చాలా హ్యాపీ.. నిజంగా అది గౌరవం: చిరంజీవి
అదే సమయంలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులతో మోదీ.. నిన్న (శుక్రవారం) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
By: Tupaki Desk | 8 Feb 2025 5:24 AM GMTభారత్ ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్ గా మార్చడమే లక్ష్యంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్.. 2025 చివరలో వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (WAVES)ను నిర్వహించనున్న విషయం తెలిసిందే. అందుకు తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అదే సమయంలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులతో మోదీ.. నిన్న (శుక్రవారం) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వారి నుంచి సమ్మిట్ గురించి పలు సలహాలు, సూచనలు స్వీకరించారు. అభిప్రాయాలు కూడా తెలుసుకున్నారు. టాలీవుడ్ నుంచి అగ్ర హీరోలు చిరంజీవి, నాగార్జున కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.
అయితే కాన్ఫరెన్స్ లో భాగం కావడం ఎంతో ఆనందంగా ఉందని ఇప్పుడు చిరంజీవి తాజాగా పోస్ట్ పెట్టారు. మోదీతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన వీడియోను కూడా షేర్ చేశారు. WAVES అడ్వైజరీ బోర్డ్‌లో భాగం కావడం ఆనందంగా ఉందంటూ మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎంతో గౌరవం కూడా ఉందని తెలిపారు.
"ఈ గౌరవాన్ని అందించిన ప్రధాని నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు. WAVES (వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్) అడ్వైజరీ బోర్డ్ లో భాగం కావడం, ఇతర సభ్యులతో పాటు నా అభిప్రాయం పంచుకోవడం నిజంగా ఒక గౌరవం" అని చెప్పారు. అనంతరం మోదీపై ప్రశంసలు కురిపించారు.
నరేంద్ర మోదీ జీ జ్ఞాన బండారం నుంచి వచ్చిన WAVES భారతదేశ పవర్ ను ప్రపంచంలో ఎత్తులకు నడిపిస్తుందని నాకు ఎటువంటి సందేహం లేదని తెలిపారు చిరు. త్వరలోనే కొత్త పుంతలు తొక్కడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం చిరంజీవి పోస్ట్.. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.
అయితే నిన్న జరిగిన భేటీ తర్వాత మోదీ కూడా పోస్ట్ పెట్టారు. WAVES అడ్వైజరీ బోర్డుతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. సినీ సెలబ్రిటీలు, వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు భారత్ ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్ గా తీర్చిదిద్దడంతోపాటు సమ్మిట్ కోసం విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారని తెలిపారు.
కాగా, చిరంజీవి, నాగార్జునతోపాటు బిగ్ బి అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, అనిల్ కపూర్, అనుపమ్ ఖేర్, హేమమాలినీ, దీపికా పదుకొణె తదితరులతోపాటు వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కూడా మోదీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.