Begin typing your search above and press return to search.

నాగార్జున.. మెగాస్టార్ సర్ ప్రైజ్ పోస్ట్

మెగా కుటుంబం మరియు అక్కినేని కుటుంబంలోని మిగతా హీరోలు కూడా అంతే అన్యోన్యంగా ఉంటారు.

By:  Tupaki Desk   |   29 Aug 2024 11:01 AM GMT
నాగార్జున.. మెగాస్టార్ సర్ ప్రైజ్ పోస్ట్
X

మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జునల మధ్య ఉన్న స్నేహబంధం టాలీవుడ్‌లో ప్రత్యేకమైనది. వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం కేవలం సినీ రంగానికే పరిమితం కాకుండా, వ్యక్తిగత జీవితంలో కూడా మంచి సాన్నిహిత్యం కొనసాగుతోంది. మెగా కుటుంబం మరియు అక్కినేని కుటుంబంలోని మిగతా హీరోలు కూడా అంతే అన్యోన్యంగా ఉంటారు.

బాక్సాఫీస్ వద్ద ఎలాంటి పోటీ లేకుండా, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ వచ్చిన ఈ ఇద్దరు ప్రముఖులు, తెలుగు సినీ పరిశ్రమలో ఎలాంటి సమస్యలు ఎదురైనా కలిసి కట్టుగా ఉంటారు. ఇక నాగార్జున పుట్టినరోజు సందర్భంగా, చిరంజీవి సోదర భావంతో శుభాకాంక్షలు తెలియజేసారు.

"పుట్టినరోజు శుభాకాంక్షలు నాగార్జున. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి. అలాగే ఇండస్ట్రీలో మరింత బలమైన వ్యక్తిగా కొనసాగాలని కోరుకుంటున్నాను" అంటూ చిరంజీవి తన ప్రేమను వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ ట్విట్టర్‌లో వైరల్ అవ్వడం ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశమైంది.

చిరంజీవి మరియు నాగార్జున కలిసి గతంలో కొన్ని సినిమాల్లో నటించారని కొందరికి తెలిసినా, చాలామందికి తెలియని విషయాలు కూడా ఉన్నాయి. 1987లో విడుదలైన 'త్రిమూర్తులు' సినిమాలో ఈ ఇద్దరూ గెస్ట్ రోల్ లో నటించారు. వెంకటేష్, అర్జున్, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో చిరంజీవి, నాగార్జున ప్రత్యేక పాత్రల్లో కనిపించడం ఇప్పుడు మరలా గుర్తుకు వచ్చింది.

ఈ విషయం తెలిసిన అభిమానులు వీరిద్దరూ మరలా ఒకే సినిమాలో కలిసి నటిస్తే ఎంత బాగుంటుందని కోరుకుంటున్నారు. ఇదే సందర్భంలో చిరంజీవి మరియు నాగార్జున మధ్య ఉన్న స్నేహం కేవలం ప్రొఫెషనల్‌ గానే కాకుండా, వ్యక్తిగత జీవితంలో కూడా అంతే స్వచ్ఛంగా ఉంది. ఇది తెలుగు సినీ అభిమానులను మరింత ఆకట్టుకుంటోంది. చిరు, నాగ్ వంటి ఇద్దరు పెద్ద స్టార్లు ఒకే సినిమాలో కనిపిస్తే, ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీకి కూడా అది పెద్ద ఫీస్ట్ అని అభిప్రాయపడుతున్నారు.

ఇక వీరి ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నాడు. వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా 2025 సంక్రాంతికి విడుదల కానుంది. ఇక నాగార్జున శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న కుబేర సినిమాలో ఒక స్పెషల్ పాత్రలో నటిస్తున్నారు. అందులో ధనుష్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.