రాష్ట్రపతి చేతుల మీదుగా చిరుకు పద్మవిభూషణ్
మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక అవార్డు అందుకునే సమయంలో చరణ్- ఉపాసన దంపతులు ఈ సందర్భాన్ని ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవడం తాజాగా రిలీజైన వీడియోలో కనిపిస్తోంది.
By: Tupaki Desk | 9 May 2024 1:52 PM GMTరిపబ్లిక్ ఆఫ్ ఇండియా రెండవ అత్యున్నత పౌర పురస్కారం 'పద్మవిభూషణ్' అవార్డుల ప్రదాన వేడుక నేడు (మే 9, 2024) దిల్లీలో జరిగింది. ఈ వేడుకలో పద్మవిభూషణ్ గ్రహీత, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. ఆయన కుమారుడు రామ్ చరణ్, ఉపాసన పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక అవార్డు అందుకునే సమయంలో చరణ్- ఉపాసన దంపతులు ఈ సందర్భాన్ని ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవడం తాజాగా రిలీజైన వీడియోలో కనిపిస్తోంది. చిరంజీవితో పాటు విలక్షణ నటి వైజయంతిమాల కూడా ఈ అవార్డును అందుకోవడం విశేషం. ఈ ఏడాది జనవరిలో అవార్డు గ్రహీతల పేర్లను ప్రకటించారు. నేడు పురస్కారాలను అందుకున్నారు.
ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఈ వేడుక కోసం ఎంతో హుందాగా ముస్తాబై వచ్చారు. సూట్‌లో ఆయన జెంటిల్మన్ ని తలపించారు. భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీజీ, అమిత్ షా సహా ఎందరో దిగ్గజాలు కొలువు దీరి ఉండగా వారందరికీ గౌరవపూర్వకంగా నమస్కరించిన మెగాస్టార్ వేదిక వద్దకు ఎంతో హుందాగా నడుచుకుంటూ వెళ్లారు. అక్కడ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. అనంతరం తాను అశీనుడైన సీట్ వద్దకు వెళుతున్న దృశ్యాలు ఇప్పుడు అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి.
ఈ వేడుక కోసం మెగా కుటుంబం ఇంతకుముందే రాజధాని నగరానికి విచ్చేసింది. చిరంజీవి, రామ్ చరణ్ ఇంతకుముందే ఢిల్లీ విమానాశ్రయం నుండి నిష్క్రమించిన వీడియో, ఫోటోలను X (గతంలో ట్విట్టర్ అని పిలుస్తారు) లోని అనేక అభిమానుల పేజీలు షేర్ చేయగా వైరల్ అయ్యాయి. అలాగే చిరంజీవి ఢిల్లీకి వచ్చేందుకు మెగాస్టార్, ఆయన కుటుంబీకులు తన ప్రైవేట్ జెట్ ఎక్కిన వీడియోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఆ వీడియోలో చిరంజీవి బ్లాక్ టీ షర్ట్, బ్లూ డెనిమ్ ధరించగా, రామ్ చరణ్ బ్లూ డెనిమ్ షర్ట్, బ్లాక్ ప్యాంట్ ధరించాడు.
చిరంజీవి-సురేఖ దంపతులు, రామ్ చరణ్- ఉపాసన దంపతులు ఈ ప్రతిష్టాత్మక అవార్డు వేడుకకు హాజరయ్యారు. గత నాలుగు దశాబ్దాల్లో భారతీయ సినీయవనికపై .. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమపై చిరంజీవి ప్రభావం అసాధారణమైనది. 150 చిత్రాలకు పైగా సినిమాల్లో నటించిన మేటి నటుడు ఆయన. సుప్రీంహీరోగా, మెగాస్టార్ గా ఆయన అభిమానుల గుండెల్లో కొలువై ఉన్నారు. వృత్తి లో అచంచలమైన అంకితభావం, అభిరుచి, గొప్ప నిబద్ధత చిరంజీవిని సౌత్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ ని చేసాయి. నటనలో శిఖరం ఎత్తుకు ఎదిగిన చిరంజీవి తెలుగు సినీపరిశ్రమలో పెద్దన్న పాత్రను పోషిస్తున్నారు.
నిజమైన సేవకుడు:
ఆపదలో నేను సైతం అంటూ ఆదుకునే గొప్ప సామాజ సేవికుడిగాను చిరంజీవికి గుర్తింపు ఉంది. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ సేవలతో పాటు, ఎందరికో తెలియని గుప్త దానాలను చిరంజీవి చేసారు. అలాగే కరోనా క్రైసిస్ సమయంలో 60 కోట్లు పైగా సొంత డబ్బును ఖర్చు చేసి ఆక్సిజన్ సిలిండర్లు సహా ఎందరికో ప్రాణదానం కోసం అవసరమైన బెడ్లు ఏర్పాటు చేసారు. ఎందరికో ఆర్థిక సహాయం అందించారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. ప్రస్తుతం ఫాంటసీ డ్రామా 'విశ్వంభర' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి మల్లిడి వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష కథానాయిక. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారని టాక్.