చీరలో విశ్వక్ సింగారం.. చిరంజీవి ఫీలింగ్ ఇదీ!
విశ్వక్ సేన్ నటించిన `లైలా` ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
By: Tupaki Desk | 10 Feb 2025 3:56 AM GMTవిశ్వక్ సేన్ నటించిన `లైలా` ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో విశ్వక్ ఒక అందమైన అమ్మాయి పాత్రలో కనిపించనున్నారు. ఇది కామెడీ ఎంటర్ టైనర్. హైదరాబాద్ లో ఆదివారం సాయంత్రం జరిగిన `లైలా` ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ అభిమానుల హృదయాలను గెలుచుకుంది.
ఈ సాయంత్రం కార్యక్రమం అంతటా మెగా సందడితో సరదాగా గడిచిపోయింది. చిరంజీవితో తనకు, తన తండ్రికి చాలా కాలంగా పరిచయం ఉందని, మెగాస్టార్ రాజకీయ జీవితంలో ఆయనతో సన్నిహిత సంబంధం ఉందని విశ్వక్ గతంలోనే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని చిరంజీవికి సన్నిహితుడైన సాహు గారపాటి నిర్మించారు. వాస్తవానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్న చిరంజీవి తదుపరి చిత్రాన్ని కూడా ఆయన నిర్మిస్తున్నారు.
ఇక లైలా ప్రీరిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన చిరంజీవి- విశ్వక్ ల మధ్య సరదా సంభాషణలు అహూతులను ఆకట్టుకున్నాయి. వేదికపై ఏర్పాటు చేసిన స్క్రీన్ పై మెగాస్టార్ చిరంజీవి మహిళా గెటప్ ఫోటోలను డిస్ ప్లే చేసి దానిపై విశ్వక్ ప్రశ్నలు కురిపించాడు. ఇది `చంటబ్బాయ్` సినిమాలోని గెటప్. చాలా కాలం తర్వాత ఇలా ఒక వేదికపై ప్రదర్శించడంతో ఆ ఫోటోలను చూసి దశాబ్ధాలు అయిపోయిందని చిరంజీవి గుర్తు చేసుకున్నారు.
ఇలాంటి లేడీ గెటప్ వేస్తే ఫీలింగ్ ఎలా ఉంటుంది సర్? అని చిరుని విశ్వక్ ప్రశ్నించాడు. ``గ్లామర్ లో పోటీ పెడితే నన్ను దాటిపోయావయ్యా...`` అంటూ చిరు విశ్వక్ లేడీ గెటప్ ని ప్రశంసించారు. ఇక్కడ (తన ఫోటోలను చూపిస్తూ) అంతా కళ ఎక్కువైపోయింది.. నీ లాంటి వాడి దగ్గర గ్లామర్ గా ఉండేప్పటికి.. నా లాంటి వాడికే కొంత ఊఊ అనిపించింది.. .అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. అలాగే చంటబ్బాయిలోని తన లేడీ గెటప్ ఫోటో చూసి దశాబ్ధాలు అయిపోయిందని చిరు అన్నారు. నటుడిగా ఇది కష్టం.. మీరే నా స్ఫూర్తి సర్.. అని విశ్వక్ ఈ సందర్భంగా చిరుతో అన్నారు. ఆ వేషంలో మిమ్మల్ని మీ అమ్మగారు, భార్య చూసినప్పుడు ఏమన్నారు? అని విశ్వక్ మరోసారి చిరును ప్రశ్నించాడు. ``వాళ్లు నన్ను చూయడలేకపోయారు. మీసం పెంచుకునే వరకూ ఇంటికి రావొద్దన్నారు`` అని వ్యాఖ్యానించారు.
అప్పట్లో `చంటబ్బాయి` సెట్స్ లో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ గురించి చిరు వివరంగా చెప్పుకొచ్చారు. ఆ టైమ్ లో షూటింగ్ సమయంలో మీసాలు తీయలేదు. దర్శకుడు జంధ్యాల గారు మీసాలు తీయాలన్నారు. సెట్లో 60-70 మంది పని చేస్తున్నారు. అందరూ తీస్తేనే నేను మీసాలు తీస్తానని అన్నాను.. అందరి చేతా తీయించేశారు. అలాగే అందరి చేతా చీరలు కట్టించేవాడిని.. అని కూడా చిరు గుర్తు చేసుకున్నారు.
అసలు నాకు ఈ ఐడియానే రాలేదు. అలా చేస్తే చాలా బావుండేది కదా! అని విశ్వక్ కూడా రియలైజ్ అయ్యారు. ఐడియాని మిస్ చేయకు.. మీ ఫ్యాన్స్ అందరినీ చీరలు కట్టుకుని థియేటర్లకు వచ్చేయమనండి..! అంటూ సరదాగా వ్యాఖ్యానించారు చిరు. వచ్చేసినా వచ్చేస్తారు సర్.. పాపం వాళ్లకు భేషజాలుండవు.. అని విశ్వక్ సరదాగా సమాధానమిచ్చారు.