'విశ్వంభర' పీకే లాంటి ప్రయోగమా?
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో 'విశ్వంభర' భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 5 July 2024 10:01 AM GMTమెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో 'విశ్వంభర' భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత చిరు చేస్తోన్న సోషియా ఫాంటసీ థ్రిల్లర్ ఇది. ఇప్పటికే షూటింగ్ క్లైమాక్స్ కి చేరుకుంది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరుగుతోంది. అక్కడ నిర్మించిన ప్రత్యేకమైన సెట్లో మెగాస్టార్ సహా కీలక నటులంతా షూట్ లో పాల్గొంటున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం లీకైంది. సినిమాలో గ్రహాంతర వాసులు కూడా కనిపిస్తారుట. ప్రస్తుతం షూటింగ్ ఆ పాత్రలకు సంబంధించే సెట్ లో జరుగుతుందని, ఆ పాత్రలతో సన్నివేశాలు ఉన్న నటులంతా పాల్గొంటున్నారని సమాచారం. ఇది ఫాంటసీ కథన్నది తెలిసిన వాస్తవం. అయితే ఇప్పుడున్న టెక్నాలజీని, సైన్స్ కి అందని ఎన్నో విషయాల్ని సినిమాలో చర్చిస్తున్నారుట.
అలా సినిమలో ఏలియన్స్ కూడా భాగమవుతున్నట్లు లీకులందుతున్నాయి. పాంటసీ కథ అంటే రకరకాల లోకాలుంటాయి. అందులో ఓ లోకం నుంచి ఊడిపడిన ఏలియన్స్ గురించి సినిమాలో చర్చిస్తున్నట్లు లీకులందుతున్నాయి. ఈ ఏలియన్ ఎపిసోడ్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోందని, అక్కడ చిరు చేసే కామెడీ ఈ చిత్రానికి మరో హైలెట్ అని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇదే నిజమైతే తెలుగు పరిశ్రమలో ఇదో చరిత్ర అవుతుంది. ఇంతవరకూ ఏలియన్స్ పై తెలుగులో ఎలాంటి సినిమాలు చేయలేదు. హిందీలో మాత్రం అమీర్ ఖాన్ హీరోగా నటించిన పీకే చిత్రం అలాంటి ప్రయోగమే. రాజ్ కుమార్ హీరాణి పూర్తిగా ఏలియన్ ఆధారంగానే ఆ చిత్రాన్ని రూపొందించి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించారు. మరి ఈ ఏలియన్ సెంటిమెంట్ ఉంటే గనుక విశ్వంభరకి ఎలా కలిసొస్తుందన్నది చూడాలి.