Begin typing your search above and press return to search.

ప్ర‌ధాని చొర‌వ‌తో మెగాస్టార్ చిరంజీవికి అరుదైన అవ‌కాశం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మెగాస్టార్ చిరంజీవిని ప్రతిష్ఠాత్మ‌క‌ WAVES అడ్వైజరీ బోర్డులోకి చేర్చుకున్నారు.

By:  Tupaki Desk   |   8 Feb 2025 12:54 PM GMT
ప్ర‌ధాని చొర‌వ‌తో మెగాస్టార్ చిరంజీవికి అరుదైన అవ‌కాశం
X

దేశ ప్ర‌ధాని నరేంద్ర మోదీతో మెగాస్టార్ చిరంజీవి స్నేహం, సాన్నిహిత్యం ఇటీవ‌ల ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. తెలుగు సినీప‌రిశ్ర‌మ దిగ్గ‌జ న‌టుడిగా ఖ్యాతి ఘ‌డించిన‌ చిరును ప‌లు కీల‌క కార్య‌క్ర‌మాల్లో భాగం చేస్తూ మోదీ త‌న స్నేహ హ‌స్తాన్ని అందించ‌డం, టాలీవుడ్ మెగాస్టార్ కి ప్రాధాన్య‌త‌నిస్తూ గౌర‌వించ‌డం స‌ర్వ‌త్రా ఆస‌క్తిని క‌లిగిస్తోంది. ఇప్పుడు చిరుకి మ‌రో అరుదైన గౌర‌వం ల‌భించింది. ఆయ‌న‌ కీర్తి కిరీటంలో మ‌రో అరుదైన ర‌త్నం చేరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మెగాస్టార్ చిరంజీవిని ప్రతిష్ఠాత్మ‌క‌ WAVES అడ్వైజరీ బోర్డులోకి చేర్చుకున్నారు.

ఈ ఏడాది చివర్లో భారతదేశం నిర్వహించనున్న ప్రపంచ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (వేవ్స్) కోసం సలహా బోర్డు సభ్యుడిగా మెగాస్టార్ చిరంజీవిని నియ‌మించ‌డంతో కేంద్రం నుంచి మరో ప్రతిష్టాత్మక గౌరవం లభించింది. ఆర్థిక రంగానికి దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక స‌మావేశంలానే, వేవ్స్‌ను వినోద పరిశ్రమకు భారతదేశపు ప్రధాన అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశంగా రూపొందిస్తున్నారు. వినోదం, సృజనాత్మకత, సంస్కృతిలో భారతదేశాన్ని ప్రపంచ శ‌క్తిగా అభివృద్ధి చేయడమే దీని లక్ష్యం. ఈ గౌర‌వానికి ప్ర‌తిగా మెగాస్టార్ చిరంజీవి ప్ర‌ధానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఇత‌ర గౌరవనీయ సభ్యులతో కలిసి త‌న అంత‌రంగ ఆలోచ‌న‌ను పంచుకునే అవ‌కాశం క‌ల్పించ‌డం అదృష్టం అని అన్నారు. వేవ్స్ భార‌త‌దేశ సాఫ్ట్ ప‌వ‌ర్ ను ప్ర‌పంచ స్థాయికి తీసుకెళుతుంద‌ని చిరు ఆకాంక్షించారు.

మెగాస్టార్ చిరంజీవి స‌హా ప‌లు రంగాల నుంచి ప్ర‌ముఖుల‌కు ప్ర‌ధాని ఈ అరుదైన‌ అవ‌కాశం క‌ల్పించారు. సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల, ముఖేష్ అంబానీ, ఆనంద్ మహీంద్రా వంటి పారిశ్రామిక దిగ్గ‌జాల‌తో పాటు, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, మోహన్‌లాల్, రజనీకాంత్, ఆమిర్ ఖాన్, ఎఆర్ రెహమాన్, అక్షయ్ కుమార్, రణ్‌బీర్ కపూర్ , దీపికా పదుకొనే వంటి ప్రముఖ సినీ ప్రముఖులతో కూడిన వేవ్స్ అడ్వైజరీ బోర్డు సభ్యులతో మోడీ వర్చువల్ ఇంటరాక్షన్ నిర్వహించారు. భారతదేశాన్ని ప్రపంచ వినోద కేంద్రంగా మార్చడానికి మ‌న‌ ప్రయత్నాలను ఎలా మరింత పెంచుకోవాలో విలువైన సూచనలను ప్ర‌ధానితో ఈ వ‌ర్చువ‌ల్ స‌మావేశంలో స‌భ్యులంతా షేర్ చేసుకున్నారు. వినోదం, సృజనాత్మకత , సంస్కృతి సంబంధితంగా ప్రపంచాన్ని ఒకచోట చేర్చే ప్రపంచ శిఖరాగ్ర సమావేశం అయిన WAVES సలహా మండలి సమావేశం ముగిసిందని ప్ర‌ధాని వెల్ల‌డించారు. ఈ చొరవ ప్రపంచ పటంలో భారతీయ వినోద రంగానికి కొత్త అవకాశాలను సృష్టిస్తుందని అంద‌రూ అంచ‌నా వేస్తున్నారు.