బాండ్ ఫ్రాంఛైజీలోకి క్రిస్టఫర్ నోలాన్
అయితే జేమ్స్ బాండ్ ఫ్రాంచైజీలో చివరి సినిమాని విడుదల చేస్తున్నామని ఇంతకుముందు ఒరిజినల్ నిర్మాణ సంస్థ పేర్కొంది.
By: Tupaki Desk | 7 March 2025 10:04 PM ISTగూఢచారి కథలతో కొన్ని దశాబ్ధాల పాటు రన్ అయిన ఫ్రాంఛైజీ- జేమ్స్ బాండ్ 007. ఈ ఫ్రాంచైజీలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చి బ్లాక్ బస్టర్లు సాధించాయి. గొప్ప సాహసాలు, గగుర్పాటుకు గురి చేసే అసాధారణ స్టంట్స్ తో బాండ్ సిరీస్ కథానాయకుడు కట్టి పడేస్తాడు. ఈ ఫ్రాంఛైజీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే జేమ్స్ బాండ్ ఫ్రాంచైజీలో చివరి సినిమాని విడుదల చేస్తున్నామని ఇంతకుముందు ఒరిజినల్ నిర్మాణ సంస్థ పేర్కొంది.
కానీ ఇటీవల బాండ్ ఫ్రాంఛైజీని అమెజాన్ టేకోవర్ చేయడం సంచలనమైంది. అటుపై వేగంగా పరిస్థితులు మారిపోతున్నాయి. జేమ్స్ బాండ్ ఫ్రాంచైజీని పునరుద్ధరించాలని పరిశ్రమ నిపుణులు క్రిస్టోఫర్ నోలన్‌ను సిఫార్సు చేస్తున్నారు. ఫ్రాంచైజ్ ప్రతిష్టను కాపాడుకోవడానికి ప్రశంసలు పొందిన దర్శకుడిని ఎంపిక చేయడం చాలా అవసరమని భావిస్తున్నారు. అమెజాన్ - నోలన్ మధ్య పరస్పరం ఆసక్తి ఉందనే హింట్ అందింది. తమ కలయిక గురించి చర్చలు జరుగుతున్నాయి.
బాండ్ ఫ్రాంఛైజీని పునరుద్ధరించి, బ్లాక్‌బస్టర్ హిట్‌ను ఖాయం చేసుకోవాలనే ఉత్సాహం ఇరువర్గాల్లో కనిపిస్తోంది. క్రిస్టోఫర్ నోలన్‌ను దర్శకుడిగా చేర్చుకోవాలని ఎంజిఎం సంస్థ గట్టి పంతంతో ఉందని పరిశ్రమ నిపుణులు సూచిస్తున్నారు. దార్శనిక ఫిలింమేకర్ నోలాన్ ను ఒప్పించడానికి ఓపిక అవసరం కావచ్చు అని విశ్లేషిస్తున్నారు.
క్రిస్టోఫర్ నోలన్‌ను ఒప్పించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని అవసరమైనంత కాలం అతని కోసం వేచి ఉండటానికి సిద్ధంగా ఉండాలని ఒక నిర్మాత సూచించారు. రెండు వైపుల నుంచి ఆసక్తి నెలకొందని కూడా తెలుస్తోంది.
జేమ్స్ బాండ్ ఫ్రాంచైజీ పై నోలన్ పలుమార్లు బహిరంగంగా ప్రశంసించారు. తన చిత్రనిర్మాణ శైలిపై బాండ్ సినిమాల ప్రభావాన్ని అంగీకరించాడు. బాండ్ సినిమాకి దర్శకత్వం వహించాలనే ఆసక్తి అతడిలో పుష్కలంగా ఉంది. ఇప్పుడు ఆ అవకాశం అతడిని వెతుక్కుంటూ వస్తోంది.
బాండ్ సినిమాను దర్శకత్వం వహించే అవకాశాన్ని ఒక అద్భుతమైన గౌరవంగా నోలన్ అభివర్ణించాడు. జేమ్స్ బాండ్ సినిమాకు దర్శకత్వం వహించడానికి స్క్రిప్టింగ్ నుండి నటీనటుల ఎంపిక వరకు అంతకు మించి పూర్తి సృజనాత్మక ప్రమేయం అవసరమని నోలన్ నొక్కి చెప్పాడు.