కోలీవుడ్ ని మెగాస్టార్ ఎందుకు లైట్ తీసుకున్నట్లు?
మరి అంతటి లెజెండ్ కోలీవుడ్ మార్కెట్ పై ఎందుకు దృష్టి పెట్టలేదు? అన్నది ఎంతో కాలంగా అభిమానుల్లో ఉన్న సందేహం. ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్ కి వచ్చింది.
By: Tupaki Desk | 16 Dec 2023 12:30 AM GMTటాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి కోట్లాది మంది అభిమానించే అగ్ర హీరో. ఎన్టీఆర్..ఏఎన్నార్..కృష్ణ..శోభన్ బాబు లాంటి లెజెండరీ నటుల తర్వాత స్థానం ఎవరిది? అంటే టక్కున గుర్తొచ్చేది మెగాస్టార్ మాత్రమే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వెళ్లి మెగాస్టార్ గా ఆయన ఎదిగిన వైనం ఎంతో మందికి స్పూర్తి దాయకం. తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ ని అభిమానించని వారు అంటూ ఉండరు. తెలుగు పరిశ్రమకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం.
ఆయన సినిమా రిలీజ్ అయిందంటే? బాక్సాఫీస్ కోట బద్దలవ్వాల్సిందే. అంతటి క్రేజ్ ఉన్న ఏకైక నటుడు. నేటి తరం నటులతోనూ పోటీ పడుతూ బాక్సాఫీస్ లెక్కలు మార్చగల ఓ లెజెండరీ నటుడాయన. మరి అంతటి లెజెండ్ కోలీవుడ్ మార్కెట్ పై ఎందుకు దృష్టి పెట్టలేదు? అన్నది ఎంతో కాలంగా అభిమానుల్లో ఉన్న సందేహం. ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్ కి వచ్చింది. చిరంజీవి నటుడిగా సక్సెస్ అయింది కూడా మద్రాస్ లో ఉన్నప్పుడే.
మరి తమిళనాడు ప్రజలు ఆరాదించే స్టార్ గా మెగాస్టార్ ఎందుకు మారలేదు? అంటే విశ్వనటుడు కమల్ హాసన్ దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. చిరంజీవి గట్టిగా బలంగా సంకల్పించకపోవడం వల్లే తమిళనా డులో సక్సెస్ కాలేకపోయారన్నారు. తమిళ మార్కెట్ పై ఆయన ఏనాడు ఆసక్తి చూపించలేదని.. స్ట్రెయిట్ సినిమాల సంగతి పక్కనబెట్టినా డబ్బింగ్ రూపంలో కూడా తన సినిమాలు తమిళనాడులో రిలీజ్ అయ్యేలా ఆయన ఆసక్తి చూపించలేకపోయారన్నారు.
ఆ ఒక్క పని కూడా చిరంజీవి చేసి ఉంటే తమిళ్ లో కూడా గొప్ప స్టార్ అయ్యేవారని..అంతకు మించి ప్రత్యేక కారణాలంటూ లేవని కమల్ హాసన్ ఓ పాత ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. మరి మెగాస్టార్ అలా ఎందుకు చేసారు? అన్నది ఆయన్నే అడిగి తెలుసుకోవాలి. ఆయనే కాదు...ఆయన తర్వాత వచ్చిన హీరోలు కూడా తమిళ మార్కెట్ పై ఆసక్తి చూపించలేదు. ఆ తర్వాతి జనరేషన్ కూడా కోలీవుడ్ మార్కెట్ ని లైట్ తీసుకున్నారు. ఇప్పటి తరం హీరోలు పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు. దాంతో పాటే తమిళ నాడులో తెలుగు సినిమా రిలీజ్ అవుతుంది తప్ప ఇప్పటికీ తమిళ్ మార్కెట్ పై ప్రత్యేకించి ఆసక్తిగా చూపించడం లేదు.