గేమ్ ఛేంజర్ కోసం మెగాస్టార్ రాలేదా?
కానీ చిరు మాత్రం బన్నీని కలవడానికి రాలేదు. మెగాస్టార్ మాత్రమే కాదు అదే కుటుంబానికి చెందిన పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, నాగబాబు, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఎవరూ కూడా అల్లు అర్జున్ కోసం రాలేదు.
By: Tupaki Desk | 14 Dec 2024 2:30 PM GMTసంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్టయిన స్టార్ హీరో అల్లు అర్జున్ బెయిల్‌పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం అరెస్టైన బన్నీ, బెయిల్ మంజూరవ్వడంతో శనివారం ఉదయాన్నే చంచల్ గూడ జైలు నుంచి రిలీజై ఇంటికి వచ్చారు. దీంతో ఆయన్ను పరామర్శించేందుకు జూబ్లీహిల్స్ లోని ఇంటికి సినీ సెలబ్రిటీలు అందరూ క్యూ కట్టారు. హీరోలు, దర్శక నిర్మాతలు నేరుగా బన్నీని కలిసి సంఘీభావం తెలిపారు. కానీ మెగా ఫ్యామిలీ హీరోలు ఎవరూ అల్లు అర్జున్ ని కలవకపోవడం చర్చనీయాంశంగా మారింది.
చిరంజీవి సతీమణి, అల్లు అర్జున్ మేనత్త సురేఖ ఇంటికి వచ్చి పరామర్శించారు. మేనల్లుడిని హత్తుకొని భావోద్వేగానికి లోనయ్యారు. కానీ చిరు మాత్రం బన్నీని కలవడానికి రాలేదు. మెగాస్టార్ మాత్రమే కాదు అదే కుటుంబానికి చెందిన పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, నాగబాబు, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఎవరూ కూడా అల్లు అర్జున్ కోసం రాలేదు. కనీసం సోషల్ మీడియాలో కూడా స్పందించలేదు. బన్నీ అరెస్ట్ అయినప్పుడు కానీ, బెయిల్ పై విడుదలైనప్పుడు కానీ రియాక్ట్ అవ్వకపోవడం హాట్ టాపిక్ అయింది. మెగా హీరోలంతా కావాలనే అల్లు అర్జున్ ఉదంతంపై మౌనంగా ఉన్నారా? కష్టకాలంలో ఎందుకు సపోర్ట్ గా నిలువలేదు? అని నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
'మావయ్యది మొగల్తూరు.. మా నాన్నది పాలకొల్లు' అంటూ అల్లు అర్జున్ తన ఫ్యామిలీ పేరు చెప్పుకొని హీరోగా పరిచయమైనప్పటికీ.. అనతికాలంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఐకాన్ స్టార్ గా పిలవబడుతున్నాడంటే, దాని వెనుక ఆయన నిరంతర కృషి, పట్టుదల, సాధన, అంకితభావం ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. 'పుష్ప 1' సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన బన్నీ.. బెస్ట్ యాక్టర్ గా నేషనల్ ఫిలిం అవార్డ్ సాధించారు. వందేళ్ల తెలుగు సినీ చరిత్రలో ఈ ఘనత అందుకున్న మొట్టమొదటి హీరోగా అల్లు అర్జున్ నిలిచారు. లేటెస్టుగా 'పుష్ప 2' మూవీతో బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టిస్తున్నారు.
ఇటీవలే రిలీజైన 'పుష్ప 2: ది రూల్' సినిమా వరల్డ్ వైడ్ గా భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. కేవలం 6 రోజుల్లోనే రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి, ఈ ఫీట్ అందుకున్న ఫస్ట్ ఇండియన్ మూవీగా హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ ఏడాది హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచిన ఈ చిత్రం.. మరికొన్ని రికార్డులు తిరగరాయడానికి సిద్ధంగా ఉంది. ఇక నార్త్ మార్కెట్ లో ఈ సినిమా హవా మామూలుగా లేదు. హిందీలో 9 రోజుల్లోనే ₹460 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి, రూ.500 కోట్ల మైల్ స్టోన్ మార్క్ ను క్రాస్ చేసే దిశగా పయనిస్తోంది.
