నేను ఎదురు చూడని గొప్ప గౌరవం గిన్నీస్ బుక్ రికార్డు! చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే ఎన్నో అవార్డులు..రివార్డులు అందుకున్నారు. ఈ ఏడాది పద్మ విభూషణ్ కూడా ఆయన అందుకున్న అవార్డుల సరసన చేరింది.
By: Tupaki Desk | 22 Sep 2024 1:17 PM GMTమెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే ఎన్నో అవార్డులు..రివార్డులు అందుకున్నారు. ఈ ఏడాది పద్మ విభూషణ్ కూడా ఆయన అందుకున్న అవార్డుల సరసన చేరింది. తాజాగా చిరంజీవి గిన్నీస్ బుక్ ఆప్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్నారు. 156 చిత్రాలు, 537 పాటలు, 24 వేల స్టెప్పులతో అలరించినందుకు ఆయనకు ఈ రికార్డు దక్కింది. ఈ మేరకు గిన్నీస్ బుక్ ప్రతినిధి రిచర్డ్, బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ గిన్నీస్ బుక్ అవార్డును ఆదివారం హైదరాబాద్ లో ప్రధానం చేసారు.
చిరంజీవి మాట్లాడుతూ, ` ఈ వెంట్ ఇంత అందంగా ఉంది అంటే దానికి కారణం నామిత్రుడు అమీర్ ఖాన్. అందుకు అమీర్ జీకి కృజ్ఞతలు. ఆయనకు ఫోన్ కాల్..మెసెజ్ మాత్రమే పెట్టాను. వెంటనే ఆయన మరో ఆలోచన లేకుండా వచ్చారు. గిన్నీస్ రికార్డు నేను ఉహించనది. దానికి..నాకు ఏంటి సంబంధం అనే ఆలోచనలోనే ఉండే వాడిని. కానీ నేను ఎదురు చూడని గొప్ప గౌరవం దక్కింది. అందుకు కారణం అయిన దర్శక, నిర్మాతలకు, అభిమానులకు ఎప్పుడూ రుణ పడి ఉంటాను.
నటనకంటే డాన్సు మీద నాకున్న ఆసక్తి ఈ అవార్డు తో వచ్చిందనిపిస్తుంది. నేను నటనకంటే డాన్సుకే ఓనమాలు దిద్దాను అనిపిస్తుంది. నా చిన్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్లను ఎంటర్ టైన్ చేయడం కోసం సాయంత్ర వేళ అప్పట్లో త్రివిధ భారతి , రేడియో సిలోన్ గానీ వచ్చే తెలుగు పాటలకు డాన్సులు చేసేవాడిని. గ్రామ్ ఫోన్లు..టేప్ రికార్డులు లేవు. పాటలు రాగానే శంకర్ బాబును పిలవండి డాన్సు వేస్తాడని ఉత్సాహంగా పిలిచేవారు. ఎన్ సీసీలో చేరిన తర్వాత సాయంత్రం తిన్న తర్వాత అల్యుమినియం ప్లేట్లు తిరగేసి దరువేసు వేళ్లాం. అలా డాన్సు నాలో అంతర్భాగంగా మారిపోయింది. సంగీతం అనుగుణంగా డాన్సు చేసేవాడిని. ఓ సినిమా షూటింగ్ సమయంలో రాజమండ్రి కి సమీపంలో ఓగ్రామంలో వర్షం పడుతున్న సమయంలో ఓ పంచ లో కూడా డాన్సు చేసాను. అడగడం పాపం డాన్సు వేసేవాడిని. మధ్యలో కాలు జారి కింద పడిపోయాను. దాన్ని నేను నాగిని డాన్సుగా మార్చేసాను. అప్పుడు కోడైరెక్టర్ ఈ అబ్బాయి డాన్సు బాగా చేస్తాడన్నారు. నాలో డాన్సు స్కిల్ ఎక్స్ ట్రాగా ఉపయోగ పడింది` అన్నారు.
ఈ సందర్భంగా అమీర్ ఖాన్ మాట్లాడుతూ, ` నేను చిరంజీవి గారికి పెద్ద అభిమానిని. ఆయన్ని నా అన్నయ్యలా భావిస్తా. చిరంజీవిగారు ఎన్నో విజయాలు సాధించారు. జీవితంలోనూ ఎంతో సాధించారు. ఆయనతో పాటు ఈరోజు కార్యక్రమంలో భాగం అవ్వడం అదృష్టంగా భావిస్తున్నాను. అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. చిరంజీవి గారు ఇక్కడికి పిలిచినప్పుడు నన్ను ఎందుకు పిలుస్తున్నారు? అని అడిగాను. చిరంజీవిగారు ఎప్పుడు నన్ను అడగకూడదు. ఆయన నా విషయంలో ఆర్డర్ మాత్రమే వేయాలి. ఆయన విషయం చెప్పగానే చాలా థ్రిల్లింగ్ గా ఫీలయ్యాను. ఆయన ఏ పాటకు డాన్స్ చేసినా హృదయం పెట్టి పనిచేస్తారు. అతడు ఆ పాటను ఎంజాయ్ చేస్తూ చేస్తారు. ఆయన్ని అలా చూస్తుంటే అక్కడ నుంచి కదలి వెళ్లాలి అనిపించదు`అన్నారు.
ఈ కార్యక్రమంలో దర్శకుడు రాఘవేంద్రరావు, బి.గోపాల్, కోదండ రామిరెడ్డి, గుణశేఖర్ తో పాటు నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వీనీదత్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, సురేష్ బాబు, జెమినీ కిరణ్, మైత్రీ రవిశంకర్, తమ్మారెడ్డి భరద్వాజ, కెఎస్ రామారావు తదితరులు పాల్గొన్నారు. ఇంకా మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. వారంతా చిరంజీవికి అభినందనలు తెలిపారు.