Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్- ఏఎన్నార్- చిరంజీవికి జాతీయ అవార్డ్ రాలేదేమి?

ఎన్టీఆర్ -ఏఎన్నార్- కృష్ణ‌- శోభ‌న్ బాబు- చిరంజీవి ఇలా దిగ్గ‌జాలంటి స్టార్లు మ‌న‌కు ఉన్నారు. ద‌శాబ్ధాల పాటు కెరీర్ ని కొనసాగించి స్టార్లుగా హృద‌యాల‌ను ఏలారు.

By:  Tupaki Desk   |   26 Aug 2023 2:45 AM GMT
ఎన్టీఆర్- ఏఎన్నార్- చిరంజీవికి జాతీయ అవార్డ్ రాలేదేమి?
X

ఏదైనా సినిమాకి ఉత్త‌మ సినిమా అనో లేదా ఉత్త‌మ సంగీతం.. నృత్యం .. ఫైట్స్ లేదా ఇంకేవైనా విభాగాల్లో జాతీయ అవార్డులు ద‌క్కాయంటే ఆ సినిమాలో న‌టించిన స్టార్ కి అవ‌మానం ఎదురైన‌ట్టేనా? ఇలా అవ‌మానించాల‌నే ఉద్ధేశం ఉన్నా లేకున్నా కానీ మ‌న లెజెండ‌రీ స్టార్ల‌కు మాత్రం అస‌లు జాతీయ అవార్డు అన్న ఊసే లేదు. ఒక ప్రాంతీయ స్టార్ కి జాతీయ అవార్డు ఇవ్వాల‌న్న ఆలోచ‌న కూడా ఉత్త‌రాది డామినేటెడ్ జూరీకి లేదు. వందేళ్లు పైబ‌డిన‌ భార‌తీయ సినిమా ప్ర‌స్థానంలో 92 సంవ‌త్స‌రాల చ‌రిత్ర టాలీవుడ్ కి ఉంది. ఇందులో లెజెండ‌రీ హీరోలకు కొద‌వేమీ లేదు. ఎన్టీఆర్ -ఏఎన్నార్- కృష్ణ‌- శోభ‌న్ బాబు- చిరంజీవి ఇలా దిగ్గ‌జాలంటి స్టార్లు మ‌న‌కు ఉన్నారు. ద‌శాబ్ధాల పాటు కెరీర్ ని కొనసాగించి స్టార్లుగా హృద‌యాల‌ను ఏలారు.

కానీ వీళ్ల‌లో ఎవ‌రికీ జాతీయ ఉత్త‌మ న‌టుడు అవార్డు ద‌క్క‌లేదు. క‌నీసం దిల్లీలో తెలుగు సినిమాకి క‌నీసం గౌర‌వం అయినా ద‌క్క‌లేదు. జాతీయ (భార‌తీయ‌) సినిమా అంటే హిందీ సినిమా మాత్ర‌మే. తెలుగు సినిమా కానీ త‌మిళ సినిమా కానీ మ‌ల‌యాళం క‌న్న‌డ సినిమా కానీ ఎప్ప‌టికీ కాదు.. అన్న అవ‌మానం ఎదురైంద‌ని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.

చిరంజీవి 1988లో తన రుద్రవీణ చిత్రానికి జాతీయ అవార్డు అందుకున్నప్పుడు ఢిల్లీకి జరిగిన అవమానకరమైన సంగ‌తుల్ని గుర్తుచేసుకున్నారు. నిర్వాహకులు కేవలం హిందీ సినిమానే భారతీయ సినిమాగా ప్రొజెక్ట్ చేశారని, సౌత్ సినిమాలకు, స్టార్లకు సమానమైన గుర్తింపు ఇవ్వలేద‌ని కూడా ఆవేద‌న వ్య‌క్తం చేసారు. భాష ప్రాంతం అడ్డంకులను బ్రేక్ చేసినందుకు SS రాజమౌళి RRR ను ప్ర‌శంసించారు.తన చిత్రం రుద్రవీణ‌ను నర్గీస్ దత్ అవార్డుతో సత్కరిస్తున్నప్పుడు ఢిల్లీలో జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు.

