చిరంజీవి సినిమాలు.. సెట్స్ మీదకు వెళ్లే వరకూ డౌటేనా?
మెగాస్టార్ ఇలా బ్యాక్ టూ బ్యాక్ అనౌన్స్ మెంట్స్ తో వస్తుండటంతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కాకపోతే ఈ ప్రాజెక్ట్స్ సెట్స్ మీదకు వెళ్లే వరకూ చెప్పలేమని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.
By: Tupaki Desk | 21 Dec 2024 3:30 AM GMT'విశ్వంభర' సినిమా ఓ కొలిక్కి రావడంతో సీనియర్ హీరో చిరంజీవి మరికొన్ని ప్రాజెక్ట్స్ ను అనౌన్స్ చేయడానికి రెడీ అయ్యారు. ఇటీవలే హీరో నాని సమర్పణలో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ చిత్రాన్ని ప్రకటించారు. ఇదే క్రమంలో డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ సినిమా కమిట్ అయినట్లు తెలుస్తోంది. కొత్త ఏడాది ప్రారంభంలో ఈ మూవీ ప్రకటన రావొచ్చని అంటున్నారు. మెగాస్టార్ ఇలా బ్యాక్ టూ బ్యాక్ అనౌన్స్ మెంట్స్ తో వస్తుండటంతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కాకపోతే ఈ ప్రాజెక్ట్స్ సెట్స్ మీదకు వెళ్లే వరకూ చెప్పలేమని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. దీనికి కొన్ని ఉదాహరణలు కూడా చూపిస్తున్నారు.
కోవిడ్ పాండమిక్ తర్వాత చిరంజీవి 'ఆచార్య', 'గాడ్ ఫాదర్' 'భోళా శంకర్' 'వాల్తేరు వీరయ్య' వంటి నాలుగు సినిమాలను సెట్స్ మీదకు తీసుకొచ్చారు. అదే సమయంలో డివివి బ్యానర్ లో వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నట్లు ప్రకటించారు. తన అభిమాన హీరోతో సినిమా పట్ల వెంకీ ఎంతో ఎగ్జైట్ అయ్యారు. కానీ 'ఆచార్య' సినిమా డిజాస్టర్ గా మారిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ను పూర్తిగా పక్కన పెట్టేశారు. దీంతో వెంకీ, హీరో నితిన్ సినిమాని మొదలుపెట్టారు. దీనికి చిరు చీఫ్ గెస్టుగా హాజరై క్లాప్ కొట్టారు.
అలానే యూవీ క్రియేషన్స్ లో మారుతి డైరెక్షన్ లో ఓ మూవీ చేయనున్నట్లు చిరంజీవి సభా ముఖంగా ప్రకటించారు. కథ కూడా ఓకే అయినట్లు మారుతి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ ఇంతవరకూ ఈ కాంబో పట్టాలెక్కలేదు. 'రాజాసాబ్' పూర్తయ్యాక టైమ్ సెట్ అయ్యేదాన్ని బట్టి బాస్ తో సినిమా ఉంటుందని దర్శకుడు చెబుతూ వస్తున్నారు. ఇక యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో 'బింబిసార' ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో సినిమాని ప్రకటించారు. దీంతో పాటుగా తన పెద్ద కుమార్తె సుష్మిత కొణిదెల నిర్మాణంలో మూవీ చేయడానికి సిద్ధమయ్యారు.
గోల్డ్ బాక్స్ ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ లో #Mega156 అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ మెంట్ పోస్టర్ కూడా వదిలారు. డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఈ సినిమా చేస్తారని చాలా రోజులు వార్తలు నడిచాయి. ఆ తర్వాత పవన్ సాధినేనికి ఛాన్స్ ఇస్తారనే ప్రచారం కూడా జరిగింది. కానీ 'భోళా శంకర్' డిజాస్టర్ అవ్వడంతో చిరంజీవి సినిమాల ప్రాధాన్యతా క్రమం మారిపోయింది. #Mega156 గా 'విశ్వంభర' చిత్రాన్ని పట్టలెక్కించారు. ఇప్పటివరకూ మెగా డాటర్ ప్రొడక్షన్ లో సినిమా చేయలేదు.
అయితే గోల్డ్ బాక్స్ బ్యానర్ లో బీవీఎస్ రవి కథతో మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేస్తారని వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని రచయిత రవి తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి సాక్షిగా ధృవీకరించారు. 'విశ్వంభర' పూర్తయిన తర్వాత సినిమా చేస్తామని ప్రకటించారు. మెగాస్టార్ డ్యాన్సులు, ఫైట్స్ అన్నీ ప్రేక్షకులు చూసేశారని.. 'ఠాగూర్' 'ఇంద్ర' మాదిరిగా సోషల్ టాపిక్ మీద సినిమా చేస్తున్నామని చెప్పారు. కానీ ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేయకుండా, ఎందుకనో ఉన్నట్టుండి శ్రీకాంత్ ఓదెల మూవీకి అధికారిక ప్రకటన ఇచ్చారు.
అంతకముందు వీవీ వినాయక్ కు చిరంజీవి మరో ఛాన్స్ ఇస్తారని, హరీశ్ శంకర్ తో సినిమా ఉంటుందని, పూరీ జగన్నాథ్ కు కూడా అవకాశం ఇస్తాడని.. ఇలా వార్తలు వచ్చాయి. తమిళ దర్శకుడు మిత్రన్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కొన్నాళ్లు చెప్పుకున్నారు. ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో చిరు సినిమా చేస్తారని గట్టిగా ప్రచారం జరిగింది. అయితే మెగాస్టార్ ఈ సీనియర్ దర్శకులందరినీ పక్కనపెట్టి, నేటితరం దర్శకులతో పని చేయడానికి మొగ్గు చూపారు.
ఇదిలా ఉంటే, శ్రీకాంత్ తర్వాత అనిల్ రావిపూడితో చేస్తారని అనుకుంటుండగా.. ఇప్పుడు కొత్తగా డైరెక్టర్ బాబీతో చిరంజీవి మరో ప్రాజెక్ట్ కమిట్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైతే ఒక్క సినిమానే అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. దీని తర్వాత మెగాస్టార్ నుంచి ఏయే సినిమాలకు ప్రకటనలు వస్తాయి? బోయపాటి సినిమా ఎప్పుడు వుంటుంది? అనేది ఆసక్తికరంగా మారింది. అంతేకాదు 'విశ్వంభర' విడుదలయ్యాక చిరు ప్రాధాన్యతలు మారినా మారొచ్చని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అందుకే మెగా ప్రాజెక్ట్స్ పట్టలెక్కే వరకూ డౌటేనని అంటున్నారు.