాలు దిద్దినట్లు అనిపిస్తోందన్నారు. 'ప్రాణం ఖరీదు' చిత్రంలో 'ఏలో ఏలో ఎన్నియల్లో' పాట ద్వారా తొలిసారిగా తన డ్యాన్సులు స్క్రీన్ మీద కనిపించాయని, అంతకంటే ముందు 'పునాది రాళ్లు' సినిమాలోనూ డ్యాన్స్ చేసానని చెప్పారు. తన విజయ పరంపరలో సాంగ్స్ డ్యాన్స్ అనేవి అంతర్భాగం అయిపోయాయని, డ్యాన్స్ స్కిల్స్ తనకు ఎక్స్ట్రా బెనిఫిట్ అయిందని అన్నారు.

చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ అనే చిత్రంలో నటిస్తున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో ఈ సోషియో ఫాంటసీ యాక్షన్‌ అడ్వెంచరస్‌ థ్రిల్లర్‌ తెరకెక్కుతోంది. ఇందులో త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. సురభి, ఇషా చావ్లా, కునాల్ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కావాల్సిన ఈ సినిమాని 'గేమ్ చేంజర్' కోసం వాయిదా వేసుకున్నారు.