అవార్డు ప్రదానోత్సవానికి ఒకరోజు ముందు ప్రభుత్వం సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులకు హై టీ ఏర్పాటు చేసింది. భారతీయ సినిమా చరిత్రను చాటిచెప్పే గోడను ప‌రిశీల‌న‌గా చూసాన‌ని చిరంజీవి తెలిపారు. పృథ్వీరాజ్ కపూర్ నుండి అమితాబ్ బచ్చన్ వంటి హిందీ చిత్ర పరిశ్రమ ప్ర‌ముఖుల‌కు మాత్ర‌మే ఆ గోడ‌పై స్థానం ఉంది. కానీ దక్షిణ భారత చిత్ర పరిశ్రమకు చెందిన ఐకాన్‌లు ఎవ‌రూ అక్క‌డ లేరు. నేను దక్షిణాది సినిమాల్లో ఎవ‌రో ఒక ప్ర‌ముఖుడి ఫోటో ఒకటి చూడాలనే ఆశతో నడుస్తూనే ఉన్నాను. అయితే అందులో జయలలితతో ఎంజీఆర్ ఉన్న స్టిల్, ప్రేమ్ నజీర్ ఫోటో మాత్రమే ఉంది అని చిరంజీవి అన్నారు.

రాజ్‌కుమార్‌, విష్ణువర్ధన్‌, ఎన్‌టీ రామారావు, నాగేశ్వరరావు, శివాజీ గణేశన్‌ వంటి దిగ్గజాలు లేక తెలుగు పరిశ్రమలోని దిగ్గజ సినీ నిర్మాతలు కూడా గుర్తింపు పొందలేదని చిరంజీవి గుర్తు చేశారు. ఆ సమయంలో నేను చాలా అవమానంగా భావించాను.. అని ఆయన గుర్తు చేసుకున్నారు. హిందీ సినిమాను భారతీయ సినిమాగా చిత్రీకరిస్తున్నారని ఇతర చిత్రాలను 'ప్రాంతీయ చిత్రాలు'గా వర్గీకరించారని వాటికి గౌరవం ఇవ్వలేదని మెగాస్టార్ అన్నారు.

ఈ రోజు బాహుబలి, RRR, పుష్ప, KGF చాప్టర్ 2 (క‌న్న‌డం) వంటి చిత్రాలు పాన్ ఇండియా స్థాయికి చేరుకున్నాయని చిరంజీవి వ్యాఖ్యానించాపారు. ప్రాంతీయ - హిందీ సినిమాల మధ్య విభజనను తొలగించడంలో బాహుబలి కీలక పాత్ర పోషించింద‌ని భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అందరూ భాగమేనని నిరూపించినందున బాహుబలి తనను గర్వించేలా చేసిందని మెగాస్టార్ అన్నారు.

నేడు అన్ని అడ్డంకుల‌ను అధిగ‌మించి నిజ‌మైన విజేత‌గా నిలిచాడు అల్లు అర్జున్. తెలుగు సినిమా ఐకాన్ స్టార్‌గా చెర‌గ‌ని ముద్ర వేసాడు. తొలి తెలుగు జాతీయ ఉత్త‌మ న‌టుడిగా బ‌న్ని చ‌రిత్ర సృష్టించాడు. అయితే అల్లు అర్జున్ కంటే ముందే చిరంజీవి కానీ ఎన్టీఆర్, ఏఎన్నార్ కానీ ఇత‌ర అగ్ర హీరోలు కానీ జాతీయ అవార్డ్ అందుకునేంత గొప్ప ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌లేదా? అంటే అన్నిటికీ స‌మాధానం మెగాస్టార్ చిరంజీవి దిల్లీ ప‌ర్య‌ట‌న మిగిల్చిన‌ ఆవేద‌న స‌మాధానంగా నిలిచింద‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు.