చిరు సినిమా ఫుల్ క్లారిటీ వచ్చేసింది
సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియోతో కలిసి అనిల్.. సింహాద్రి అప్పన్నను దర్శించుకుని అక్కడే చిరు సినిమా స్క్రిప్టుకు పూజలు చేయించాడు.
By: Tupaki Desk | 17 March 2025 5:29 PM ISTమెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం ‘విశ్వంభర’ షూటింగ్ ఎప్పుడో పూర్తయినప్పటికీ.. ఆ సినిమా విడుదల వ్యవహారం అంతుబట్టకుండా ఉంది. ఈ ఏడాది సంక్రాంతికే రావాల్సిన ఆ చిత్రాన్ని వేసవికి వాయిదా వేశారు. చివరికి వేసవిలో కూడా ఈ చిత్రం విడుదల కాదని తేలిపోయింది. ఐతే ఇంకా మొదలు కాని చిరు తర్వాతి చిత్రంలో మాత్రం దర్శకుడు అనిల్ రావిపూడి ఫుల్ క్లారిటీతో ఉన్నట్లున్నాడు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ రిలీజ్ తర్వాత కొన్ని వారాలకు ఈ సినిమా స్క్రిప్టు పనులు మొదలుపెట్టిన అనిల్.. ఆల్రెడీ కథను ఒక కొలిక్కి తీసుకొచ్చేశాడు. తన ప్రతి సినిమా స్క్రిప్టుకూ విశాఖపట్నంలో పూజ చేయించడం అలవాటైన అనిల్.. చిరు సినిమాకు కూడా ఆనవాయితీని కొనసాగించాడు. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియోతో కలిసి అనిల్.. సింహాద్రి అప్పన్నను దర్శించుకుని అక్కడే చిరు సినిమా స్క్రిప్టుకు పూజలు చేయించాడు.
ఈ సందర్భంగా చిరు సినిమా ఎప్పుడు మొదలవుతుంది.. ఎప్పుడు పూర్తవుతుంది.. ఎప్పుడు రిలీజవుతుంది అన్నది ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు అనిల్. జూన్ మొదటి వారంలో ఈ సినిమా చిత్రీకరణ మొదలుపెట్టనున్నట్లు చెప్పిన అనిల్.. ఏడాది చివరికల్లా చిత్రీకరణ పూర్తవుతుందని.. ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’తో సంక్రాంతికి ప్రేక్షకులను కలిసిన తాను.. మళ్లీ అదే పండక్కి చిరు చిత్రాన్ని రిలీజ్ చేస్తానని తెలిపాడు. చిరంజీవితో తాను చేయబోయేది కూడా కుటుంబ కథా చిత్రమే అని అనిల్ తెలిపాడు. వినోదానికి కొదవ లేకుండానే.. చిరంజీవిలోని ఎక్స్‌ట్రా టాలెంట్స్‌ను బయటికి తీసే సినిమా ఇదవుతుందని అనిల్ తెలిపాడు. ‘సంక్రాంతికి వస్తున్నాం’లో రమణ గోగుల పాట సూపర్ హిట్ అయిన నేపథ్యంలో చిరు సినిమాలో కూడా ఆయనతో పాట పాడించబోతున్నాడు అనిల్. ఈ చిత్రానికి కూడా భీమ్సే సంగీతం అందించనున్నాడు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ అధినేత సాహు గారపాటితో కలిసి చిరంజీవి తనయురాలు సుష్మిత నిర్మించనుంది.