ఇప్పటి వరకూ రాజమౌళి రికార్డుల గురించే మాట్లాడుకున్న భారతీయ చిత్ర పరిశ్రమ.. ఇప్పుడు అల్లు అర్జున్ రికార్డుల గురించి మాట్లాడుకుంటోంది. యావత్ సినీ ఇండస్ట్రీ ఆయన పెర్ఫార్మన్స్ ని కొనియాడుతోంది. స్క్రీన్ మీద అబ్బురపరిచే విజువల్స్ లేకుండా, ఒక పక్కా మాస్ మసాలా కమర్షియల్ సినిమాతో ఈ రేంజ్ సక్సెస్ సాధించడం బన్నీ ఒక్కడికే సాధ్యమైందని చెప్పాలి. ఒక రకంగా అల్లు అర్జున్ ఇండియన్ సినిమాలో గేమ్ ఛేంజర్ అని అనొచ్చు. అందుకే ఆయన అరెస్టయితే భాషా, ప్రాంతీయత బేధం లేకుండా జాతీయ స్థాయిలో అందరూ సంఘీభావం తెలుపుతున్నారు. అలాంటి వ్యక్తికి సినీ ఇండస్ట్రీ అంతా బాసటగా నిలిచినా.. సొంత కుటుంబ సభ్యులు మద్దతుగా నిలవకపోవడం ఏంటని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య దూరం పెరిగిందని.. ఒకప్పటిలా సన్నిహితంగా ఉండటం లేదని చాలాకాలంగా రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ మధ్య వాటికి ఫుల్ స్టాప్ పెట్టే దిశగా అల్లు అర్జున్ ప్రయత్నాలు చేసారు. కళ్యాణ్ బాబాయ్ అంటూ సభాముఖంగా మాట్లాడారు. కానీ బన్నీ అరెస్టయితే మెగా కుటుంబం నుంచి ఎవరూ పరామర్శించలేదని అల్లు అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఎన్ని గొడవలు ఉన్నా, ఇబ్బందుల్లో కష్టకాలంలో ఉన్నప్పుడు ఫ్యామిలీ అంతా ఏకం అవుతుందని అంటారు. అలాంటిది అల్లు అర్జున్ జైలుకి వెళ్తే ఒకరు కూడా స్పందించకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. బంధువుగా కాకపోయినా, తోటి నటుడిగానైనా ఎందుకు రియాక్ట్ అవ్వలేదని ఫ్యాన్స్ వ్యాఖ్యానిస్తున్నారు.
నిజానికి అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని తెలిసిన వెంటనే చిరంజీవి 'విశ్వంభర' షూటింగ్ రద్దు చేసుకొని ఇంటికి వచ్చారు. కాసేపటికి నాగబాబు కూడా వచ్చారు. బన్నీ కోసం చిరు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్తారని వార్తలు వచ్చాయి కానీ, ఎందుకనో వెళ్ళలేదు. ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ సైతం బన్నీ అరెస్ట్ నేపథ్యంలో హైదరాబాద్ కు వచ్చి ఆయన్ను కలుస్తారని ప్రచారం జరిగింది. జైలు నుంచి విడుదలైన తర్వాత టాలీవుడ్ అంతా వచ్చి అల్లు అర్జున్ ని పరామర్శించారు. కారణాలు తెలియదు కానీ, ఇప్పటి వరకైతే మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ బన్నీ నివాసానికి రాలేదు. ఇప్పుడిదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నడుస్తోంది. మరి రేపో ఎల్లుండో అందరూ ఒకేసారి వచ్చి అల్లు అర్జున్ ని కలుస్తారేమో చూడాలి.