అనిల్ 'చిరు' ప్లాన్.. ఎంత వేగంగా అంటే!
ఇక చిరు నెక్స్ట్ సంక్రాంతిని టార్గెట్ చేస్తూ మాస్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రావాలని చూస్తున్నారు.
By: Tupaki Desk | 6 March 2025 9:41 PM ISTమెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్‌కు పూర్తి స్థాయిలో రెడీ అవుతున్నారు. విశ్వంభర షూటింగ్ ఇప్పటికే ఫినిష్ అయినప్పటికీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యం అవుతోంది. ఇక సినిమా మే 9న రావచ్చని ఇదివరకే క్లారిటీ ఇచ్చినా గ్రాఫిక్స్ పనులు ఇంకా పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సినిమా అనుకున్న సమయానికి వస్తుందో లేదో తెలియదు. ఇక చిరు నెక్స్ట్ సంక్రాంతిని టార్గెట్ చేస్తూ మాస్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రావాలని చూస్తున్నారు.
హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి చిరు ఒక సినిమా చేయబోతున్నారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా అనిల్ రావిపూడి స్వయంగా ఈ ప్రాజెక్ట్‌ను కన్ఫర్మ్ చేశారు. అంతేకాదు, ఈ సినిమా కోసం మెగాస్టార్ ఏకంగా మూడు నెలల సమయాన్ని కేటాయించబోతున్నారని సమాచారం. షైన్ స్క్రీన్స్ ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మించనుంది.
ఇక సినిమా షూటింగ్ మే లో మొదలుకానున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా చిరంజీవి ఒక సినిమాకు మినిమమ్ ఏడాది టైమ్ తీసుకుంటారు. కానీ ఈ సినిమా మాత్రం అతి తక్కువ రోజుల్లో పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అనిల్ రావిపూడి ఇప్పటివరకు తన డైరెక్షన్‌లో వచ్చిన అన్ని సినిమాలను తక్కువ పనిదినాల్లోనే కంప్లీట్ చేశారు. అదే టెక్నిక్‌ను ఈ సినిమా కోసం కూడా ఫాలో అవుతారట. ప్లాన్ ప్రకారం షూటింగ్ అక్టోబర్ నాటికి పూర్తయిపోతుందని టాక్.
ఈ సినిమాను సంక్రాంతి 2026 టార్గెట్‌గా ప్లాన్ చేస్తున్నారు. సాధారణంగా సంక్రాంతికి చిరంజీవి సినిమాలు విడుదలైతే హిట్టు బొమ్మ అని ఫిక్స్ అవ్వాల్సిందే. గతంలో ఖైదీ నెం.150, వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలు ఈ ఫెస్టివల్ సీజన్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఇక అనిల్ రావిపూడి సినిమాల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన చేసిన ప్రతి సినిమా సంక్రాంతికి విడుదలైతే పక్కా హిట్ అని అనిపించేలా ఉంటాయి. సరిలేరు నీకెవ్వరు, ఎఫ్3, సంక్రాంతికి వస్తున్నాం.. సినిమాలు అదే కోవలో వచ్చాయి.
ఇప్పటివరకు వచ్చిన సమాచారం మేరకు, ఈ సినిమా పూర్తిగా అనిల్ రావిపూడి మార్క్ మాస్ ఎంటర్‌టైనర్ అవుతుందని తెలుస్తోంది. చిరంజీవి గత కొంతకాలంగా క్లాస్ అండ్ యాక్షన్ మిక్స్ చేసిన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కానీ ఈ సినిమా మాత్రం పూర్తి స్థాయి మాస్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉండే అవకాశం ఉందని టాక్. అంతేకాదు, చిరు తన యాస, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్‌లో కూడా మార్పులు చేసుకుంటారని తెలుస్తోంది. అనిల్ రావిపూడికి కామెడీ, మాస్ ఎలిమెంట్స్ కలిపి కథ చెప్పడంలో మంచి అనుభవం ఉంది. ఇక మెగాస్టార్‌తో కలిసి ఆయన ఎలా డిజైన్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.