ఐటమ్ పాటకు కొరియోగ్రాఫర్ల ఫీజు ఎంత?
ఇటీవలి కాలంలో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ ఐటమ్ పాటలకు ఎంతో ప్రాధాన్యత పెరిగింది
By: Tupaki Desk | 7 Dec 2023 2:30 AM GMTఇటీవలి కాలంలో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ ఐటమ్ పాటలకు ఎంతో ప్రాధాన్యత పెరిగింది. ప్రతి స్టార్ హీరో సినిమాలో ఐటమ్ పాటను విధిగా ప్రదర్శించేందుకు దర్శకనిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారు. థియేటర్లలో యూత్, మాస్ ఆడియెన్‌ని ఒక ఊపు ఊపేది ఐటమ్ నంబర్. అందుకే దీనిపై ఇంతటి శ్రద్ధ పెడుతున్నారు.
ఒక్కో ఐటమ్ నంబర్ కి ఎంపిక చేసుకున్న డ్యాన్సింగ్ క్వీన్ ని బట్టి, బ్యాక్ గ్రౌండ్ కాన్వాస్ ని బట్టి ఖర్చు ఉంటుంది. ఒక ఐటమ్ నంబర్ కి అగ్ర కథానాయికలు 2-3 కోట్లు అందుకున్న సందర్భాలున్నాయి. కత్రిన, కరీనా లాంటి భామల రేంజు ఆ లెవల్లో ఉందని కథనాలొచ్చాయి. సన్నీలియోన్ తో ఐటమ్ నంబర్ కు 80లక్షల నుంచి 90 లక్షల రేంజు వసూలు చేసిందని కూడా ప్రచారమైంది. కాజల్, తమన్నా, రాయ్ లక్ష్మీ సైతం లక్షల్లో ఐటమ్ నంబర్ల కోసం అందుకున్నారు.
అయితే భారీ బడ్జెట్ సినిమాల్లో పాపులర్ ఐటమ్ భామలను ఎంపిక చేసుకుని భారీ సెట్లు వేసి ఐటమ్ నంబర్ ని పూర్తి చేయాలంటే అయ్యే ఖర్చు 3-4 కోట్లు దాటుతుందని అంచనా. అలా కాకుండా ఒక విదేశీ భామతో కొందరు ప్రతిభావంతులైన కొరియోగ్రాఫర్లు, డ్యాన్సర్ల బృందంతో మినిమంగా సెట్లు నిర్మించి ఐటమ్ పాటను చిత్రీకరించినా సుమారు 2.5 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.
ఐటమ్ భామకు ఎంత ఇస్తున్నారు? అన్నది అటుంచితే ఈ పాటలు ఒక్కొక్కటి చిత్రీకరించడానికి దాదాపు రూ.2.5 కోట్లు పైగా ఖర్చవుతాయి. ఈ పాటల్లో ఆర్ట్ సెటప్‌లు, స్టూడియో అద్దెలు, మేకింగ్ ఛార్జీలు వగైరా కోటి వరకూ ఖర్చవుతుందని సమాచారం. భారీ సెట్ల కోసం లక్షల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలాగే కొరియోగ్రాఫర్లు వారి రేంజును బట్టి పారితోషికం తీసుకుంటున్నారు. మినిమంగా 10లక్షల నుంచి 15లక్షల మధ్య పారితోషికాలు అందుకుంటున్నారన్న సమాచారం ఉంది. అలాగే డ్యాన్సర్లకు దాదాపు రూ.80 లక్షలు ఖర్చవుతుందని అంచనా. ఒక్కో డ్యాన్సర్ కి రోజుకు 10వేలు ఇచ్చినా నాలుగు రోజులకు 40వేలు ఇవ్వాలి. ఇక ఈ పాటలో నర్తించేందుకు ఔట్ డోర్ నుంచి వచ్చే వారికోసం విమానం- ట్రైన్ ఛార్జీలు, బస వగైరా ఛార్జీలు అదనం.
ఐటమ్ నంబర్ కానీ, కీలకమైన సీన్లు కానీ ఏవైనా చిత్రీకరించాలంటే సెట్లో కారవ్యాన్ తప్పనిసరి. ఇక కాస్ట్యూమ్స్ .. మేకప్.. ఇతర మెటీరియల్ ఖర్చులు ఉండనే ఉంటాయి. ఇవన్నీ కలిపి ఒక సాధారణ బడ్జెట్ అనుకుంటే మినిమంగా 2.5కోట్ల ఖర్చవుతోందని అంచనా. పాట ప్రజలకు రీచ్ అయిందా లేదా? అన్నది అటుంచితే ముందు అంత పెద్ద మొత్తం ఖర్చు చేయాల్సిందేనని ప్రముఖ నిర్మాత విశ్లేషించారు.