Begin typing your search above and press return to search.

పరువుతో హిట్ కొట్టిన కూతురు.. మెగాస్టార్ ఫుల్ హ్యాపీ

చిరంజీవి, ఈ వెబ్‌సిరీస్‌ను చూసిన తర్వాత, సుస్మిత మరియు నాగబాబుపై ప్రశంసలు కురిపిస్తూ, సుస్మిత తన కూతురు చూసి గర్వంగా ఉందని చెప్పారు.

By:  Tupaki Desk   |   20 Jun 2024 4:29 PM GMT
పరువుతో హిట్ కొట్టిన కూతురు.. మెగాస్టార్ ఫుల్ హ్యాపీ
X

మెగాస్టార్ చిరంజీవి తన పెద్ద కూతురు సుస్మిత కొణిదెల తాజా వెబ్‌సిరీస్ "పరువు" విజయంపై తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. సుస్మిత మరియు విష్ణు ప్రసాద్ లగ్గిశెట్టితో కలిసి నిర్మించిన ఈ సిరీస్ ఇటీవల జీ5 ప్లాట్‌ఫామ్‌లో విడుదలై ప్రేక్షకుల మనసును దోచుకుంది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంతో రూపొందిన ఈ సిరీస్‌లో నివేతా పేతురాజ్, నరేష్ అగస్త్య, నాగబాబు ముఖ్య పాత్రల్లో కనిపించారు.

సుస్మితకు చెందిన గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సిరీస్‌కి సిద్దార్థ్ నాయుడు మరియు వడ్లపాటి రాజశేఖర్ దర్శకత్వం వహించారు. వన్ సాధినేని ఈ ప్రాజెక్ట్‌కు షో రన్నర్‌గా వ్యవహరించారు. చిరంజీవి, ఈ వెబ్‌సిరీస్‌ను చూసిన తర్వాత, సుస్మిత మరియు నాగబాబుపై ప్రశంసలు కురిపిస్తూ, సుస్మిత తన కూతురు చూసి గర్వంగా ఉందని చెప్పారు. "పరువు" వెబ్‌సిరీస్‌లో నాగబాబు నెగటివ్ షేడ్స్‌తో నటించిన పాత్ర చాలా చక్కగా ఉందని మెగాస్టార్ అభినందించారు.

సీరీస్ సక్సెస్‌పై ఆనందం వ్యక్తం చేస్తూ, "చందు బాడీ మాయం చేయడం, ఆ జంట పడే తిప్పలు, అదే విషయమై ఎమ్మెల్యే గారి పాట్లు... చివరకు ఈ జంట తప్పించుకుందా లేదా అని సీజన్ 2లో చూడాలనుకుంటున్నా" అంటూ చిరంజీవి చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. పరువు సీజన్ 1 క్లైమాక్స్‌లో బిగ్‌బాస్ విన్నర్ బిందు మాధవి గెస్ట్ రోల్‌లో కనిపించి ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేశారు. మేకర్స్ హింట్ ప్రకారం, సీజన్ 2లో బిందు మాధవి పాత్ర హైలైట్‌గా ఉండబోతోంది.

తెలుగులో నివేతా పేతురాజ్ చేసిన ఫస్ట్ వెబ్‌సిరీస్ ఇది. చాలా కాలం తర్వాత ఆమె తెలుగులో కనిపించడం ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభవంగా మారింది. ఇకపోతే, పరువు వెబ్‌సిరీస్ కథ విషయానికి వస్తే, ఆంధ్రా ప్రాంతానికి చెందిన పల్లవి (నివేతా పేతురాజ్) పెద్దలను ఎదిరించి తెలంగాణాకు చెందిన సుధీర్ (నరేష్ అగస్త్య)తో ప్రేమ వివాహం చేసుకుంటుంది. ఇతర కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నందున పల్లవిని ఆమె కుటుంబ సభ్యులు దూరం పెడతారు.

పల్లవి, ఆమె భర్త సుధీర్ కలిసి సొంత ఊరికి ప్రయాణిస్తున్నప్పుడు అనుకోకుండా పల్లవి బావ చందును సుధీర్ చంపేస్తాడు. ఈ శవాన్ని దాచడం కోసం పల్లవి మరియు సుధీర్ చేసే ప్రయత్నాలు, చందు జాడ వెతికే స్వాతి (ప్రణీత పట్నాయక్), లోకల్ ఎమ్మెల్యే రామయ్య (నాగబాబు) మీద అనుమానాలు, తదితర అంశాలు ఈ సిరీస్‌లో ప్రధానంగా చూపబడతాయి.