విశ్వక్ బాలకృష్ణ కాంపౌండ్.. మెగాస్టార్ ఊహించని కామెంట్
విశ్వక్ సినిమా వేడుకకు చిరంజీవి హాజరవ్వడంపై కొంత మంది ఆశ్చర్యపోయారని, అయితే ఆ ప్రశ్నకు ఆయన తనదైన శైలిలో సమాధానం ఇచ్చారని చెబుతున్నారు.
By: Tupaki Desk | 10 Feb 2025 4:23 AM GMTటాలీవుడ్‌లో ఇటీవల కాంపౌండ్ అనే మాట గట్టిగా వినిపిస్తోంది. హీరోలు, వారి ఫ్యాన్స్ మధ్య కాంపౌండ్ రాజకీయాలు ఎలా ఉంటాయనే చర్చ నడుస్తోంది. అయితే ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి తాజాగా స్పందించారు. విశ్వక్సేన్ హీరోగా నటించిన లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన పాల్గొని, ఈ టాపిక్‌పై ఓ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి సినీ ఇండస్ట్రీని ఒక కుటుంబంగా చూస్తారని అందరికీ తెలిసిందే. ఎవరు ఏ కాంపౌండ్‌కు చెందిన వాళ్లని కాకుండా, ఒకరికొకరు అండగా ఉండాలన్నదే ఆయన సిద్ధాంతం.
విశ్వక్ సినిమా వేడుకకు చిరంజీవి హాజరవ్వడంపై కొంత మంది ఆశ్చర్యపోయారని, అయితే ఆ ప్రశ్నకు ఆయన తనదైన శైలిలో సమాధానం ఇచ్చారని చెబుతున్నారు. "విశ్వక్సేన్ మన హీరో కాదు, బాలకృష్ణ కాంపౌండ్‌లో ఉంటాడు.. అప్పుడప్పుడు తారక్‌ను పొగుడతాడు" అని కొందరు అన్నారట. దీనిపై చిరంజీవి స్పందిస్తూ, "ఎవరి సినిమాకైనా మేము వెళ్లొచ్చు. అభిమానం వేరు, ఆప్యయత వేరు. నా కొడుకు రామ్ చరణ్‌కు సూర్య అంటే ఇష్టం.. దాంతో నేను అతని సినిమా ఫంక్షన్‌కు వెళ్లకూడదా? కలిసి భోజనం చేయకూడదా? అని స్పందించారు.
అలాగే చిరంజీవి ఓ ఆసక్తికరమైన విషయాన్ని షేర్ చేశారు. మీడియా సమావేశంలో "ఇండస్ట్రీకి కాంపౌండ్లు లేవా?" అనే ప్రశ్న ఎదురైనప్పుడు విశ్వక్సేన్ చెప్పిన సమాధానం అద్భుతమని చిరంజీవి అన్నారు. "మా ఇంటికి కాంపౌండ్ ఉందిగానీ, ఫిల్మ్ ఇండస్ట్రీకి లేదు" అని చెప్పిన విశ్వక్‌ను మెచ్చుకున్న చిరు, ఇండస్ట్రీలోని హీరోల మధ్య అనుబంధం గురించి వివరించారు. "మేమంతా కలిసి ఉంటాం. నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణతో కలిసి ఎన్నో ఈవెంట్లలో పాల్గొన్నాను. ఒకరి విజయాన్ని మరొకరు ఆనందించాలి. అలాగే పవన్ కళ్యాణ్ గురించి మీరు సంబరపడటాన్ని చూసి గర్వంగా అనిపించింది" అని అన్నారు.
అంతేకాదు, సినీ పరిశ్రమలో విజయానికి వెనుక ఉన్న కష్టాలను గురించి చిరంజీవి ప్రస్తావించారు. "ఒక సినిమా హిట్టయితే అందరూ ఆనందించాలి. ఎందుకంటే ఒక్క సినిమాకు వెనుక ఎన్నో కుటుంబాల జీవనం ఆధారపడి ఉంటుంది. నిర్మాతలకు లాభాలు వస్తే మళ్లీ సినిమాలు చేస్తారు. ఇండస్ట్రీ ఎదుగుదలకు ఇదే మార్గం" అని అన్నారు. అలాగే, "పుష్ప 2" సినిమా గురించి మాట్లాడుతూ, అది ఒక భారీ హిట్ అవ్వడం చాలా గర్వంగా అనిపించిందని అన్నారు.
ఈ సందర్భంగా విశ్వక్ పై చిరంజీవి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఈ సినిమాలో విశ్వక్ లేడీ గెటప్‌లో కనిపించిన తీరు చాలా బావుందంటూ సరదాగా ప్రశంసించారు. "నిజంగా విశ్వక్ అమ్మాయి అయ్యి ఉంటే, గుండె జారి గల్లంతయ్యేవాళ్లెందరో!" అంటూ నవ్వులు పంచారు. లేడీ గెటప్‌లో నటించడం పాత కాలం నుంచి ఒక ప్రత్యేకతగా ఉంటుందని, తాను కూడా ఓ సినిమాలో అలాంటి పాత్ర పోషించానని గుర్తుచేసుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ కూడా అలాంటి క్యారెక్టర్లలో అదరగొట్టారని చెప్పారు. ఇక లైలా సినిమా కూడా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని ఆయన కోరుకున్నారు.