రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా తీర్చిదిద్దండి.. CBN కి చిరు విషెస్
ఐదేళ్ల వైకాపా పాలనను ప్రజలు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయం పాలైంది
By: Tupaki Desk | 4 Jun 2024 3:41 PM GMTఐదేళ్ల వైకాపా పాలనను ప్రజలు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయం పాలైంది. తెలుగు దేశం- జనసేన- భాజపా కూటమి అధికారం ఛేజిక్కించుకుంది. ముఖ్యమంత్రి కాబోతున్న చంద్రబాబు నాయుడుకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సినీపరిశ్రమ ప్రముఖులు బాబును ఆకాశానికెత్తేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. టాలీవుడ్ పెద్ద అయిన మెగాస్టార్ చిరంజీవి చంద్రబాబు పాలనా దక్షతపై తన విశ్వాసాన్ని నమ్మకాన్ని దాచుకోలేదు. బాబుకు శుభాకాంక్షలు చెబుతూనే రాష్ట్రాన్ని నంబర్ 1గా నిలబెట్టాలనే తన ఆకాంక్షను వ్యక్తం చేసారు.
సోషల్ మీడియాలో చిరు ప్రశంసాపూర్వక నోట్ లో ఇలా రాసి ఉంది. ``ప్రియమైన చంద్రబాబు నాయుడు గారికి , చరిత్రలో అరుదైన విజయాన్ని అందుకున్న మీకు ముందుగా శుభాకాంక్షలు, అభినందనలు. ఈ మహత్తర విజయం, మీ మీద ప్రజలకు వున్న నమ్మకానికి, మీ నాయకత్వ పటిమకు, రాష్ట్రానికి గత వైభవం తిరిగి తేగలిగిన మీ దక్షతకు నిదర్శనం. రాజకీయ దురంధరులైన మీ మీద, పవన్ కల్యాణ్, నరేంద్ర మోడీ గారి మీద ప్రజలు కనపరచిన విశ్వాసాన్ని సంపూర్ణంగా నిలబెట్టుకొని, రాజధాని లేని, గాయపడిన రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టి నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నాను`` అని రాసారు.
పవన్ .. నా హృదయం ఉప్పొంగుతోంది:
తమ్ముడు పవన్ కల్యాణ్ విక్టరీపైనా చిరంజీవి ట్వీట్ చేసారు. ``డియర్ కళ్యాణ్ బాబు..ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా వుంది. నువ్వు గేమ్ ఛేంజర్‌వి మాత్రమే కాదు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది !! నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే!..అంటూ అభినందించారు.