చిరంజీవి జడ్జ్‌మెంట్ గురించి సుకుమార్..!
తాజాగా దర్శకుడు సుకుమార్ ఒక ఈవెంట్‌లో మాట్లాడుతూ.. తాను లెక్చరర్‌గా చేస్తున్న సమయంలో రాసుకున్న కథతో దర్శకుడిగా సినిమా చేయాలి అనుకున్నాను.
By: Tupaki Desk | 17 Jan 2025 12:30 PM GMTసినిమా ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి ఒక వ్యక్తిని అంచనా వేయడంలో, ఒక టెక్నీషియన్ ప్రతిభను గుర్తించడంలో ముందు ఉంటారు అనడంలో సందేహం లేదు. ప్రతిభ ఎక్కడ ఉన్నా బయటకు తీసుకు వచ్చి గుర్తింపు వచ్చే విధంగా మెగాస్టార్ చిరంజీవి మద్దతుగా నిలుస్తారని చాలా సందర్భాల్లో నిరూపితం అయ్యింది. తాజాగా మరోసారి ఆ విషయం గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎదుటి వారు మాట్లాడుతున్న తీరు, కథ చెప్పే విధానం ఇతర విషయాలను పరిగణలోకి తీసుకుని ఎలాంటి సినిమా తీయగలరు, ఆ సినిమా ఎలా ఉంటుంది, అతడి భవిష్యత్తు ఎలా ఉంటుందో చిరంజీవి చెప్పగలరు.
తాజాగా దర్శకుడు సుకుమార్ ఒక ఈవెంట్‌లో మాట్లాడుతూ.. తాను లెక్చరర్‌గా చేస్తున్న సమయంలో రాసుకున్న కథతో దర్శకుడిగా సినిమా చేయాలి అనుకున్నాను. కథను దిల్ రాజు గారి ద్వారా అల్లు అరవింద్ గారికి చెప్పాను, ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారి వద్దకు వెళ్లాను. కథ చెప్పిన తర్వాత అల్లు అరవింద్ గారితో చిరంజీవి గారు ఫోన్‌లో మాట్లాడారు. చిరంజీవి గారితో మొదటి సిట్టింగ్‌లోనే కథ ఓకే అయ్యింది. అదే విషయాన్ని అల్లు అరవింద్ గారికి చిరంజీవి గారు చెప్పారు. అయితే అవతల అల్లు అరవింద్ గారు మాత్రం కొత్త కుర్రాడు కదా, అనుభవం లేదు కదా ఎలా తీస్తాడో అంటూ అనుమానం వ్యక్తం చేశారు.
చిరంజీవి గారు మాత్రం తప్పకుండా ఇతడు మంచి సినిమాను తీస్తాడు, ఆర్యతో బన్నీకి మంచి పేరు వస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. కెమెరా పార్ట్ తీసి వదిలినా మంచి సినిమాగా నిలుస్తుంది. నమ్మకంతో వదిలేయ్ అని చెప్పడంతో ఆర్య సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఆ రోజు చిరంజీవి గారి జడ్జ్‌మెంట్ తీసుకోకుండా సందిగ్దంలో ఉండి ఉంటే కచ్చితంగా అల్లు అరవింద్ ముందుకు వెళ్లేవారు కాదు. ఆర్య సినిమా రాకపోతే సుకుమార్ అనే దర్శకుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేవాడు కాదు. చిరంజీవి వల్లే నేడు సుకుమార్ అనే దర్శకుడు ఇంత పెద్ద సినిమాలను తీస్తున్నాడు.
తాజాగా సుకుమార్ కూతురు సుకృతి ప్రధాన పాత్రలో నటించిన గాంధీ తాత చెట్టు సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. పద్మావతి మల్లాది దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదలకు ముందే పలు అవార్డులను సొంతం చేసుకుని ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో చోటు సొంతం చేసుకుంది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. ఆ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో భాగంగా సుకుమార్ మాట్లాడుతూ తన కెరీర్ గురించి చెప్పుకొచ్చారు. దర్శకుడు కథ చెప్పే విధానంతోనే సక్సెస్ ఆధారపడి ఉంటుంది అంటూ కొత్త దర్శకులకు సుకుమార్ సూచన చేశారు.