ఫలించిన మెగా డాటర్ ఆశ
కాస్ట్యూమ్ డిజైనర్ గా ఇండస్ట్రీలోకి ఎంటరైన సుస్మిత తర్వాత తండ్రి హీరోగా తన నిర్మాణంలో సినిమా చేయాలనుకుంది.
By: Tupaki Desk | 30 March 2025 8:41 AMఎంత సెలబ్రిటీల వారసులైనా వారిక్కూడా కొన్ని కోరికలుంటాయి. తమ తండ్రి సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని కొందరనుకుంటే, ఆల్రెడీ స్టార్ గా ప్రూవ్ చేసుకున్న తండ్రితో కలిసి నటించాలని కొందరికి, తనతో కలిసి ఎలాగైనా సినిమాలు చేయాలని ఇంకొందరికి ఆశలు, కోరికలు ఉంటుంటాయి. అలాంటి కోరికనే మెగాస్టార్ చిరంజీవి కూతురు కొణిదెల సుస్మితకు కూడా ఉంది.
ఎప్పట్నుంచో తండ్రితో కలిసి వర్క్ చేయాలనుకుంటున్న సుస్మిత గత కొన్ని సినిమాలుగా తండ్రికి కాస్ట్యూమ్ డిజైనర్ గా మారి తన తండ్రిని స్క్రీన్ పై మరింత అందంగా, కుర్రాడిగా చూపించగలిగింది. కాస్ట్యూమ్ డిజైనర్ గా ఇండస్ట్రీలోకి ఎంటరైన సుస్మిత తర్వాత తండ్రి హీరోగా తన నిర్మాణంలో సినిమా చేయాలనుకుంది.
తండ్రితో సినిమా నిర్మించాలని సుస్మిత ఎన్నో కలలు కన్నా అది నెరవేరడానికి మాత్రం చాలా టైమ్ పట్టింది. భోళా శంకర్ తర్వాత చిరంజీవి సుస్మిత బ్యానర్ లోనే సినిమా చేయాల్సింది కానీ సరైన డైరెక్టర్ దొరక్క ఆ సినిమా లేటవుతూ వచ్చింది. బీవీఎస్ రవి రాసిన కథకు డైరెక్టర్ కోసం ఎందరినో సంప్రదించినప్పటికీ వారు చెప్పిన స్క్రీన్ ప్లే చిరూ కి నచ్చకపోవడంతో కూతురితో ప్రాజెక్టు ఇప్పటివరకు సెట్ చేయలేకపోయారు చిరూ.
ఒకానొక టైమ్ లో సొంత ప్రొడక్షన్ లో చేయడం ఇష్టం లేకనే చిరంజీవి కావాలని కూతురి సినిమాను లేట్ చేస్తున్నారని కూడా వార్తలు వినిపించాయి. సరిగ్గా అలాంటి టైమ్ లో అనిల్ రావిపూడితో సినిమా ఓకే అవడం, చిరూ తన కూతురి కోరికను నిర్మాత సాహు గారపాటికి చెప్పి ఒప్పించడం అన్నీ చకచకా జరిగిపోయాయి.
మొత్తానికి ఇవాళ అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా సినిమా మొదలైంది. చిరంజీవి కెరీర్ లో 157వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సాహు గారపాటి నిర్మాతగా వ్యవహరిస్తుండగా, సాహు తో పాటూ చిరంజీవి కూతురు సుస్మిత కూడా నిర్మాణ భాగస్వామిగా ఉండనుంది. ఈ ప్రాజెక్టు సెట్ అయ్యే ముందే సుస్మిత తనతో సినిమా చేయాలని సంబరపడుతున్న విషయాన్ని చెప్పి ఆమెను కూడా ఈ ప్రాజెక్టులో భాగం చేసి సుస్మిత కోరికను నెరవేర్చారు చిరంజీవి. సుస్మిత ఎంతో కాలంగా కన్న కల ఇన్నాళ్లకు నెరవేరిందని మెగా ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.