ఆ సినిమాపై మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు!
తాజాగా సైరా నష్టాల గురించి చిరంజీవి కూడా స్వయంగా అంగీకరించారు. ఓ చర్చా కార్యక్రమంలో ఈ విషయం పంచుకున్నారు.
By: Tupaki Desk | 14 April 2024 7:42 AM GMTస్వాతంత్య్రసమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహారెడ్డి కథని మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా 'సైరా నరసింహరెడ్డి'గా సురేందర్ రెడ్డి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియాలో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా ఎలాంటి ఫలితాలు సాధించిందో కూడా విధితమే. చిరంజీవి కెరీర్ లో తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో! ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి చేసిన సినిమా. చిరు సైతం ఎంతో నమ్మకంతో ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చారు.
ఇలాంటి కథలో నటించాలని ఎప్పటి నుంచో ఉన్న కోరికను నెరవేర్చుకున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. అయితే ఫలితాలు మాత్రం అనుకున్న విధంగా రాలేదు. తొలుత హిట్ సినిమా అని చెప్పుకున్నా ? ఆ తర్వాత సైరా అసలు ఫలితాలు తెలిసే సరికి అంతా షాక్ అవ్వాల్సిన సన్నివేశం. తాజాగా సైరా నష్టాల గురించి చిరంజీవి కూడా స్వయంగా అంగీకరించారు. ఓ చర్చా కార్యక్రమంలో ఈ విషయం పంచుకున్నారు.
'ఇప్పటివరకూ నేను చేసిన అన్ని పాత్రలు...సినిమాలతో పూర్తిగా సంతృప్తిగా ఉన్నాను అని చెప్పలేను. ఎందుకంటే మనం ఎదురు చూసే పాత్రలు ప్రతిసారీ రావు. మనం ఒకటి అనుకుంటే మరొకటి వస్తుంటాయి. వాటంతట అవి వస్తే తప్ప! చెయ్యలేం. స్వాతంత్య్ర సమరయోధుడి కథలో నటించాలని ఎప్పటి నుంచో ఉండేది. ఆ కోరిక సైరాతో తీరింఇ. కానీ ఆ సినిమా పూర్తిగా సంతృప్తినివ్వలేదు. తెలుగులో అనుకున్నంతగా రీచ్ అవ్వలేదు.
మిగతా చోట్ల పర్వాలేదు. కానీ ఆ సినిమా వల్ల చాలా నష్టపోయాం. నా సంతృప్తి కోసం చేస్తే నిర్మాత జేబు ఖాళీ అవుతుంది. 'రుద్రవీణ' సమయంలోనూ ఇదే జరిగింది. ఆసినిమాకి మంచి పేరొచ్చింది. కానీ డబ్బులు రాలేదు. దీంతో నాగబాబు నష్టపోయాడు. ఈ కారణంగానే తర్వాత కాలంలో నిర్మాతల బాగు కోసం కమర్శియల్ సినిమాల వైపు వచ్చేసాను. నిర్మాత బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. నాలుగు కొత్త సినిమాలు రావడానికి అవకాశం ఉంటుంది. అదే సినిమా ప్లాప్ అయితే ఆ నిర్మాత మళ్లీ సినిమా తీయాలంటే భయపడతాడు. అందుకే హీరో నిర్మాతకు భరోసా ఇవ్వగలిగాలి' అని అన్నారు.