పవన్ కుమారుడి కోసం సింగపూర్ కి చిరంజీవి దంపతులు!
ఈ భవనంలోని రెండవ అంతస్తులో ఉన్న టమాటో అనే స్కూల్‌లో ఈస్టర్ క్యాంప్‌కు హాజరయ్యాడు శంకర్. కొద్ది రోజుల పాటు సాగే కుకింగ్ కోర్సు కోసం పవన్ కళ్యాణ్ సతీమణి శంకర్‌ను అక్కడ చేర్పించారు.
By: Tupaki Desk | 8 April 2025 5:16 PMడిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే.. సింగపూర్‌లోని రివర్ వాలీ రోడ్‌లో ఉన్న రోడ్ షాప్ హౌస్ అనే మూడు అంతస్తుల భవనంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ భవనంలోని రెండవ అంతస్తులో ఉన్న టమాటో అనే స్కూల్‌లో ఈస్టర్ క్యాంప్‌కు హాజరయ్యాడు శంకర్. కొద్ది రోజుల పాటు సాగే కుకింగ్ కోర్సు కోసం పవన్ కళ్యాణ్ సతీమణి శంకర్‌ను అక్కడ చేర్పించారు.
అయితే అదే అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో శంకర్‌తో పాటు మరో 15 మంది చిన్నారులు ప్రమాదంలో చిక్కుకున్నారు. వెంటనే స్పందించిన సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ వారిని సురక్షితంగా బయటకు తీసింది. ఈ ప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఈ విషయం తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి దంపతులు వెంటనే సింగపూర్‌కు బయలుదేరారు. ప్రత్యేక విమానంలో వారు అక్కడికి చేరుకోనున్నారు. పవన్ కళ్యాణ్ కుటుంబానికి అండగా నిలవడంతో పాటు వారికి ధైర్యం చెప్పేందుకు చిరంజీవి దంపతులు సింగపూర్ వెళుతున్నట్లు సమాచారం.
మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం విశాఖ మన్యం జిల్లా పర్యటన ముగించుకున్న వెంటనే సింగపూర్‌కు బయలుదేరారు.. అయితే, పవన్ కళ్యాణ్ సింగపూర్ చేరుకునేలోపే చిరంజీవి దంపతులు అక్కడికి వెళ్లే అవకాశం ఉంది. ఈ కష్ట సమయంలో పవన్ కళ్యాణ్ కుటుంబానికి అండగా నిలవడానికి మెగా కుటుంబం ముందుండటం అభిమానులకు ఊరటనిస్తోంది. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లోని తన పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లినట్లు సమాచారం. వెంటనే స్పందించిన పాఠశాల సిబ్బంది అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పవన్ భార్య అనా లెజ్నోవా సింగపూర్ లోనే ఉండి కుమారుడి ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను చిరంజీవి కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నట్లు సమాచారం.
ఈ ఘటనపై పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. ఏపీ మంత్రి నారా లోకేష్, వైఎస్ జగన్, తెలంగాణ బీఆర్ఎస్ నేత కేటీఆర్ కూడా మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేశారు. లోకేష్ మాట్లాడుతూ, ప్రమాద వార్త విని తాను షాక్ కు గురయ్యానని తెలిపారు. కేటీఆర్ కూడా ఇదే తరహాలో స్పందిస్తూ మార్క్ శంకర్ కు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.