కేరళ వాయనాడుకు చిరంజీవి- చరణ్ విపత్తు సాయం కోటి!
చిరంజీవి - రామ్ చరణ్‌ల మానవతా సహాయం వారి సేవాగుణాన్ని ప్రతిబింబిస్తోంది.
By: Tupaki Desk | 4 Aug 2024 11:06 AM GMTకేరళలోని వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 350 మంది మృత్యువాతపడిన సంఘటన దేశవ్యాప్తంగా ప్రజలను కలచివేసిన సంగతి తెలిసిందే. ఘోర ప్రకృతి విపత్తు నుంచి ప్రజలను కాపాడలేకపోయారు. కనీసం సహాయక చర్యల కోసం అయినా ప్రజలు ముందుకు రావాల్సి ఉంది. ఇలాంటి సమయంలో టాలీవుడ్ స్టార్స్ మెగాస్టార్ చిరంజీవి- గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాధితులకు తమ సహాయాన్ని ప్రకటించారు. విపత్తులో నష్టపోయిన కుటుంబాలకు చేరేలా కోటి రూపాయల ఆర్థిక విరాళాన్ని ప్రకటించారు.
ఇటీవలి ప్రకృతి వైపరీత్యం కారణంగా కేరళలో లెక్కలేనంత మంది ప్రాణాలు కోల్పోవడం తమను తీవ్ర వేదనకు గురిచేస్తోందని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేసారు. దీనికి స్పందించిన చరణ్ ఈ కష్టాన్ని సహిస్తున్న వారందరికీ హృదయపూర్వక ప్రార్థనలతో, బాధితుల సహాయం కోసం కేరళ సిఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.1కోటి అందిస్తున్నాం.. అని ప్రకటించారు.
చిరంజీవి - రామ్ చరణ్‌ల మానవతా సహాయం వారి సేవాగుణాన్ని ప్రతిబింబిస్తోంది. వాయనాడ్ కొండచరియల బాధితులను ఆదుకోవడంలో ఇతర టాలీవుడ్ స్టార్‌లకు ఇది స్ఫూర్తినిస్తుంది. ఇంతకుముందే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా 25 లక్షల ఆర్థిక సాయాన్ని వాయనాడ్ బాధితుల సాయం కోసం ప్రకటించిన సంగతి తెలిసిందే. కేవలం మెగా కుటుంబం నుంచి ఇప్పటికే 1.25 కోట్ల రూపాయలు వాయనాడు విపత్తు బాధితుల సాయం కోసం వెళుతోంది. అటు మలయాళంలోను స్టార్లు ఎవరికి తోచిన విధంగా వారు సహాయానికి ముందుకు వస్తున్నారు. ఇంతకుముందు ముందే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ వాయనాడ్ విపత్తు నుంచి గ్రామాలను పునరుద్ధరించేందుకు విశ్వ శాంతి ఫౌండేషన్ తరపున 3 కోట్లు ఆర్థిక సాయం ప్రకటించారు. ఆయన ఫౌండేషన్ లో ఒకానొక సభ్యుడిగా ఉన్నారు.
ఇదే మొదటి సారి కాదు:
కేరళ విపత్తుట వేళ మెగా కుటుంబం స్పందించడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా చిరంజీవి-చరణ్- అల్లు అర్జున్ వంటి స్టార్లు కోట్లాది రూపాయల ఆర్థిక విరాళాల్ని ప్రకటించారు. అటు మాలీవుడ్ స్టార్లు స్పందించక ముందే మనవాళ్లు చాలా పెద్ద మొత్తంలో విరాళాలు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కష్ట కాలంలో తామున్నామని ప్రతిసారీ వారు నిరూపిస్తున్నారు. కరోనా క్రైసిస్ సమయంలో తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం ఆక్సిజన్ సిలెండర్లు, ఇతర సామాగ్రిని విదేశాల నుంచి రప్పించేందుకు చిరు-చరణ్ దాదాపు 60కోట్లు ఖర్చు చేసారు. కానీ దీనికి సరైన ప్రచారం దక్కలేదు. ప్రకృతి విపత్తుల వేళ ప్రజల కోసం మేమున్నాం అంటూ మెగా హీరోలు ప్రతిసారీ ముందుకొస్తున్నారు.