'విశ్వంభర' మెగా మాస్ ట్రీట్.. గెట్ రెడి!
చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్ విశ్వంభర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
By: Tupaki Desk | 15 Feb 2025 11:25 AM GMTచిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్ విశ్వంభర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను అమాంతంగా పెంచగా, ప్రస్తుతం హైదరాబాద్ శంకర్ పల్లి వద్ద ఓ భారీ సెట్లో చిరంజీవి ఇంట్రడక్షన్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ పాట కోసం ఎ.ఎస్. ప్రకాష్ ప్రత్యేకంగా గ్రాండ్ సెట్ ను రెడీ చేయగా, శోభీ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.
ఇంట్రో సాంగ్‌కి ఎంఎం కీరవాణి మాస్ మ్యూజిక్ అందించగా, రామజోగయ్య శాస్త్రి అందమైన సాహిత్యాన్ని రాశారు. ఈ పాట చిరంజీవి అభిమానులను ఖచ్చితంగా ఉర్రూతలూగించనుందని మేకర్స్ చెబుతున్నారు. తాజాగా విడుదలైన స్టిల్‌లో మెగాస్టార్ స్టైలిష్ షేడ్స్‌తో కార్ నుంచి దిగుతూ మాస్ లుక్‌లో అదిరిపోయేలా కనిపిస్తున్నారు. ఈ లుక్ చిరు అభిమానులకు మంచి కిక్ ఇచ్చిందని చెప్పవచ్చు.
దర్శకుడు వశిష్ట తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా విశ్వంభరని తీర్చిదిద్దుతున్నారు. తొలి సినిమాగా బింబిసార బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించిన ఈ దర్శకుడు, చిరంజీవితో కలిసి మరొక విజువల్ స్పెక్టాకిల్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కథానాయకుడిగా చిరంజీవి ఉండటంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ చిత్రంలో త్రిష కృష్ణన్, ఆశికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా ఛోటా కె నాయుడు తన అనుభవంతో విజువల్ రిచ్‌నెస్‌ను తెరపై అందించనున్నారు. అత్యున్నత స్థాయి గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ సినిమా ప్రేక్షకులకు విభిన్నమైన అనుభూతిని ఇవ్వనుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
పాన్ ఇండియా లెవెల్‌లో రూపొందుతున్న ఈ చిత్రం, భారీ యాక్షన్ సీక్వెన్సెస్, గ్రాండ్ విజువల్స్‌తో థియేటర్లలో అద్భుత అనుభూతిని కలిగించబోతోందని యూనిట్ చెబుతోంది. విశ్వంభర సినిమా విడుదలకు ఇంకా సమయం ఉండగానే, ఈ ఇంట్రో సాంగ్ హైప్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. మరి సినిమా రిలీజ్ అనంతరం ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.