చియాన్ విక్రమ్ లెగసీని సజావుగా నడిపిస్తున్నాడా?
బైసన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఒళ్లంతా చెమటలతో తడిసి ముద్దయి కనిపిస్తున్నాడు. అతడు జెర్సీ ధరించాడు. ఇది క్రీడా నేపథ్య చిత్రం అని టీమ్ ప్రకటించింది.
By: Tupaki Desk | 9 March 2025 5:51 AMనిజానికి తండ్రుల లెగసీని ముందుకు నడిపించడం నటవారసులకు అంత సులువైన పని కాదు. మహేష్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లా వందశాతం సక్సెసయ్యే నటవారసులు ఇండస్ట్రీలో చాలా అరుదు. టాలీవుడ్, బాలీవుడ్ లో కొందరు స్టార్ల నటవాసులను పరిశీలిస్తే ఈ మాట చెప్పగలం. తండ్రి, తాత ముత్తాతలు పెద్ద స్టార్లుగా ఏలినవారైతే, అలాంటి వారసత్వాన్ని ముందుకు నడిపించడం ఎంతో ప్రయాసతో కూడుకున్నది. తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. నటవారసుడు చాలా హార్డ్ వర్క్, డెడికేషన్ తో పని చేయాల్సి ఉంటుంది.
అభిషేక్ బచ్చన్ లాంటి స్టార్ ఎంత హార్డ్ వర్క్ చేసినా తన తండ్రి అమితాబ్ బచ్చన్ స్థాయిని అందుకోలేకపోయారు. ఇప్పుడు అమీర్ ఖాన్ వారసుడు జునైద్ ఖాన్ నటుడిగా ఆకట్టుకుంటున్నా కానీ, ఎందుకనో కమర్షియల్ గా అతడికి మైలేజ్ రావడం లేదు. అంటే అతడిలో ఏదో లోపం ఉందని దీనర్థం.
ఇప్పుడు తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ వారసుడి వంతు. విక్రమ్ లెగసీని ముందుకు నడిపించేందుకు వారసుడు ధృవ్ చాలా శ్రమిస్తున్నాడు. కింగ్ నాగార్జున నటవారసుడు అక్కినేని అఖిల్ లా డెడికేషన్ తో పని చేస్తున్నాడు ధృవ్. జయాపజయాలతో సంబంధం లేకుండా ఈ స్టార్ కిడ్స్ నిజంగా హార్డ్ వర్కర్స్. ధృవ్ తదుపరి మారి సెల్వరాజ్ దర్శకత్వంలో బైసన్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం నుంచి ధృవ్ విక్రమ్ ఇంటెన్స్ లుక్ విడుదలైంది.
బైసన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఒళ్లంతా చెమటలతో తడిసి ముద్దయి కనిపిస్తున్నాడు. అతడు జెర్సీ ధరించాడు. ఇది క్రీడా నేపథ్య చిత్రం అని టీమ్ ప్రకటించింది. తనయుడిని ఒక స్ఫూర్తివంతమైన క్రీడా నేపథ్య చిత్రంలో చూడాలని విక్రమ్ ప్లాన్ చేసారని కూడా అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది. క్రీడా నేపథ్య చిత్రం కోసం తన రక్తమాంసాలను ఖర్చు చేసి శ్రమించానని ధృవ్ అన్నాడు. ఈ చిత్రంలో రజిషా విజయన్, అనుపమ పరమేశ్వరన్ కూడా కథానాయికలుగా నటిస్తున్నారు. తిరునెల్వేలి, చెన్నైలలో ఈ సినిమాని చిత్రీకరించారు.
అయితే జాతీయ ఉత్తమ నటుడు విక్రమ్ నటవారసత్వాన్ని ముందుకు తీసుకుని వెళ్లడం ధృవ్ కి నిజంగా సవాళ్లత కూడుకున్నది. విక్రమ్ తన కెరీర్ ఆద్యంతం ప్రయోగాత్మక చిత్రాల్లో నటించాడ. ప్రతిసారీ నటనా వైవిధ్యంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. కమల్ హాసన్ తర్వాత అంతగా ప్రయోగాలు చేసిన హీరో విక్రమ్. అందుకే అతడికి తమిళ చిత్రసీమలో జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రత్యేక స్థానం ఉంది. దానిని కాపాడటానికి ఇప్పుడు వారసుడు ధృవ్ చాలా చేయాల్సి ఉంటుంది. ఈ నటవారసుడి భవితవ్యం ఎలా ఉండనుందో వేచి చూడాల్సిందే.